సైన్సు, ఆధ్యాత్మికం, మేథమేటిక్సు - గణితం - ఆధ్యాత్మికం - ఇట్లా అన్ని విషయములనూ ఆధ్యాత్మికంతో సమన్వయం చేయాలి. ఈ మేథమేటిక్సు-గణిత శాస్త్రం ఉంది. గణితానికి ఆధ్యాత్మికానికి ఏమిటి సంబంధం? ప్రాకృతిక సంబంధమైన గణితానికి ఆధ్యాత్మిక సంబంధమైన గణితానికి చాలా తేడా ఉంది. వ్యావహారిక గణితంలో 3-1=2. ఆధ్యాత్మిక గణితంలో 3-1=1. ఏమిటి? 3-1=2 అవుతుంది గాని 1 ఎట్లా అవుతుందని మీరు సందేహించవచ్చు. ఈ ప్రశ్నకు ఆధ్యాత్మికం సరైన సమాధానం చెప్తుంది. ఒక అద్దముంది. అద్దం ముందు నీవు నిలుచున్నావు. అందులోని ప్రతిబింబం చూస్తూన్నావు. ఇక్కడ ఎన్ని ఉన్నవి? అద్దము, నీవు, నీ ప్రతిచింబము.ఈ మూడింటిలో ఒక అద్దము తీసి వేస్తే ఒకటి పోయింది. దానితో పాటు ప్రతిబింబము కూడా పోయింది. ఇక మిగిలింది ఒకటే. ఈ ప్రకృతి ఒక అద్దము, దైవము బింబము, జీవుడు ప్రతిబింబము. జీవుడనే ప్రతిబింబము అద్దమనే ప్రకృతి ఉంటేనే కన్పిస్తుంది. అద్దమనే ప్రకృతిని తీసివేస్తే జీవతత్వము కూడా దానితో పాటే పోతుంది. ఇక ఉన్నది ఒక్కటే దైవత్వం.
(వ.1984పు 21)