రామాయణంలో రావణుడెంత గొప్పవాడు! అరువది. నాల్గు విద్యలను అభ్యసించాడు. కఠోర తపస్సును ఆచరించి దైవానుగ్రహాన్ని పొందాడు. అంతటి గొప్ప వ్యక్తి ఒక్క కామానికి లోనుకావడంచేత సర్వమును నాశనం గావించుకున్నాడు. ఇంక భాగవతంలో హిరణ్యకశిపుడు కూడా చాల గొప్పవాడే. అతడు పంచ భూతములను అదుపులో పెట్టుకున్నాడు. కానీ క్రోధాన్ని మాత్రం జయించలేక పోయాడు.
కోపము కలిగినవానికి
ఏ పనియు ఫలింపకుండు ఎగ్గులు కలుగున్
పాపపు పనులను చేయుచు,
ఛీ, పొమ్మనిపించుకొనుట చేకూరు సుమీ!
తన కలిమి భంగపుచ్చును
తనకుంగల గౌరవంబు దగ్ధము చేయున్
తనవారల కెడ సేయును
జనులకు కోపము వలన సర్వము చెడున్
ఇంక, భారతంలో దుర్యోధనుడు పరమ లోభి.
లోభివానిని చంప లోకంబు లోపల
కొట్టవద్దు. వానిని తిట్టవద్దు.
డబ్బు అడిగినంత దబ్బున తా చచ్చు..
ఇలాంటి లోభియైన దుర్యోధనుడు కడపటికి సాధించిన దేమిటి? కనుక కామ క్రోధ లోభములు మూడూ సాధకునకు పరమ శత్రువులు. ఎన్నో సంవత్సరాలు చేసిన సాధన ఒక్క తూరి కోపం రావడంవల్ల నాశనమై పోతుంది. విశ్వామిత్రుడు గొప్ప తపస్సంపన్నుడు, అనేక అస్త్ర శస్త్రములను సాధించినవాడు. అలాంటివాడు భగవద్భక్తుడైన వశిష్ఠులవారిపై క్రోధం పూనాడు. వశిష్టులవారు నిరంతరం బ్రహ్మతత్వాన్ని చింతించేవాడు కాబట్టి ఆయనకు బ్రహ్మర్టీ అనే బిరుదు వచ్చింది. విశ్వామిత్రుడు రజోగుణంతో కూడిన వాడు కనుక, అతనిని రాజర్షి" అన్నారు. విశ్వామిత్రుడు తాను కూడా బ్రహ్మర్షి అనిపించుకోవాలని పట్టుపట్టాడు. గొప్ప తపస్సు చేశాడు. కానీ వశిష్టుల వారిపై క్రోధం పూనటంచేత సర్వ శక్తులను కోల్పోయాడు.
(స.పా. ఏ. 99 పు. 99)
(చూ పురాణములు)