పురాణములు పద్నాలుగు లోకములున్నవని చెప్పుచున్నవి. దీనికి ఏదో అజ్ఞానులు చెప్పే అర్ధమును తీసికొని పాతాళలోకము. ఉత్తమలోకము అని విభజించుచున్నారు. అయితే ఈ లోకములన్నీ మనము ధరించే. ప్రేమించే దేహమునందే ఉన్నవి. ఏడు లోకములు పైనా, ఏడు లోకములు క్రిందా, మన దేహమునకు పైభాగమేది? ఆదేశిరస్సు, త్రికుట స్థానము, ఉత్తమ లోకము. అక్కడే ఏడు లోకములున్నాయి.
గరుడలోకము, గంధర్వలోకము. యక్షలోకము, కిన్నెరలోకము, కింపురుషలోకము అన్ని శిరస్సులోనే ఉన్నవి. గరుడలోకము: ముక్కు. ఇది గరుడుని వలె ఉంటుంది. ఉచ్చ్వాస. నిశ్వాసములకు ఆధారమైన లోకము. రెండవది గంధర్వలోకము: కనులు యక్షలోకమే నోరు కిన్నెరలోకము: చెవులు, కింపురుషలోకము: స్పర్శ. అనగా, గరుడలోకము 1. గంధర్వలోకములు 2. అందువలన ఇవి 3 అవుతాయి. యక్షలోకము నోరు నాల్గవది. కిన్నెరలోకములు రెండు చెవులు చేరి ఆరు. కింపురుషలోకము స్పర్శ ఒకటి. అన్ని చేరి ఏడు. సప్తలోకములు, ఊర్ధ్వలోకములు.
వీటిని అనుసరించినవారు పవిత్రమైన మానవత్వమును గుర్తించినవారని చెప్పవచ్చు. అనగా మంచిని వినటము, మంచిని చెప్పటము. మంచిని శ్వాసముగా తీసికోవడము, మంచిని చూడటము.... కనుక, ఈ ఏడు లోకములు మానవత్వానికి మకుటము పెట్టేటివి. మొగ్గలు తొడిగేవి. కన్నులనిచ్చిన దెందుకు దెలుసునా? అన్నీ చూచేటందుకా?
కాదు, కాదు:
కైలాస వాసుని కనులార
గాంచే టందుకురా!
అందువలన మనము కన్నులతో దివ్యత్వాన్ని చూడాలి. అందరియందును పవిత్రమైన భావాలను కల్పించాలి. దీనికోసమే భగవంతుడు కన్నులిచ్చాడు గాని, "ఎవరెట్లున్నారు? ఎవరు బజారుకు వెళ్ళినారు; ఏ సినిమాకు పోతున్నారు" ఇవన్నింటిని చూడడానికి భగవంతుడు కన్నులివ్వలేదు.
భోజనమును అందించుటకు కాదు భగవంతుడు నోటివచ్చినది. పవిత్రమైన వాక్కును పలికేటందుకు భగవంతుడు నాలుక నిచ్చాడు.
ఎవరైనా మంచి చెప్పుకుంటే చెవులు ఒక్కటిగా చేరవు; ఎవరైనా రహస్యాలు చెప్పుతుంటే, రెండూ ఏకమైపోతాయి.
దీనికోసమా భగవంతుడు చెవుల నిచ్చింది? కనుక ఈ ఏడు లోకములను ఈ ఏడు అవయవములను సక్రమముగా పవిత్రముగా ఉపయోగించినప్పుడు మరొక దివ్యత్వము. ఇంతకంటే మోక్షము కానరాదు.
మనము సక్రమ మార్గమున పెట్టవలసినది. ఈ ఏడు లోకములనే. మిగిలినవన్నీ దేహసంరక్షణార్థమై వచ్చి నవే. పై ఏడు లోకములను కాపాడే నిమిత్తమై క్రింది ఏడు లోకములేర్పడినవి. ఏమిటి ఈ ఏడులోకములు?
మొదటిది చేతులు, హస్తలోకములు రెండు. కడుపు మూడవలోకము, పెట్రోల్ టాంకువలె ఉంటుంది. దానిలో పదార్థములను వేసినప్పుడే. సర్వాంగములును క్షేమముగా పనులు చేస్తుంటాయి. మనము సక్రమమైన పనులు చేయుటములేదుగాని పొట్టను మాత్రము నింపుకోవడం జరుగుచున్నది. పొట్టలో వేసిన పదార్థములుతో ప్రాణాన్ని - సద్వినియోగము చేస్తున్నామా సత్కర్మలలో వినియోగిస్తున్నామా అనేది విచారించాలి. తదుపరి మర్మ గ్రంధులు, తదుపరి రెండు కాళ్లు ఇవన్నీ చేర్చి ఏడు, ఇవన్నీ అధోలోకములు, వీటినే పాతాళలోకములు అందురు.
అయితే ఈ రెండూ అవసరమే. ఊర్వలోకము యొక్క క్షేమము అధోలోకముపై ఆధారపడియుండినది. పాతాళలోకమే లేకపోతే, ఉత్తమలోకముండడానికి వీలు లేదు. కానీ, రెండింటికీ సన్నిహిత సంబంధమేర్పరచాలి. సుఖమునుంచి సుఖములభించదు. కష్టము నుండే సుఖము లభిస్తుంది.
(స.పా...82 పు.195)