రామనామము వేదసారము. రామచరితము పాలసంద్రము. నాడు మొదలు నేటివరకు యే యితర దేశములందు కాని, ఏయితర భాషలందు కానీ, ఇంతటి మహాకావ్యము పుట్టలేదనియే చెప్పవచ్చును. అన్ని దేశములకు, అన్ని బాషలకు ఆంతర్ వాహినిగా ఆధారమై నిలచిన ఈ ప్రధాన కావ్యము భారతీయుల భాగ్యమా అన్నట్లు హిందువుల ఇలవేల్పయి, ఇంటి పేరనో, వంటి పేరనో, ఈ రామ రసమును గ్రోలని భారతీయుడు లేడనియే చెప్పవచ్చును. పండితులు మొదలు పామరుల వరకును, కోటీశ్వరుడు మొదలు కూటి పేదవరకును, రోగులు మొదలు యోగులు వరకును, రామాయణము పారాయణగ్రంథమై ప్రకాశించుచున్నది. సమస్త దోషములను హరించి, పాపములను రూపుమాపి, తన ప్రాపును రూపముతో చూపునట్టి సుందర నామము ఈ రామం, సమస్త జలము సాగరమునుండియే పుట్టినటుల, సమస్త జీవులు రామం నుండియే పుట్టు చున్నవి. జలములేని సాగరము, రామ లేని జీవనం, లోకమున లేదు, రాదు. సాగరమునకు, సర్వేశ్వరునకు సన్నిహిత సంబంధము కలదు. సాగరమే సర్వేశ్వరునికి ఆవాసము. పాలకడలి శయనుడు అను పదమునకు ఇది ప్రధాన ప్రమాణము; కనుకనే ప్రచేతసుని కుమారుడగు మహాకవి వాల్మీకి రామాయణ భాగములకు కాండములని పేరిడెను. కాండమున జలమనియు, చెరకనియూ అర్జములు కలవు. చెరకు యెన్ని వంకరలు తిరిగిన రసమునందలి తీసికి యెట్టి మార్పునూ లేనటుల "రామకథా రసవాహిని" అనేక వంకరులు తిరిగినను ప్రవహించినను అందులోని కరుణా రసమున కెట్టి మార్పును లేదు రామకథా ప్రవాహము విచారము, విషాదము, వింత, హాస్యము, అద్భుతము, రౌద్రము, శృంగారము ఇత్యాది వంకరలతో ప్రవహించినది. దీని ఆంతర్ మర్మము ధర్మ ప్రధానమై యున్నది.
సరయూనది వంటిది రామ కథా రస ప్రవాహము. మానససరోవరమే దీని జన్మస్థానము. లక్ష్మణుడు గంగ వంటి వాడు. ఇది చిత్తమను శిరస్సున పుట్టినది. రామ వాహిని కరుణారసము, లక్ష్మణ ప్రేమ భక్తిరసము. సరయూనది గంగలో చేరినటుల కరుణారసము భక్తిరసమున లీనమగును, రాముడు లక్ష్మణునితో యేకత్వమయినాడు. కరుణా ప్రేమల మిళితమే రామ అభిమతము; అదే భారతీయుల మతము, భక్తుల వ్రతము.
(రా.ర.వా. మొ. పు.1/2)
సర్వ రసముల సారం కరుణరసం!
సర్వ మతముల ధర్మం చిత్త నైర్మల్యం!
సర్వ సాధనలగమ్యం శాంతి సౌధం!
(భ.శ్రే స. పు.69)
(చూ|| సర్వేశ్వరపూజ)