ఆత్మబలం: Cosmic Energy - ఎప్పుడు ఎవ్వరికి ఏవిధంగా వస్తుందో చెప్పుట ఎవ్వరికీ సాధ్యము కాదు. ఇది ప్రతి వ్యక్తి యందు కలదు. పదార్థ మానసిక శక్తుల మీద ఆధారపడినంత వరకూ cosmic energy ను తెలుసుకొనలేము. శరీర శక్తి నుండి మానసిక శక్తికి - మానసిక శక్తి నుండి cosmic energy కు ప్రవేశించుటకు ప్రయత్నం చేయవలెను.
సముద్ర తరంగములలో కూడా ఒక విధమైన బలముండును. తరంగములు తక్కువగా నుండుటచే బలము తక్కువగా నుండును. సముద్రములో సుడిగాలి వచ్చినపుడు ఆ తరంగములు పడవలను ముంచి, కొండలను కూల్చివేయును. కాని ఆతరంగములకు ఈ విధమైన శక్తి ఎక్కడ నుండి వచ్చినది? దీనినే శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసుకుంటూ వెళ్తున్నారు. లక్షల మైళ్ళ కొలది అంతరిక్ష యానము చేసేశక్తి అతని హృదయంలో ఆంగుళంలోనే ఉంది. ఈ ఆత్మశక్తి లేకపోతే లక్షల లక్షల మైళ్ల కొలది ప్రయాణము చేసే శక్తి ఉండేది కాదు.
బ్రతుకు బ్రహ్మ నుండి వచ్చినది. కానీ బాహ్యం నుండి వచ్చినది కాదు. అన్నము నుండి జీవిస్తున్నామని అనుకుంటున్నాము. కాదు ఆత్మనుండే జీవిస్తున్నాము. అన్నము, అన్నీ ఉండికూడ జీవించ లేనివా రెందరు లేరు? కూటికి లేనివారు ఎంతమంది జీవించుటలేదు? కనుక జీవితమునకు అన్నము ప్రధానం కాదు, ఆత్మ ప్రధానము.
మన చదువు సంధ్యలు ధనబలము, భుజబలము సర్వబలములూ బుద్ధిబలముచే సంపూర్ణంగా ఆధారపడి ఉంది దైవానుగ్రహం లేకపోతే ఎన్ని విధములైన శక్తి సామర్థ్యము లున్నప్పటికీ అవన్ని నిరూపయోగమే.
(త.శ.మ.పు.55)