ఒక గ్రామంలో ఒక వ్యక్తి నిత్యం పట్టుబట్టలు ధరించి, విభూతి పిండికట్లు పెట్టుకుని, చేతిలో రుద్రాక్ష మాల త్రిప్పుతూ ఉదయం నుండి రాత్రి పది గంటల వరకూ శివాలయంలో కూర్చుని కన్నులు మూసుకుని జపం చేయడం మొదలు పెట్టాడు. మధ్యాహ్నం తలుపులు మూయడానికి పూజారికి కొంత ఇబ్బందిగా ఉండి, అసలు ఈ వ్యక్తి ఎంతటి భక్తుడో తెలుసుకుందామన్న ఉద్దేశ్యంతో రహస్యంగా ఒక రాత్రి అతడు శివలింగం వెనుక దాగి ఉండి, "భక్తా! నీ జపధ్యానాలకు మెచ్చాను. నీ ప్రాణాలను నాలో లీనం చేసుకుని నీకు మోక్షం ప్రసాదిస్తాను. నువ్వు లేచి ఇలా దగ్గరకు రా నాయనా!" అన్నాడు. అంతే! ఆ వ్యక్తి లేచి జపమాల అక్కడే పారేసి ఆలయం బయటికి పరిగెత్తాడు. జీవిత పరమావధి గ్రహించకుండా, లౌకిక వాంఛలు తీరడానికి తాత్కాలిక ఆవేశంలో జపాలు, వ్రతాలు మ్రొక్కులు అంటూ చూపే ఆడంబర భక్తి ఆత్మవంచనే అవుతుంది. భగవంతుడు భావప్రయుడు. భగవంతుడు కట్టుబడేది భక్తుని ప్రేమపాశానికి మాత్రమే.
(స.పా.ఏ. 99 వెనుకపుట)