స్వధర్మమును శౌర్య వంతముగా నిర్వర్తించుట యనునది సర్వోన్నత దర్మమే గాని, విధి అనగా నేమి? ఈ సందిగ్ధ సమస్యా సంబంధ మయిన మతమునకు, నైతిక విధానమునకు మధ్య అటువంటి వివాద మొకటి కలదు. "గహన కర్మణాగతి" అనగా కార్యవిధానము సాంద్రమైనది. క్లిష్టమైనది, భగవానుని దృష్టిలో యేది విధియో, యేది కాదో, యేది కర్మమో, యేది కర్మము కాదో నిర్ణయించుటకు మేధావులు కలవరపడిరి, పడుచున్నారు. కానీ మీకు ఆచరణ యోగ్యమైన మార్గమును గుర్తించుటకు కావలసిన జ్ఞానమును భగవానుడు తానే దెలి పెద ననెను. ఆ పరమరహస్యమై పరమ శ్రేష్ఠమూ అయిన పద మిది:
"మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు
మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియో సిమే"
"సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
ఆహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచః"
తా ॥ మన్మనస్కుడవు, మత్ప్రి యుడవు, ముదారాధకుడవు కమ్ము. నా కొర కొక త్యాగివి కమ్ము. నాకు నమస్కరించుము. నీవు నా దగ్గరకే వచ్చెదవు. ఇదే నీకు నా బోధన, నా వాగ్దానము. నాకు ప్రియుడవు కమ్ము, త్యజించి సర్వ ధర్మములను పొందుము. నాతోనే శరణ్యం, దుఃఖించకు, సర్వపాపముల నుండీ, కీడుల నుండి విముక్తుని చేతును.
ఆహా! సూక్షముగా ఈ పై రెండు శ్లోకముల భావము ఆత్మార్పణ, ఇది చాలదా తరించుటకు, స్వామిని రమించుటకూ, ముక్తిని పొందుటకు! "మన్మన" యనగా అతనిని ప్రతి జాతి యందు చూచుట, అతనిని సర్వదా జప్తి యందుంచు కొనుట, యెరుకతో నుండుట, ఆనందముతో నుండుట. "మద్భక్త" అతనితో అఖండమైన భక్తి ప్రేమలపై నిర్మంపబడిన యేకత్వమును విశదీకరించుట. "మద్వాజి" పెద్ద, చిన్న, అన్ని విధములైన పనులనూ పరమాత్ముని అనగా కృష్ణునిపై పరిత్యాగమువలె అర్పణ చేయుట, ఆ ఆనందమునకై అహమును కర్మఫలమును త్యజించి యెల్ల వేళలలో సత్య క్రమమయిన కర్మలో మునిగియుండుట అని తెలిపెను. పరిపూర్ణార్పణము చేయుట యనునది మానవునకు కష్టమయిన పనే కానీ అదియును, లేశమాత్రమైననూ ప్రయత్నించినచో భగవానుడే అతనికి తగిన సర్వమును విజయ నిశ్చయమును సూచింపగలడు. ప్రసాదించగలడు. ప్రక్కతోడై గురుడు, రక్షకుడు, స్నేహితుడు కాగలడు. ‘స్వల్పమప్యన్య దర్శస్యత్రాయతే మహతో భయాత్’ ఈ ధర్మములో స్వల్ప మాత్రమైననూ సరే మానవుని మహాభమయు నుండి తొలగించును. ధర్మమును ఆచరించుట ఆనందకరమని సులభమని కూడ కృష్ణ పరమాత్మ తెలిపెను. "మమే వైష్యసి" (నాదగ్గరకు నీవు వత్తువు) అనగా అతడు నన్ను తెలిసికొనును, నాలోకి వచ్చును, నా ప్రకృతిని పొందును ఈ పదము లందు“ సాదృశ్యము" భగవ త్ప్ర కృతి " సాలోక్యము" భగవానినుతో నివాసము, " సాయుజ్యము" భగవంతునితో ఐక్యతా అనుభవములు వివరించెను. ఈ పవిత్ర గీత దేవునిలో నివసించుటను వివరించెను.
(గీ.పు. 7/9)
ఆత్మార్పణం ఎలాగుండాలో ఒక దృష్టాంతం చెప్తాను వినండి.
ఖట్వాO గ మహారాజు ఒకసారి అడవిదారిలో వెళుతున్నాడు. అప్పుడతనికి దారిలో ఒక గురుదర్శనం అయింది. వెంటనే అతడు గుఱ్ఱం మీదినుండి క్రిందికి దిగి, గురువుకు నమస్కరించాడు. స్వామీ! నేను మళ్ళీ రికాబు మీదకాలుపె ట్టి గుఱ్ఱాన్ని ఎక్కేలోగానే నాకు సాక్షాత్కారం కావాలి. అలా అణుగ్రహంచండి అని ప్రార్థించాడు. అట్లయితే నేను చెప్పినట్లుగా నీవు చెయ్యాలీ అన్నాడు ఆ గురువు. చేస్తానన్నాడు రాజు. అప్పుడు ఆ గురువు నీ దేహం,మాట, మనస్సు ఈ మూడూ నాకు అర్పించు , అన్నాడు. అర్పించాను వెంటనే గురువు అదృశ్యమైపోయాడు. రాజు నిల్చున్నచోటనే నిలబడి ఉండిపోయాడు. ఎంతసేపటికీ రాజు రాజభవనానికి తిరిగి రానందువువల్ల పరిజనులు వెతుక్కుంటూ వచ్చారు. అడవిలో నిలబడియున్న రాజును చూసి ఎన్నివిధాలుగా మాట్లాడించాలని చూసినా ఆయన వారితో మాటలాడలేదు. చివరకు అడవి అంతా గాలించి వారు గురువును పిలుచుకొని వచ్చారు. రాజ గురువుకు నమస్కరించి మాటలాడాడు. పరిజనులు, ప్రభూ! తమరు మాతో ఎందుకు మాటలాడలేదు?” అని అడిగితే, నా దేహము, మాట, మనస్సు ఈ మూటినీ గురువుకు అర్పించి యుండడంవల్ల వారి ఆజ్ఞ లేనిదే నాకు ఏమిచేసేందుకు అధికారం లేదు , అన్నాడు రాజు. గురువు అతని ఆత్మార్పణకు మెచ్చి, గుఱ్ఱాన్ని ఎక్కు అన్నాడు. ఖట్వాంగ మహారాజు రికాబుమీద కాలు పెట్టినవెంటనే అతనికి సాక్షాత్కారమై ముక్తి లభించింది. ((శ్రీ సత్య సాయి ఆనందసాయి పు375-376)