జడభరతుడు తత్వమున అనేక విధములైన మార్గములందు ప్రచార ప్రబోధలు సల్పాడు. ప్రధానమైనది ఇంద్రియ నిగ్రహము. పదార్ధములు ఎక్కువగా మనము ఆశించకూడదు. కోరికలు తగ్గించుకోవాలి. మన సుఖదుఃఖములకు కారణము కోరికలే. కోరేవాడు భక్తుడు కాదు. ఫలాపేక్షతో పని చేసేవాడు భక్తుడు కాదు. లోకహితమునకై సాధన చేయాలి. గొప్ప వేదాంతి అయినప్పటికి, నిరంతరము వేదము ఉచ్చరిస్తున్నప్పటికీ, శాస్త్రములు క్షుణ్ణముగా తెలిసిన వాడైనప్పటికి సాధనలు సలుపుతూ ఉండే వాడైనప్పటికి, యజ్ఞయాగాదులు క్రతువులు చేసినా వానివలన భగవంతుడు చిక్కడు అనేది జడభరతుడు చాటుతూ వచ్చాడు. ఇవన్నీ మానసిక తృప్తికై ఆచరించే ఆచరణలే. ఈ వాంఛ లుండినంత కాలము ఏనాడు దైవాన్ని ఆశించలేదు. దైవాన్ని పొందలేడు. అనే సత్యాన్ని గుర్తిస్తూ వచ్చాడు. దానికి చక్కని ఉదాహరణము బోధిస్తూ వచ్చాడు. కర్పూరము పెట్టిన పెట్టి ఆ కర్పూరము కొంత కరిగిపోయినప్పటికి ఆ పెట్టె ఉండినంత కాలము కర్పూర వాసన పోదు. విషయ వాసనలతో కూడిన పెట్టి ఈ దేహము. కోరికలు నశించినా వాసన దేహమునుండి పోదు. వాసనలుండినంత వరకు దైవము మనకు కనిపించడు. ఇదే ఆత్మబోధ. .
(భ. స..మ. పు.99)