విష్ణువు భుజగశయనుడుగను, శాంతాకారుడుగను వర్ణింపబడినాడు. భుజగశయనుడనగా, పాము మీద పరుండువాడని యర్థము. ఆ పాము ప్రపంచమే. అది యెట్లనగా: పాము విషసహితము; ప్రపంచము విషయ సహితము, విషయము విష సదృశమే, కాబట్టి ప్రపంచం సర్పదృశమే. నీ వా సర్పము మీద పరుండి యున్నావు. అది నిన్ను చుట్టివేయకుండా - నీవు శాంతాకారుడవై యుండవలెను. నీవు నీ పడవను నీటి మీద ఎంత దూరమైనను పోనిమ్ము భయము లేదు. ఆ నీటిని మాత్రము పడవలోనికి రానీకుము. రానిచ్చితివా మునిగిపోదువు. అట్లే, ప్రపంచములోనే యుండుము; కాని ప్రపంచమును నీలో ప్రవేశింపనీయకుము. ఈ రహస్యమును గుర్తించితివేని, నీ జీవితము విజయవంతమగును. (శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 121)