దుస్పంగానికి దూరంగా ఉండాలి. దుస్పంగములో చేరితే మీలో ఉన్న పవిత్రమైన భావములు నిర్మూలమైపోతాయి.
కైక మంధర మాటలను వినడంచేత తన స్వంత కుమారుడైన భరతుని కన్న మిన్నగా ప్రేమించిన రాముణ్ణి అరణ్యానికి పంపించింది. మంధర మాటలచేత ఆమె బుద్ధిలో మార్పు కలిగింది. అనగా, బుద్ధిదోషము కలిగినప్పుడు అసత్యం సత్యంగా గోచరిస్తుంది. సంగ దోషముచేత బుద్ధిదోషం ఏర్పడుతుంది. కనుకనే నేను అప్పుడప్పుడు పిల్లలకు చెపుతుంటాను - ఇతరులతో ఎక్కువగా కలవకండని. చిన్న వయస్సు నుండియే దుస్సంగానికి దూరంగా ఉండాలి. సత్సంగంలో చేరాలి. అహోరాత్రములు పుణ్యకార్యముల నాచరించాలి. నిత్యానిత్య విషయ పరిశీలన చేయాలి.
(స.పా. న 99 పు. 288)
కుటిలురాలగు రాణి కైకేయి, “నేనేమి చెప్పగలను? ఎవరిపై దోషమును నిరూపించగలను?” అని లోలోన విచారించి రాముడు వంటరిగా చిక్కిన తన పాపమును మన్నించుమని కోరుకొనుటకు ఎన్నోవిధములు వేచెను. రామునకు ముఖము చూపుటకుకూడా సిగ్గుపడెను. తన కొమారునికంటే అధికముగా రాముని ప్రేమించుచుండిన కైకకు ఈ విధమైన విపరీతవాంఛ వచ్చుటలో తన లోపము కాదనియూ ప్రాణసమముగా ప్రేమించిన రాముని అన్నివిధములైన బాధలకు గురిచేసినది ఏదో ఒక శక్తితనలో చేరి చేయించినదే కాని, తాను కాదని దృఢముగా తెలిసికొని, తానెంత ధైర్యమును తెచ్చుకున్నను, లోకులు నా మాటలను నమ్మరుకదా! అని తనలోతాను సంశయించుచూ, ముందుకు పోలేక, వెనుకకు తిరుగలేక క్రుంగి కృశించి పోవుచున్న కైకమనసును గమనించి, రామచంద్రుడు సమయమును చూచి కైకకు నమస్కరించుటకు వెళ్లెను.
అదియే సమయమని తలంచి, కైక రాముని పాదములు పట్టి “నాయనా! నీవు నాకు చిన్నవాడవు. కుమారుడవు, అయిననూ గుణములలో, జ్ఞానములో లోకమునకే అధికారివి! ప్రభుడవు! కాన నీ పాదములు పట్టిననూ దోషము లేదు. నా పాపమును క్షమించి, నీవు అయోధ్య నేలుము. నాకు సంప్రాప్తమైన ఈ అపకీర్తిని నివారింపుము; లేదా భరతుని నీతో ఉంచుకొని నీ పాద సేవాభాగ్యము నొసంగుము. నేనిక జీవించకపోయిననూ నాకు మనశ్శాంతి లభించును. మహాకిరాతకులు కూడనూ కోరని కోరికను నేను కోరితినన్న నాకే ఆశ్చర్యముగా నున్నది. నిజముగా నేను కేకయరాజపుత్రినై కోరితినా? లేక ఏదైనా - గ్రహమావహించి నానుండి ఆ పలుకులు పలికించెనా? నాకు తెలియకున్నది” అని రెండుచేతులు పట్టుకొని కైక విలపించుచుండుట రాముని గుండెలను నీరు గావించెను. అంత శ్రీరాముడు “అమ్మా! ఇందులో నీదే మాత్రమూ తప్పులేదు. లోకులు కాకులు. సత్యమును గుర్తించక పలువిధముల పలుకుదురు. నీవు బుద్ధిపూర్వకముగా కోరిన కోరికలు కావు.
నా సంకల్పమే ఈరీతి గావించినది. నే నవతరించిన కార్యమునకు నే సంకల్పించిన పనికి, మీ రెంతయో ఉపకారమొనర్చితిరే కానీ అపకారము కాదు. ఇందుకు నేను మీకు కృతజ్ఞత చెప్పవలసినది పోయి, మీతో నేనింతగా అడిగించుకొనవలసి వచ్చినందుకు నేనెంతయో చింతించుచున్నాను! మీరు దుఃఖించిన నా కార్యము అశుభమగును. కాన నన్ను అనుగ్రహించి, నాపై వాత్సల్యమును చూపుచు ఆశీర్వదింపుము” అని రాముడు కైకేయి పాదములకు నమస్కరించెను.
రాముడట్లు చెప్పుటచేత కైకేయికి కొంత శాంతి కలిగెను. వీరిరువురి సంభాషణలు చెంతనే ఉండి వినుచున్న కౌసల్య, సుమిత్రలు ఇందులో కైకదేమాత్రమూ దోషము లేదనియూ ఇది దైవసంకల్పమేననియూ గ్రహించి చెల్లెలైన కైకను అనేక విధముల ఓదార్చిరి. అయిననూ కైకపట్టు విడువక “రాముడు మహారాజు. సీత మహారాణి కాకతప్పదు. నా కొమారులు భరతశత్రుఘ్నులు, లక్ష్మణసమేతులై సీతారాములకు సేవలు చేయుచుండ ఈ కన్నులతో చూచి ప్రాణము విడువవలె” నని పదేపదే పలుకుతూ వచ్చెను. (రామ కథా రసవాహిని ప్ర ధమ భాగం పు 310-311)