జనక మహారాజు వివాహానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అనేక రథములను పంపించాడు అయోధ్యకు. జరిగినదంతా లిఖిత పూర్వకంగా తెలియజేశాడు. ఇక వస్తున్నారందరూ. స్త్రీలంతా ఆనందంతో పాడుతున్నారు.
“రారె చూడగ పోదాము రాముల పెండ్లి
రారె చూడగ పోదాము రమణులందరు జేరి
మించి మగల్ కడనుంచి సిగ్గున తలవంచి
వశిష్ఠు రప్పించి ఖడ్గములు తెప్పించి
దూలాలపై గుప్పించి గుప్పించి
ఇప్పించి మెప్పించి రప్పించుట
రారె చూడగ పోదాము".
ఈ మహాపవిత్రమైన సన్నివేశానికి అందరం వెడదాం. రండి అని ఆడవారంతా బయలుదేరుతున్నారు. ఇంక మిథిలాపురం వారు మరొక రీతిగా పాడుకుంటున్నారు.
"కళ్యాణము చూతము రారండి
కౌసల్యతనయుని కల్యాణము
చూతము రారండి
పిల్లనగ్రోవులు, భేరి మృదంగము
రథములు గజములు తురగములేనట
వారివెంట వృద్ధ కౌశికుడు
కౌశికు వెంట వృద్ధ దశరథుడు
దశరథు వెంట మంత్రి సుమంతుడు
అత్యద్భుతముగా ఆనందముగా
అయోధ్య అంతయు కదలివచ్చెనట
కల్యాణము చూతము రారండి
అంబారిపై అరుగు తేజమట
ధగధగ మెరిపెడి దివ్యరాముడట
రామ అంకమున రమణి సీతయట
చిరునవ్వుల మన క్షేమ మడుగునట
కదలరె కదలరె బదులిక పలుకక
కల్యాణము చూతము రారండి".
నాల్గవదినమున దశరథ మహారాజు, సామంతులు రథములలో వచ్చి దిగారు. వివాహమునకు రంగం సిద్ధమైంది. వారు మహారాజులు కనుక, తలంబ్రాలు పోయటానికని ముత్యములను తెచ్చి తట్టలలో పెట్టుకున్నారు. భారతీయ సంస్కృతియందు ఇది ప్రధానమైన ఆచారము. సీత తలంబ్రాలు తీసుకొని దోసిలి పట్టినప్పుడు గోరింటాకు వలన తెల్లని ముత్యములన్నీ ఎఱ్ఱగా కనిపించాయి. వాటిని తీసి రాముని తలపై పోసింది. రాముని తలపాగా తెల్లగా ఉండటం చేత ఆ ముత్యములు కూడా తెల్లగా కనిపించాయి. రాముని వర్గము నీలవర్ణము. కనుక, అవి క్రింద పడేటప్పటికి నీలంగా మారిపోయినవి. చేతిలో తీసుకున్నప్పుడు ఎఱ్ఱగా, తలపై పోసినప్పుడు తెల్లగా క్రింద పడినప్పుడు నీలంగా మారుతూ వచ్చాయి ముత్యములు. ఈ కళ్యాణము జగత్కల్యాణముగా రూపొందింది. మంగళకరంగా జరిగింది.
(శ్రీ భ.ఉ.పు.55/57)
(చూ|| కృష్ణుని లీలలు)