ఇదే రామాయణమును వేదవ్యాసుడు కూడను రచించినాడు. ఆధ్యాత్మికరామాయణమని దాని పేరు. ఆరామాయణమునందు, రాముడు కేవలము భగవంతుడని స్పష్టంగా ప్రకటిస్తూ వచ్చాడు వేదవ్యాసుడు. వాల్మీకి రామాయణమునకు, వేదవ్యాసుని రామాయణము నకు ఉన్నటువంటి తారతమ్యాన్ని మనము చక్కగా ఉదాహరణలతో నిరూపించవచ్చు. మనము ఒక డ్రామా (Drama) వేస్తున్నామనుకోండి. ఆనాటకమునందు ఎల్లయ్య అనే వ్యక్తి ఒక రాముని వేషమును ధరించి, స్టేజీ (Stage) పైన యాక్ట్ (Act) చేస్తున్నాడు. ఆరాముని అభినయము. ఆరాముని గానము, యాక్టింగు (Acting), చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చూస్తున్నటువంటి ప్రేక్షకులు "రాముడు చక్కగా యాక్ట్ (Act) చేశాడు; రాముడు చక్కగా పాడినాడు" అని మాత్రమే హర్షిస్తూ ఉంటాడు. కాని తెరవెనుక ఉన్నటువంటి వ్యక్తులందరూ "ఎల్లయ్య చక్కగా యాక్టు (Act) చేసి నాడు; ఎల్లయ్య చక్కగా పాడినాడు" అని అతనిని వర్ణిస్తూ ఉంటారు. కనుక ఈ రెండింటియందున్న తారతమ్య మేమనగా, వాల్మీకి రామాయణము ప్రేక్షకుల ఆనందమును నిరూపిస్తుంది. వేదవ్యాసుని రామాయణము తెరవెనుక ఉన్నవారు గ్రహించిన రహస్యాన్ని నిరూపిస్తుంది. -
(ఆ.రా.పు.3)
(చూ: లోకనాటకము)