మతపరమైన కర్మకాండలన్ని నిస్సందేహముగా సత్కర్మలే. అయితే, బాహ్యమైన ఇంద్రియములతో నిర్వర్తించే సత్కర్మలు అన్నీ ఆధ్యాత్మిక పరమైనవి అని చెప్పడానికి వీలులేదు. అవి కేవలం మానవుని మర్కట బుద్ధిని సరియైన క్రమశిక్షణలో పెట్టే కర్మలు. మనం ఏ పేరులో పిలిచినా, వీటన్నిటి వెనుకనున్న ఆధ్యాత్మికతత్త్వమొక్కటే. ఆత్మ నాశము లేనిది, మార్పు లేనిది. ఈ విషయాన్ని ప్రతి నిత్యము స్మరించడమే ఆధ్యాత్మిక తత్త్వము. ఎంత చదువుకున్నా. ఎన్ని తెలివితేటలు, సంస్కారము, వాదపటిమ కలిగియున్నా మానవుడు తాను ఎక్కడి నుండి వచ్చాడో ఆ మూలస్థానమును మరచిపోతున్నాడు. అందువలననే, అతడు -నేనెక్కడి నుండి వచ్చాను?" అనే అతి చిన్న ప్రశ్నయొక్క అర్ధమును కూడా తెలుసుకొనలేక పోతున్నాడు. మానవుని యొక్క మనస్సు నుండి కాక ఆత్మనుండి ప్రవహించే అనంతమైన శక్తిని గుర్తించడమే ఆధ్యాత్మిక తత్త్వము. ఆధ్యాత్మిక తత్త్వమునకు, నిత్య జీవితానికి సంబంధము లేదని భావించడం చాలా పొరపాటు. హిందూ ధర్మశాస్త్రముల ననుసరించి ఆధ్యాత్మిక తత్త్వము మానవజాతి అంతటికీ వర్తించే ఒక జీవన విధానము. నిజమైన ఆధ్యాత్మికతత్వము అంటే ఏమిటి? భిన్నత్యములో ఏకత్వమున దర్శించడమే నిజమైన ఆధ్యాత్మికతత్త్వము. అందరిలోను ఒకే పరమాత్మను దర్శించడమే నిజమైన ఆధ్యాత్మికతత్త్వము. అందరిలోను ఒకే పరమాత్మ యొక్క ఉనికిని గుర్తించే సమభావమును మనం అలవరచుకోవాలి."
(దై. ది. పు 46 )
జైమినీ కర్మకాండములు ప్రత్యేకమైనవిగా నిరూపిస్తూ వచ్చారు. నిర్మలత్వము నకు ఇవన్నీ ఆధారము అన్నాడు. ఇవన్నియూ లేనప్పుడు పవిత్రమైన దివ్యత్వమును అర్థముచేసుకో లేరు. పైన సూర్యుడున్నాడు. నీవు క్రిందవున్నావు. కొన్ని మేఘములు వేసి సూర్యుని కప్పివేసాయి. మేఘములు క్కడనుండి వచ్చాయి ? సూర్యునిసుండి పుట్టిన మేఘములు సూర్యునినే కప్పివేసాయి. అయితే ఈ మేఘములు శాశ్వతమైనవా? కాదు కాదు. ఇవి అశాశ్వతమైనవే. అంత మాత్రముచేత నీ మనసును మార్చుకోకూడదు. కొంచెము ఓపిక పట్టు. నీ ఆత్మ జ్ఞానమును అజ్ఞానమనే మేఘము కప్పివేసింది. అంత మాత్రముచేత నీవు నిరుత్సాహమునకు అవకాశము ఇవ్వవద్దు. ఓపిక పట్టు. ఇవన్నీ కదలిపోయేవే. స్థిరమైనవి కావు. శాంతము అత్యవసరము. తక్షణమే మేఘములు కదలిపోతాయి. సూర్యుడు కనిపిస్తాడు. ఈ ఓపికను ప్రసాదించే మార్గాన్ని కూడసూ పూర్వమీ మాంస ప్రబోధిస్తూ వచ్చింది. నిత్య జీవితములో మానవుడు ఏఏ విధములైన సంబంధములను, ఏఏ విధములయిన కర్తవ్యములను అనుసరించి కర్తవ్యమునకు అడ్డు వచ్చినప్పుడు దానిని ఏవిధముగా దూరము చేసుకోవాలి ? అనే మార్గాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది. దుఃఖము కలిగింది. ఆ దుఃఖమునే ఎక్కువగా స్మరించవద్దు. సుఖాన్ని స్మరించు. దుఃఖము దూరమవుతుంది. అజ్ఞానం వచ్చింది. ప్రజ్ఞానాన్ని కొంతవరకూ పరిశోధన సల్పు. ఒకని పైన కోపము వచ్చింది. తక్షణమే నీవు వాక్కులో ప్రవేశ పెట్టి వానిని యిష్టము వచ్చినట్టు తిట్టకూడదు. ఆలోచించు. కోపం రావడానికి కారణమేమిటి? వాడు చేసిన దోషమా,, దైవసంకల్పమా? విచారణచేయి. నీ కోపము స్పీడు తగ్గిపోతుంది. అసలు కోపము వచ్చిన తక్షణమే లోపలకు పోయి గ్లాసు చల్లని నీరు త్రాగు. కోపము చల్లారిపోతుంది. నిజముగా ఈ కోపము మీయొక్క వికారమే కానీ సాకారముకాదని బోధిస్తుంది. కోపం వచ్చినప్పుడు నిలువుటద్దం ముందుకు పోయి చూడు. నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది. అప్పుడే ఈ కోపము చల్లారుతుంది. ఏమిటి? ఈ కోపము నన్ను ఇంత వికారముగా మార్చిందా అని తనకు తాసు విచారణ చేసుకొని కోపము చల్లార్చుకుంటాడు. మనసుకు యింకేమైనా కలతలు ప్రారంభమయినా, విచారము కలిగినా ఒంటరిగా ఒక చోటుకు స్పీడుగా నడు. ఆ స్పీడుగా సడిచేటప్పటికి రక్త ప్రసరణము చేత కోపము చల్లారుతుంది. నీకు సంగీతము తెలిసిన బాత్ రూములోకి వెళ్ళి నీళ్లను విడచు. ఆ నీళ్ళు అక్కడ ఒక స్వరరూపముగా వస్తూ వుంటాయి. ఆ స్వరాన్ని నీవు ఆధారముగా చేసుకొని పాటపాడు. ఆ స్వరమునకు ఈ పాటకు యేవిధమైన వ్యత్యాసముంది ? అని విచారణ చేయి. ఈ విచారణలోపల నీకోపము చల్లారిపోతుంది. యింత సులభముగా నీయొక్క కోపము చల్లార్చుకోవటానికి ఎన్నో ఉపాయములూ, ఎన్నో రహస్యములు, ఎన్నో యుక్తులు ఉంటున్నవి. యివి తెలిపే మానవులు కరువైపోయారు. ఇదియే పూర్వమీమాంస. జైమినీ మహర్షి చక్కని ఆదర్శమును చూపుతూ వచ్చాడు. అవి ఈనాడు మరుగున పడిపోయినవి. ఎక్కడకూడనూ కనిపించటం లేదు. పూర్వ మీమాంసలోవున్న పవిత్రతను మనము అర్థము చేసుకోవాలి.
పూర్వము, ఉత్తరముగా రెండు విధములుగా విభజించినారు. ఈ రెండింటిని ఏకము గావించడానికి వీలుకాదు అని నిరూపించినాడు. ఉత్తర దక్షిణములు ఏకము కావడానికి అవకాశముందా ? భగవంతునిలో లీనమయినప్పుడే ఏకమైపోతాయి. అంతవరకు పూర్వమీమాంస పూర్వమీమాంసే, ఉత్తరమీమాంస ఉత్తరమీమాంసే. దీనినే కృష్ణుని రాయబారమునకు పంపే సమయములో అర్జునుడు ఎంతో ఉద్రేకముగా చెప్పాడు. కృష్ణా! వారితో నీవు సంప్రదించి ఏమాత్రమూ ప్రయోజనము లేదు.
కాలకూటమున అమృతము సృజింపనేలా
భయదావాగ్నిలో మల్లెపూలు వెదజల్లుట మేలా
ముష్కరులమోల హితోక్తులు ఏలా
గుణజాల! యేల ఈ సంధిమాటలిక గోపాలా!
చాలిక ఉత్తర దక్షిణ ధృవములు కలియునా ? యుద్ధమునకు కాలహరణము యేల? ఇంతవాదించిన అర్జునుడు యుద్ధములో ప్రవేశించేటప్పటికి కృష్ణా! ఇంతమంది బంధువులను, ఇంతమంది పుత్రులను, గురువులను చంపి నేను చేసే పనియేమిటి? ఈ రక్తపు కూడు భుజించటానికా నేను ఈ యుద్ధము చేయడం. నాకు కస్నులు తిరుగుతున్నవి. కృష్ణా! మానవుని యొక్క మనఃస్థితి ఒక్క తూరి ఉద్రేకములో అతి వేగముగా పోతుంది. పరమశాంతి తత్వములోపల స్వార్థపర త్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలను, విచారాన్ని సల్పుతుంది. హింసకు అహింసకు మనసే కారణము.
ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము
ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము
దూషణకు భూషణకు మనసే కారణము
కనుక మనసు కారణమే మరియెందు ఉన్ననూ.
అడవిలోకి పోయి కూర్చుంటే ముక్తి వస్తుందా! ఎప్పటికీ రాదు. ఇంట్లోకూర్చుంటే ముక్తి రాకుండా పోతుందా ! వచ్చేది ఎక్కడైనా వస్తుంది. ఇటువంటి సత్యసూక్తులను ప్రబోధిస్తూ వచ్చాడు జైమినీ మహర్షి. దేహమును వివిధ విధముల పోషించి రక్షించినా కానీ నీవు సంరక్షించుకోవలసినది నీ ఆత్మ ధర్మాన్ని. దీనికి నీవు తగిన కృషి చేయి. అన్నివిధాలా రక్షిస్తుంది. మనము రక్షించుకోవలసి నది మానవ ధర్మము. ఏమిటి ఈ మానవ ధర్మము. మన కర్తవ్యమును మసము నిర్వర్తించాలి. గృహస్థుడు గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి. వానప్రస్థుడు వాన ప్రస్థ ధర్మమును అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మాన్ని అనుసరించాలి. సన్యాసి సన్యాసి ధర్మాన్నే అనుసరించాలి. అనుసరిస్తూ దైవము యొక్క భావముతో నివసించాలి. ఇదే జీవితము యొక్క పరమావధి అంతేకానీ కన్నులు మూసుకొని, డొక్కలు కొట్టుకుంటూ “రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు. దేనినైనా చూడు. దైవభావముతో చూడు. దేనినైనా విసు. దైవభావముతో విను. దేనినైనా చేయి. దైవభావముతో చేయి. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థము అనే సిద్ధాంతమును చక్కగా స్థిరపర్చుకోవాలి. ఈ విధముగా చేసినప్పుడు తగిన ఆనందము మనకు చేకూరుతుంది.
విద్యార్థులారా! కేవలమూ ఏదో ఇంతకాలమూ విని ఆనందించి దీనిని విస్మరించటము సరికాదు. విన్న విషయములను, కన్న దృశ్యములను హృదయ మునందు చేర్చుకొని సమయస్పూర్తిగా మననము చేస్తూ ఏ ఒకటి రెండైనా ఆచరణలో పెడితే మీ జన్మ సార్థకమవుతుంది. అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాస్ లో ప్రవేశించినందుకు తగిన ఫలితము చేకూరుతుంది. ఇది గొప్ప అదృష్టము చేత కూడుకొనిన ప్రాప్తి. ఈ ప్రాప్తిని మీరు పాడుచేసుకొనకుండా చూసుకోండి. (శ్రీ సత్యసాయి దివ్యబోధ 1993 పు160-163)