ఆధ్యాత్మిక వైద్యులలో ఘనుడైన వ్యాసమహర్షికి మానవాళి నివాళులర్పించే రోజు ఇది. ఆయన వేదములనుక్రోడీకరించి, పురాణములను మహాభారతమును రచించి, మానవాళికి భాగవతమును ప్రసాదించిన కారణంగా వ్యాసుడు అందరికన్నా గొప్ప వైద్యుడు. ఆయన అందరి కోసం దివ్య మార్గంలో నడచిన మొదటి గురువు. ఆస్తికత అనే విత్తనాన్ని నాటి, శ్రుతి, స్మృతి శాస్త్ర మహాభారతముల ద్వారాల మొక్కను పెంచి పోషించినవాడు. ఆయన ఈ ప్రపంచానికి గీతను, బ్రహ్మసూత్రాలను, ఆత్మతత్య్వాన్ని దివ్వలీలల గాథలను, పరిణామశీలమైన ఈ సృష్టి యొక్క రహస్యాన్ని అందించాడు. ఆయన క్రీస్తుపూర్వం 3800 సంవత్సరాల నాటి వాడు. ఆయన వసిష్టుని మునిమనవడు, పరాశరుని కుమారుడు, ఋషులలో రత్నము వంటి వాడైన శుకమహర్షికి తండ్రి. ఆయన జీవిత చరిత్ర అద్భుతమైనది. దివ్యమైనది. ఆయన వాసుదేవుని నుంచి వచ్చి, వాసుదేవుని దివ్వలీలలు లోకానికి ప్రకటించివాసుదేవునిలో లీనమయ్యాడు. వ్యాసుడు నామపారాయణ శకమును ఆరంభించి, భగవంతుని నామ మాధుర్యమును అందరూ గ్రహించేలా చేశాడు.
పూర్ణిమనాటి చంద్రబింబంవలె మనస్సును స్వచ్ఛంగా చల్లగా ఎలా ఉంచుకోవాలో ఆ రహస్యాన్ని మానవులకుమొదట తెలియజేసింది. వ్యాసుడు. అందువల్ల ఈ పూర్ణిమ ఆయనకు, గురువులందరికి అనుబంధం కలిగి ఉంది. ఈనాడు ఆస్తికుడు కేవలం ఉపన్యాసంతో తృప్తిపడి ఉండకూడదు. తన పరిశుభ్రమైన మనసులో ఈనాడు నామబీజం నాటాలి. అక్కడ అహంకారపు ముళ్ళను తొలగించాలి. ప్రేమ అనే నీటిని పట్టాలి. శ్రద్ధ అనే కంచెను చుట్టూ వేయాలి. స్మరణ అనే ఎరువును ఉపయోగించాలి. అప్పుడు మంత్రం అనే ఈ వృక్షం నుంచి ఆనందపు ఫలాలను కోసి వాటి నుంచి మాధుర్యమును గ్రోలాలి.
(వ.61-62 పు 55/36)
భారత యుద్ధము జరుగునప్పుడు వ్యాసభగవానుడు అక్కడ వారూ తనవారు, - ఇక్కడవారూ తనవారు కనుక, యుద్ధభూమికి వెనుక భాగములో నడచి యెచ్చటికో వెడుతున్నాడు. అదే దారిలో ఒక సాలెపురుగు పరుగెత్తుకొని పోవుచుండ, దానిని చూచి వ్యాసులవారు, ఎందుకింత తొందర అని ప్రశ్నించినారు. దోవనుండి తప్పించుకొని పురుగు జవాబిచ్చింది. తెలియదా! అర్జునుని రథము యీవైపు వచ్చుచున్నది. దాని చక్రము నా పైకి వచ్చిన, నేను పచ్చడి అయిపోతాను కదా! అంది. అయ్యో! నీవు పోతే జగత్తుకు కలిగే నష్టము ఏమిటి? నీ కేమి పెద్ద కర్తవ్యములా! -సంబంధములా! అని వ్యాసులవారు నవ్వినారు. అప్పుడా క్రిమి కోపముతో యిట్లనింది, నా ప్రాణము పోతే నష్టము లేదా? నాకూ పెండ్లాము బిడ్డలున్నారు. ఆస్తిపాస్తులున్నవి. ప్రాణముపై ఆశ ఉన్నది. ఆకలి, దప్పి, సుఖము, దుఃఖము, కష్టము, నష్టము మీకూ నాకు సమానమే. స్వరూపస్వభావములలో వ్యత్యాసములుండునుగాని విషయానందము మాత్రం సర్వులకూ సమానమే!” అప్పుడు వ్యాసులవారు,
ఆహారనిద్రా భయమెథునాని సామాన్యమేతత్పశుభిర్నరాణామ్
జ్ఞానం నరాణాం అధికో విశేషః జ్ఞానేన శూన్యః పశుభిస్సమానః
అనే శ్లోకమును చెప్పిరి. జ్ఞానమొక్కటి పశువులకు లేదు. నరులకు లభించు జ్ఞానము వలన, క్రిమికీటకాదులలో నివసించుచున్న పరమాత్ముని దర్శించవచ్చును. సర్వం విష్ణుమయం జగత్ అని ఆనందించవచ్చును.
ఇట్టి వైరాగ్య భావము నిజమానవుని లక్షణము. దానితో బాటు వివేకమునూ, విచక్షణనూ మానవుడు పెంచవలయును. దుష్టశిక్షణము, శిష్టరక్షణము భగవంతుని గుణములనేది సరికాదు. భగవంతుడు సాక్షీభూతుడు మాత్రమే. మీ చెడ్డ మీకు శిక్ష.
మీ మంచే మీకు రక్ష. మీ అభివృద్ధి, మీ అధోగతి రెండూ మీ గుణముల ననుసరించియే సిద్ధించును. వ్యాసభగవానుడు, భగవత్తత్త్వము ఎవరికీ యేమాత్రమూ తెలియని పరిస్థితిలో, అందరికీ విశదముగా, సోదాహరణముగా, సుస్పష్టముగా అందించాడు.
శాస్త్రములలో కలియుగము మోక్షసాధనకు అనుకూలమైనదిగా పేర్కొన్నారు. గడిచిన యుగాలలో మోక్షప్రాప్తికి కఠిన తపస్సు అవసరం అయ్యేది. మీరిప్పుడు కలియుగంలో నామస్మరణ ద్వారానే మోక్షం పొందవచ్చు. ప్రభువు నామం స్మరించి దానికి సంబంధించిన వైభవమును భావించినప్పుడు మనస్సుమహదానంద తరంగితమై ఉప్పొంగుతుంది. వ్యాసునికి కూడా ఈ విషయం తెలుసు. ఒకనాడు కొందరు ఋషులు వ్యాసుని దగ్గరికి వెళ్ళి మోక్షప్రాప్తికి మానవుడు అనుసరించే యోగ మార్గాలలో సుకరమైనది, ఫలసిద్ధి కలిగించేదీ ఏదని ప్రశ్నించారు. వారి ప్రశ్నను ముందుగానే ఊహించి, కలియుగములో పుట్టబోయేవారు ఎంత అదృష్టవంతులో కదా అన్నాడు బిగ్గరగా. ఈ యుగంలో భగవదనుగ్రహం సంపాదించుకోవటం సులభసాధ్యం. (దివ్యఙ్ఞాన-దీపికలు ద్వితీయ భాగం పు 54-55)