ఈ శరీరమునకు తల్లి ఈశ్వరమ్మ. మొట్టమొదట ఆమె పేరు నామగిరమ్మ. కానీ, వివాహమైన తరువాత ఈ శరీరమునకు తాత అయినటువంటి కొండమరాజు ఆమెకు ఈశ్వరమ్మ అని పేరు పెట్టాడు. ఆయన మహా జ్ఞాని, దివ్యదృష్టి గలవాడు. నిరంతరము వెంకావధూలను ఆరాధన చేసేవాడు. ఆయనకు పెద వెంకమరాజు, చిన వెంకమరాజు అని ఇరువురు కుమారులు. పెదవెంకమరాజు ఈ శరీరమునకు తండ్రి. కొండమరాజు తమ్మునికి కూడా ఇరువురు కుమారులుండేవారు. మొదటివాడు సుబ్బరాజు, రెండవవాడు వెంకట్రామరాజు, ఈ నలుగురు కుమారులు కలసిమెలసి జీవించేవారు. వారిది ఉమ్మడి కుటుంబం. ఐతే, కుమారులు అన్నదమ్ములవుతారుగాని, వచ్చిన కోడళ్ళు అక్క చెల్లెళ్ళు అవుతారా? కొంతకాలానికి ఆడవారివలన ఆ నల్గురు అన్నదమ్ములలో అభిప్రాయ భేదాలు కలిగి, విడిపోవాలని సంకల్పించుకున్నారు. “ఉన్నదంతా మీరు నల్గురూ పంచుకోండి, నాకేమీ అక్కర లేదు" అన్నాడు కొండమరాజు. మీరు మాలో ఒక్కొక్కరి దగ్గర ఆరేసి నెలల చొప్పున కాలం గడపండి" అని కోరారు కొడుకులు. కానీ, కొండమరాజు అంగీకరించ లేదు. "నేను మీ ఇళ్ళకు రాను, మీ అన్నము నాకు అక్కర లేదు. నేను సంపాదించినది మీరు నల్గురూ సమంగా పంచుకోండి. ఐతే ఒక్క ఆస్తిని మాత్రం నాకివ్వండి" అన్నాడు. ఏమిటది? అని కుమారులు ఆడుగగా, “సత్యంను నాకివ్వండి. ఈ అబ్బాయి ఒక్కడూ నా దగ్గరుంటే చాలు, నాకింక ఎవ్వరూ అక్కర్లేదు" అన్నాడు. "సత్యం! నా వెంట వస్తావా?" అని అడిగాడు. తప్పక వస్తానని అతని వెంట వెళ్ళాను. అప్పుడు ఈ శరీరమునకు ఎనిమిది సంవత్సరములు. ఆయన ఒక చిన్న గది తీసుకున్నాడు.
ప్రతి రోజు నా పని ఏమిటి? తెల్లవారి లేవటం, పాత్రలు తోమటం, అన్నము, కూరలు వండటం, తిరిగి బుక్కపట్నం స్కూలుకు పరుగెత్తుకుని పోవటం. అక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనానికి గంట కొట్టేవారు. అప్పుడు అక్కడి నుండి పుట్టపర్తికి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు వడ్డించి, నేను భుజించి తిరిగి పరుగెత్తుకొని పోయేవాడిని. ఈ విధంగా, ప్రతి రోజు టైమ్ తప్పకుండా చేస్తూ వచ్చాను. పుట్టినప్పటి నుండి నేను తీపి ముట్టలేదు. ఎందుకంటే, నేను తీపి తీసుకుంటే వేలాది భక్తులు తీపులు తీసుకొని వస్తారు. నేను ఒక ఫలమును కూడా తీసుకునే వాడను కాదు. పాలుగాని, పెరుగుగాని ముట్టేవాడను కాదు. అతి సామాన్యమైన ఆహారం - ఇంత సంకటి, ఇంత వేరుసెనగ పచ్చడి - భుజించేవాడిని. కొండమరాజు కూడా దీనికి తృప్తి పడేవాడు. "నీవు ఏది తింటావో అదే నాకు పెట్టు నాయనా!" అనేవాడు.
నేను తెల్లవారు ఝామున లేస్తూనే సంకటి చేసి, పచ్చడి, లేక ఆకు కూర వండి పెట్టేవాడిని. నా వంట అంటే ఆ వీధి వారందరికీ చాల ఇష్టం.నేను బుక్కపట్నం నుండి ఇంటికి వచ్చేటప్పటికి ఆ వీధిలో జ్వరం వచ్చిన వారందరూ వణుకుతూ ఇంటి ముందు లైనుగా కూర్చునేవారు. నేను వస్తూనే కొండమరాజు"నాయనా! వారందరూ జ్వరంలో బాధ పడుతున్నారు. నీవు పెట్టేమిరియాల చారు కావాలట. తక్షణమే చేసి వారికిచ్చి పంపించు" అనేవాడు. తక్షణమే నేను మిరియాల చారు చేసి వారి గ్లాసుల్లో పోసేవాడిని. దానితో జ్వరం తగ్గిపోయిందని వారు ఆనందించేవారు. పాత కాలంలో పల్లెల్లో ఉన్న పద్ధతులకు, ఇప్పుడున్న పద్ధతులకు చాల వ్యత్యాసం ఉన్నది. ఉగాది, సంక్రాంతి మొదలైన పండుగలు వచ్చినప్పుడు ఇళ్లకు చాకలి, మంగలి వచ్చి భోజనం తీసుకుపోయేవారు. ఇంట్లో నేను, కొండమరాజు తప్ప ఎవ్వరూ లేరు. కనుక, పండుగ రోజుల్లో నేనే అందరికీ వంట చేసేవాడిని. పండుగలు వచ్చినప్పుడు పార్వతమ్మ, వెంకమ్మ, ఈశ్వరమ్మ వారి వారి ఇళ్ళలో బొబ్బట్లు చేసుకునేవారు. వారు చేస్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు చేయకూడదని నేను కూడా ముసలాయనకు బొబ్బట్లు చేసి పెట్టేవాడిని. చాకలికి, మంగలికి కూడా బాగా పెట్టి పంపేవాడిని. ఒక పండుగ రోజున నేను, ముసలాయన భోజనం చేస్తున్న సమయంలో ఏదో పని పైన పెద వెంకమరాజు ఇంటికి వచ్చాడు. కొండమరాజు, "నాయనా! ఈ పండుగ రోజున నీవు కూడా ఇక్కడే మాతోపాటు భోజనం చేయి" అన్నాడు. ఆయన కూడా కూర్చుని భోజనంచేశాడు. వంటకాలు చాల రుచిగా ఉన్నాయని మెచ్చుకున్నాడు. "ఈ ఆడవారికి ఏమి జబ్బోగాని, వంట రుచిగా చేయనే చేయరు" ఆన్నాడు. ఇంటికి పోయి ఈశ్వరమ్మను, వెంకమ్మను ఊరికే తిట్టాడు. "సత్యంను చూడండి, ఎంత బాగా చేస్తున్నాడు! రేపటి నుండి మీరు సత్యం వద్దకు వెళ్ళి అతను ఏమి చేస్తే అది తీసుకు రండి. అదే నేను తింటాను" అన్నాడు. వారు వచ్చి, "నీవల్ల ఇంట్లో మాకు తిట్లు పడుతున్నాయి. ఎందుకింత మంచిగా చేస్తావు వంట?" అని నన్ను తిట్టారు. ఈ విధంగా కొంతకాలం జరిగింది.
ఈ దేహానికి 9వ సంవత్సరం వచ్చింది. అప్పుడు ఈ దేహానికి శేషమరాజు అనే సోదరుడుండేవాడు. కొండమరాజు నన్ను దగ్గర పెట్టుకొని నాకు చదువు లేకుండా చేస్తున్నాడని భావించి, నన్ను తీసుకుపోయి కమలాపురంలో చదివిస్తానన్నాడు. ఈ చదువు సంధ్యలు ఏమీ అక్కర్లేదని కొండమరాజు అడ్డు పెట్టాడు. కొండమరాజుకు నేనంటే చాల ఇష్టంగా ఉండేది. అతడు దివ్యదృష్టి కల్గినవాడు, మహాజ్ఞాని కాబట్టి, నన్ను మాత్రమే కోరుకున్నాడు. ఒకనాడు ఆయన పెద వెంకమరాజును పిలిచి, "నీ భార్య పేరు ఈశ్వరమ్మ అని మార్చుకో" అన్నాడు. అతని ఉద్దేశ్యమేమిటి? ఆమె ఈశ్వరునికి అమ్మ కాబట్టి ఆ పేరు పెట్టమన్నాడు. పెద వెంకమరాజుకు ఇదేమీ అర్థం కాలేదు. అయినా, నాన్నగారు చెప్పారు కదా అని ఆమెకు ఆ పేరు పెట్టాడు.
కొండమరాజు 112 సంవత్సరాలు జీవించాడు. ఆ వయస్సులో కూడా ఆయన కన్నులు, చెవులు, కాళ్ళు, చేతులు చక్కగా ఉండినాయి. ఆయన పాతమందిరం నుండి క్రొత్త మందిరానికి కఱ్ఱ సహాయమైనా లేకుండా నడచి వచ్చేవాడు. "ఎందుకు ఇలా వస్తావు? దారిలో పశువులు అడ్డురావచ్చు. ఒక కఱ్ఱ వెంట తెచ్చుకోవచ్చు కదా" అనే వాడిని. "నాకెందుకు స్వామి కఱ్ఱ? భగవంతుడిచ్చిన కాళ్ళు చక్కగా ఉన్నాయి" అనేవాడు. ఆయనకు స్వామి అంటే చాల భక్తి. తెల్లవారు ఝామునే ఐదు గంటలకు వచ్చేవాడు. ఆయన వస్తున్నాడని చూసి నేను ఊరికే దుప్పటి కప్పుకుని నిద్ర పోతున్నట్లుగా నటించేవాడిని. ఆయన మెల్లగా వచ్చి నా పాదాల పైన దుప్పటి తీసి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఆయన నా పాదాలకు నమస్కరించడం ఎవరైనా గ్రామస్థులు చూస్తే, 112 సంవత్సరాల వృద్ధుడు ఈ చిన్న పిల్లవానికి నమస్కారం చేస్తున్నాడే, అని ఏమైనా అనుకుంటారేమోనని ఆవిధంగా చేసేవాడు.
నేను ఒక సాయంకాలం పుట్టపర్తికి వెళ్ళాను. ఆయన మంచం పైన కూర్చుని పాటలు పాడుతున్నాడు. ఆయనకు రామాయణంలో లక్ష్మణ మూర్ఛకు సంబంధించిన సన్నివేశమంటే చాల ఇష్టం. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛల్లినప్పుడు రాముడు, లక్ష్మణా! ఈ ప్రపంచంలో వెతికితే సీతవంటి భార్యయైనా చిక్కవచ్చు. కౌసల్యవంటి తల్లియైనా చిక్కవచ్చు. కానీ, నీవంటి సోదరుడు నాకు చిక్కడు" అని ఎంతగానో విచారించాడు. ఈ సన్నివేశాన్ని వర్ణించుకుంటూ ఆయన పాటలు పాడుతున్నాడు. అప్పుడు నేను వెళ్ళాను. "ఏమి చేస్తున్నారు తాతగారూ?" అని అడిగాను. "స్వామీ, వచ్చారా!" అని ఆనందంతో మంచంపై నుండి దిగి పాదాలపై పడ్డాడు. "స్వామీ! నాకు తెలుసు - మీరు సామాన్యమైన బిడ్డ కాదు, సాక్షాత్తు ఈశ్వరుడే, మమ్మల్ని తరింపజేసే నిమిత్తమై మా వంశంలో ఉద్భవించారు. నాకొక చిన్న కోరిక ఉన్నది. అలనాడు దశరథుడు రాముని చేతులతో నీరు త్రాగి ప్రాణం వదలాలని ఆశించాడు. కానీ,అతనికి అట్టి ప్రాప్తి లేకపోయింది. జటాయువుకు మాత్రమే అట్టి ప్రాప్తి చిక్కింది. నాకు కూడా అట్టి ప్రాప్తి అను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేను ప్రాణం వదిలే ముందు మీ అమృత హస్తంతో నా నోటిలో నీరు పోయాలి" అన్నాడు. తప్పక అదే విధంగా జరుగుతుందని అతనికి మాట ఇచ్చాను.
ఒక వారం తరువాత నేను సుబ్బమ్మ ఇంటికి వెళ్ళి, అక్కడి నుండి తిరిగి కొండమరాజు ఇంటికి వెళ్ళాను. ఆతను నేను వస్తున్న విషయాన్ని గుర్తించి, ఈశ్వరమ్మను పిలిపించాడు. "ఈశ్వరమ్మా! నేనింక ఉండను. కనుకనే, భగవంతుడు తన మాటను నిలబెట్టుకోవడానికి వస్తున్నాడు" అన్నాడు. "ఏమిటి మామా, ఎక్కడున్నాడు భగవంతుడు? ఎట్లా వస్తాడు?" అని లౌకికమైన రీతిలో అమాయకంగా మాట్లాడింది. ఈశ్వరమ్మ. "పిచ్చిదానా, ఇంకా సత్యం నీ కుమారుడనే భ్రాంతిలోనే ఉన్నావా? అదిగో, దేవుడు వస్తున్నాడు. చూడు" అని నన్ను చూపించాడు. ఆమెకు కూడా తెలుసు. స్వామి యొక్క మానవాతీత శక్తులను ఆమె కూడా చాల పర్యాయములు చూసింది. కానీ, భ్రాంతి చేత పుత్ర వాత్సల్యంలో మునిగిపోయేది. యశోద కూడా అట్లనే. కృష్ణుని నోటిలో పదునాలు లోకములు చూసినప్పటికీ అది "కలయో, వైష్ణవమాయయో..." అనుకుంది.
కొండమరాజు "ఈశ్వరమ్మా! నన్ను తీసుకుపోవడానికి దేవుడొస్తున్నాడు. నాకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వస్తున్నాడు. ఒక గ్లాసులో నీరు తీసుకురా, అతను నా నోట్లో పోస్తాడు. నేను వెళ్ళిపోతాను" అన్నాడు. "మీకు జ్వరము లేదు. జబ్బు లేదు. ఎట్లా పోతారు?" అన్నది ఈశ్వరమ్మ. "మరణమునకు కారణాలు లేవు. అది దైవాజ్ఞ ప్రకారం జరుగుతుంది. కాబట్టి నీవు కొంచెం నీరు తీసుకురా" అన్నాడు. ఈ ముసలాయనతో వాదించడ మెందుకని ఈశ్వరమ్మ ఆయన కోరినట్లుగా ఒక గ్లాసులో నీరు తీసుకు వచ్చింది.
కొండమరాజు క్రింద కూర్చున్నాడు. నన్ను మంచం పైన కూర్చొమ్మన్నాడు. నా మోకాళ్ళపైన తన తల పెట్టు కున్నాడు. "స్వామీ! నా మొర ఒకటి ఆలకించండి" అన్నాడు. ఈశ్వరమ్మ కూడా వింటున్నది. "ఏమిటి, ఇంత పెద్దాయన మనమణ్ణి ఇంతగా గౌరవిస్తున్నాడే" అని తనలో తాను ఆశ్చర్యపోయింది. కొండమరాజు "స్వామీ! నేను చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వచ్చాను. ఏ పూటకాపూట సంపాదించిన డబ్బుతో మనమిద్దరం తినేవారము. కానీ, నేను ఎవరికైనా కాసో, బొట్టో, అణానో అప్పుగా ఉండవచ్చు. కనుక, నేను ఋణంలో పోకుండా నన్ను రక్షించండి" అన్నాడు. తప్పక నేను రక్షిస్తానని చెప్పి, టంబ్లరు తీసుకొని ఆయనకు నీరు త్రాపుతూ వచ్చాను. తాపుతూ ఉండగానే ఆయన ప్రాణం పోయింది. ఆయన మనోభీష్టం నెరవేరింది.
పోయే ముందు కొండమరాజు, "ఈశ్వరమ్మా! నీవింకా భౌతిక దేహాన్ని ఆధారం చేసుకుని బంధుత్వమనే భ్రాంతిలో ఉన్నావు. శరీర సంబంధ బాంధవ్యములన్ని కదలిపోయే మేఘముల వంటివి. ఆత్మసంబంధం మాత్రమే శాశ్వతమైనది. కనక, దేహాభిమానమును తగ్గించుకో, ఆత్మాభిమానమును పెంచుకో" అని పలుకుతూ ఆమె తలపై చేయి పెట్టాడు. ఆనాటి నుండి ఆమె ఇంటిని వదలి పెట్టి ప్రశాంతి నిలయంలో వచ్చి నివసించసాగింది. ప్రశాంతి నిలయంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వచ్చి స్వామితో మాట్లాడేది. ఆమె కూడా స్వామి యొక్క ఈశ్వరత్వమును చక్కగా గుర్తించింది. ఒక్కొక్కతూరి స్వామి ఈశ్వరునివలె కనిపిస్తే, "స్వామీ, ఈ పాములన్నీ ఏమిటి?" అని కంగారు పడేది. "నేనేమీ వేసుకోలేదే!" అని ఏమీ తెలియనట్లుగా నటించేవాడిని. తరువాత చూస్తే ఏమీ ఉండేది కాదు. ఈ విధంగా ఆమె అనేక పర్యాయములు స్వామి యొక్క దివ్యత్వాన్ని ప్రత్యక్షంగా చూసింది. కౌసల్య కూడా అట్లనే, యశోద కూడా అట్లనే. కానీ, వీరందరూ పుత్రవాత్సల్యంచేత మాయ కప్పినట్లు జీవిస్తూ వచ్చారు.
(స.సా . జాన్ 99 పు. 143/146)
(చూ॥ తల్లి తండ్రులు)