కామశక్తియే అధికమీ కాలమందు
వాని మిత్రుడు క్రోధుడు వారిరువురు
చేర్చుకొనునట్టి జనునకు చేటుకల్గు
సత్యమును చూపు బాట యీ సాయిమాట.
సా..పు. 220)
"చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు శూర్పణఖ రావటం లక్ష్మణుడు ముక్కు, చెవులు కోయటం, రావణునితో చెప్పి సీతను లంకకు తీసుకురావటానికి కారణం అయింది. శూర్పణఖ. రామాయణంలో మంధర, శూర్పణఖ పేర్లు కొన్ని లైన్లలో మాత్రమే చూపినారు కాని అంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇంత చిన్న శూర్పణఖ, మంధరల ద్వారానే రామాయణమంతా జరిగింది. అయోధ్యలో రాముడు అరణ్యానికి పోవటం, అరణ్యంలో సీత లంకను చేరటానికి ఈ శూర్పణ, మంధర కార్యకర్తలుగా ఉంటున్నారు. ఇంతకీ వీరెవరు? శూర్పణఖ కామము, మంధర క్రోధము. వీరిరువురే మన జీవితరామాయణానికి కారకులు. అయితే దీనిని జయించుట యెట్లా? అని నిరాశ పడనక్కరలేదు.
సర్వవిధములైన వాంచలు భగవద్భావంతో అనుభవించుటతో కొంత ఆనందం కలుగుతుంది. ప్రకృతిని విశ్వసించి పరమాత్మని వేరుచేసినపుడు ఆనందం అందుకోలేము. కామత్యాగాన్ని రామాయణం మనకు నిరూపణ చేసింది. సర్వసుఖములు త్యజించిన సీత, కామమును త్యాగము చేయుటచేత రామునితో పోవటానికి అవకాశం కలిగింది. తిరిగి త్యాగం కామంగా మారింది. మధ్యలో బంగారు లేడిపై కామం కలిగింది. అపుడు రాముడు దూరమైపోయినాడు. ఇట్టి పవిత్ర అంతరార్థాన్ని బోధించింది. రామాయణం కాని, అది ఏదో FAMILY FIGHT కాదు. ఉపనిషత్తులు, రామాయణ, భారత భాగవతాలు పవిత్రమైన అంతరార్థాన్ని బోధిస్తున్నాయి.
(రా.ర.వా. మొ.భా. అంతరార్థము ముందరపుట)