భగవంతుని యందు మనస్సు నిలుపుట చిత్ర నిరోధము జరుగవలయును కదా! అట్టి నిరోధమునకు త్రిగుణము లైన సత్వరజస్తమో గుణవైషమ్యమేర్పడకుండా చేయుటకు భగవత్ ప్రార్థన ఆయా కాలములందు చేయవలెను. ఇది పురుషులకు మొదటి కర్తవ్య ధర్మము. ప్రాతః కాలము సత్వగుణ కాలమనియు, మధ్యాహ్నము రజోగుణ కాలమనియు, సాయంత్రము తమో గుణ ప్రకోపకాలమనియు, సృష్టియందలి ధర్మము నియమము. మొదటి సత్వగుణ కాలమైన ప్రాతఃకాలమున నిద్రానందమును జెంది మనోవ్యాకులత నుండి విడువబడి, మొట్టమొదట మెలకువ బడు సమయముగావున, మనస్సు పరిశుభ్రముగా, ప్రశాంతముగా నుండును. ఈ కాలములో భగవథ్థ్యానము చేయవలయుననుట అందరకూ విశదమే. ఇదియే ప్రాతఃసంధ్యావందనమనబడును. సంధ్యా వందనమును అర్థము తెలియక కూడనూ యేదో ఒక సాంప్రదాయముగ పెద్దలు చెప్పినవి వినిగుడ్డి గుర్తులతో ఆచరించుచున్నారు. ఈ మూలార్థమును తెలిసికొని చేయుట పురుషుని రెండవ ధర్మము..
పిమ్మట రెండవదైన రజోగుణము జెంది, వ్యవహారములలో ప్రవేశించి, అలసట జెంది, ఆకలి గలిగి భోజన ప్రయత్నము చేయునపుడు, భోజనమునకు ముందుగా భగవత్ చింతన, లేక ధ్యానము చేసి వండిన పదార్థములను భగవదర్పితముచేసి, పిమ్మట భుజింప వలయునను నదియు అవశ్యకము. దీనినే మధ్యాహ్నిక సంధ్యావందన మందురు. దీనిని ఆచరించుటవలన రజః ప్రకోపమేర్పడక, సత్వమే వృద్ధియగును. ఇది పురుషునకు మూడవ కర్తవ్య ధర్మము. ఇక మూడవ గుణమైన తమోగుణమును చెంది, సాయం కాలము ప్రదేశమగువప్పటికి ప్రతి పురుషుడును తన యిల్లు చేరి చక్కగ వండిన పదార్థములను భుజించి నిద్రించ ప్రయత్నించును. ఇది కాదు. వాని కర్తవ్య ధర్మము, ఇది సోమరి పోతులక్షణము! గుణములలో నిజమైన తమోగుణము ప్రవేశించినపుడు తాను చెడిపోకుండా నుండుటకై భగవత్ ప్రార్థన, సత్కాలక్షేపము, లేక సద్గుణ పోషణ, సదాచారము ఆవశ్యకము. ఇదియే సంధ్యావందన మనబడును.
కనుక నిద్రానందము నుండి వెలువడు మనస్సునకు బుద్ది చెప్పి అవిలేక నిద్రావందమునకే యింత సంతోషమును, బడలిక తీరుటకు కలిగిన, ఇక వివేక నిద్రయనుక భగవద్ధ్యావానందనము కెంత సుఖము కలుగునో, చక్కగ యెవరికి వారు యోచించిన తెలియును. ఈ యదార్థమును తెలిసికొని సత్వగుణముల వృద్ధి పొందించవలెను. ఇది పురుషుని నాల్గవ కర్తవ్య ధర్మము. జీవించియున్నంత వ ఱకూ, త్రికాలములందు సంధ్యా వందన మాచరించు ద్విజుడు ఉత్తమ పురుషుడు, మహాతేజోమయుడై సకాలాభీష్ట సిద్ధినొందును, అంతియే కాదు. జీవన్ముక్తుడగును. ఊరికే సంధ్యావందనమని నిత్యకృత్య కర్మలలో దీనినొక కర్మగా భావించరాదు. దీని యదార్థమును తెలిసికొని చేయుటలో, చెప్పుటలో విశేష ఫలమున్నది. దీనికి గాయిత్రి మంత్రార్థమును చక్కగా భావన చేయుట అతి ముఖ్యము. అట్లోనర్చుటలో గూడా, ఆ తేజోరూపుడైన ఆత్మ స్వరూపుడు. మూలపురుషుడు నగుచున్నానని యభేదముగా నెంచుట మరొక ధర్మము.
(ధ.వా. పు 53, 55)