ఈనాడు అనేకమంది వృద్ధులు దిక్కులేని వారుగా జీవితాన్ని గడుపుతున్నారు. కుమారులు ఉండినప్పటికీ వారి ఇంట ఇంత తిండికైనా నోచుకోని దీన స్థితిలో ఉన్నారు. వృద్ధులు జీవించియున్నంత వరకు ఆనందంగా జీవించాలి. శోకభాష్పాలతో జీవితాన్ని అంత్యం గావించకూడదు. కడపటి శ్వాసను కూడా ప్రశాంతంగా వదలాలి. కనుకనే, ఈనాడు కాడుగోడిలో ఒక వృద్ధాశ్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఇందులో ఎవరైనా వచ్చి చేరవచ్చు. లోకంలో ఎంతమంది శ్రీమంతులు లేరు! కానీ ఇతరులకు ఒక టంబ్లరు నీరైనా ఇచ్చే పుణ్యానికి పోరు. అది కాదు మానవ జీవితం. వేదము "న కర్మణా నప్రజయా ధనే న త్యాగే నైకే అమృతత్వ మానసుః" అన్నది. త్యాగముద్వారా అమృతతత్వాన్ని పొందాలి. సత్యసాయి సంస్థలలో ప్రవేశించిన ప్రతి వ్యక్తి పరోపకారంలో ప్రవేశించాలి. గొప్ప గొప్ప ప్రచారములు మనం చేయనక్కర లేదు: నిశ్శబ్ధంగా మన పని మనం చేయాలి.
(స.. సా.ఏ.99పు.88)