ప్రపంచానికి ప్రధానమైనవి ఐదు ఉన్నాయి. అవియే పంచభూతాలు. గాలిది ఏకులం? నిప్పుది ఏకులం? నీటిది ఏ కులం? భూమిది ఏ కులం? ఒక మానవునికే వచ్చిందా ఈ కులతత్వం ?
కులమత ద్వేషాలు పోవాలి. యూనిటి లేక పోవుట చేత, డివినిటి (divinity) కూడా ఉండదు.
(Unity, Purity. Divinity) యూనిటి, ప్యూరిటీ, డివినిటి. ఈ మూడూ విడిచి కమ్యూనిటీని పట్టుకుంటావా? అది నిన్ను రక్షిస్తుందా? దేశాన్ని కాపాడుతుందా?
అందరిలో ఉన్నది ఒక్కటే ఆత్మతత్వము అని గుర్తించాలి. జాతిమత కులబేధాలు పాటించకూడదు.
మానవులందరిదీ ఒక్కటే జాతి - మానవజాతి.
(దే.యు. పు. 41)
ఒకే దైవమునకు అనేక నామములు, రూపములుండ వచ్చును. కాని దైవత్వము మాత్రము ఒక్కటే. అన్ని మతముల వారు భారతదేశము నందున్నారు. అనేక కులముల వారు వున్నారు. కులము అంటే ఏమిటి? ఒక చిన్న విషయం మీరు గుర్తించాలి. ఈనాడు. రెడ్లనీ, కాపులనీ, కమ్మవారని, బ్రాహ్మణులని చెప్పుకుంటాం. ఈ భేదములు ఎట్లు ఏర్పడినవి?
బ్రాహ్మణాస్య ముఖమాసీత్ ! బాహూ రాజన్యః కృతః
ఊరూ తదన్య యద్వైశ్య: పాద్భ్యాం శూద్రో అజాయతః||
ముఖం అనేది బ్రాహ్మణులు, భుజం అనేది క్షత్రియులు, ఊరువు (తొడలు) అనేది వైశ్యులు, పాదం అనేది శూద్రులు, అని దీని అర్థము. అంతేకాని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులనేవి తెగలు కావు. అయితే యిందులో ఏది ప్రధానం? ఏది ఆధారము అంటే మానవ దేహమునకు కాళ్ళు ప్రధానం. కాళ్ళు లేకుండా తొడలుండులకు వీలుకాదు, తొడలు లేకుండా భుజములు, భుజములు లేకుండ తల ఉండుటకు వీలులేదు. .
ఇందులో తల చేయవలసిన పని ఏమిటి? తల లోపల పంచభూతము లుంటున్నాయి. అంటే తల చాలా ప్రధానమైనది. (శబ్ద స్పర్శ, రూప, రస, గంధ) చూచే నేత్రములు, వినే చెవులు, వాసన చూసే ముక్కు, రుచిచేసే నోరు, యివన్నీ ముఖమునందే వుంటున్నాయి. కనుక యీ బ్రాహ్మణత్వమనే ముఖానికి చాలా (Responsibilty) జవాబుదారి అంటే బాధ్యత ఉంటుంది. ఈ ముఖమనే బ్రాహ్మణత్వం ఏం చేస్తున్నది? పంచ భూతములతో పంచేద్రియములకు తగిన క్రియలను అందిస్తుంది. ఇట్టి ప్రధాన బాధ్యత కలిగిన ముఖాన్ని రక్షించే నిమిత్తమేర్పడినవి భుజములు. భుజబలము చేత జీవితాన్ని పోషించే నిమిత్తమై ఏర్పడనవి తొడలు. ఈ రెండింటిని ఆధారం చేసుకుని అక్కడివి యిక్కడ - యిక్కడవి అక్కడ అనేక రకములుగా ప్రోగు చేసుకొని యీ దేహమును పోషించేవి పాదములు. దీనివలననే చెప్పారు.
శాస్త్రంబు నెప్పుడు సత్యంబుగా నెంచు
వేదసమ్మతంబగు విప్రులారా!
దేశంబు కొరకునై దేహమర్పణచేసి
రక్షించే రాజాధి రాజులారా!
వ్యవసాయ వృద్ధిచే వర్ధిల్లుచుండెడి సుఖజీవనము చేయు శూద్రులారా!
ధన ధాన్యములు కలిగి ధర్మగుణంబుచే వరలు చుండెడి ఆర్యవైశ్యులారా!
మనము చేయవలసిన కర్తవ్యము లనేకము లుండినపుడు, మనము ఏ విధమైన అపోహలకు గురికాకూడదు. బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య శూద్రత్వ మన్నది ఒక్క దేహంలోని అంగాలే. ఈ అంగములలో ఏ ఒక్కటైనా పని చేయకపోతే మరొకటి చేయదు. కనుక దేహంలో వున్న అంగములు వేరైనప్పటికిని అన్నీ కలిసి పని చేయాలి. ఒకచిన్న ఉదాహరణ: గుండెల్లో, ముఖములో, భుజములో, పాదములలో ప్రవహించేది ఒక రక్తమే. కాని బ్రాహ్మణుడనే ముఖానికి ఒక గుండెలేదు. వైశ్యుడనే తొడల లోపల ఒక గుండె లేదు. క్షత్రియుడనే భుజములలో ఒక గుండె లేదు. ఈ నాలుగు అంగములు ఒకే గుండెపై ఆధారపడి వున్నవి. కనుక గుడిలేని గ్రామము, గుండెలేని దేహము ప్రయోజనము లేనట్టివే.
స్వరూపములు వేరైనా సర్వులలో ఐకమత్యమును, అన్యోన్యత్వమును, సమత్వమును నిరూపించే నిమిత్తమై దేశరక్షణ నిమిత్తమై ఆనాడు యివన్నీ యేర్పడినవి. కొంత మంది వాదిస్తూంటారు. ఒక్క మన భారతదేశములోనే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే కులాలున్నాయి అని. ఇది చాలా పొరపాటు. మిగతా దేశములలో లేవనుకోరాదు. ఈనాడు భారత దేశములో బ్రాహ్మణులనే వారిని పాశ్చాత్య దేశాలలో ఫాదర్స్ (Fathers) అంటుంటారు. మనం క్షత్రియులం అంటుంటే వారు సైన్యం (Army) అంటున్నారు. మనం వైశ్యులంటే వారు Business men అని పిలుస్తున్నారు. శూద్రులను (Labour) కార్మిక వర్గమని పిలుస్తున్నారు. ఈ నాలుగు భాగములు సర్వదేశములందు ఉంటున్నాయి. అయితే ఈ నాలుగు భాగాలు ఆత్మపరిశీలన నిమిత్తమై దేశ సౌభాగ్య నిమిత్తమై మానవత్వమును కాపాడే నిమిత్తమై ఏర్పడినవి. యీ విధమైన తెగలుగా భావించుకొనుట చాలా పొరపాటు. ఇది మన అజ్ఞానము. శూద్రత్వ మనగా నేమిటి? శ్రమించి పనిచేసేవారు అని అర్థము. అంతే గాని ప్రత్యేకమయిన తెగగా భావించరాదు. ఇటువంటి ధర్మస్వరూపాన్ని నిరూపించేది భారతీయ సంస్కృతి. కనుక మనము పిల్లలకు “నాయనా! దైవత్వము ఒకటే దివ్యత్వము ఒక్కటే. చేశములు భిన్నములు, ఆచారములు భిన్నములు, మతములు భిన్నములు, మార్గంబులు భిన్నములు. కానీ గమ్యము మాత్రము ఒక్కటే". ఈ సత్యాన్ని సమత్వాన్ని మనం పిల్లలకు బోధించాలి.
(శ్రీప. ది. పు. 46/49)