"నిర్భయత్వం ఆటల వల్ల కలుగుతుంది. ఆటల యందు ఆధ్యాత్మికభావాన్ని, దివ్యమైన సంకల్పాన్ని, పవిత్రమైన నడవడికను అలవరుచుకోవాలి. ఆటల్లో ఆధ్యాత్మికమునకు అవకాశం ఎట్లా ఉంటుంది? అని మీరు సందేహించవచ్చు. మనం ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్, త్రోబాల్ ఆడుతున్నాం. ఈ ఆటలకు మన నిత్య జీవితానికి సన్నిహిత సంబంధమున్నది.
మన జీవితం ఒక ఫుట్బాల్ లాంటిది. కష్టసుఖాలనే ఆటగాండ్రు, అహంకారమనే గాలి వున్నంతవరకు జీవితమనే బంతిని తన్నుతూనే వుంటారు. బాల్లో గాలి వున్నంత వరకు కాలికి దెబ్బలు తప్పవు. అహంకారమనే గాలిపోతే ఈ కాలిదెబ్బలు వుండవు. కోర్టులో కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలనే ఆటగాండ్రు ఒకవైపు: సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింస, క్రమశిక్షణలు అనే ఆటగాండ్రు మరొకవైపు వుంటారు. వీరికి పొత్తు కుదరదు. మంచితనమును జయించాలని చెడ్డతనం, తప్పును ప్రక్కకు నెట్టాలని మంచితనం, నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ జయాపజయాలే ఒక విధంగా సంతోషాలు కష్టాలు, సుఖదు:ఖాలు. పాపపుణ్యాలు, ఈ ఆటలో రెండు హద్దుల మధ్యగా బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది. ఈ హద్దులు ఒకటి ధర్మమార్గము రెండవది బ్రహ్మమార్గము. జీవితమనే బంతి ఈ రెండు హద్దుల మధ్యనుండి పోవాలి. అప్పుడే విజయం. ఫుట్బాల్ బ్రహ్మచర్య జీవితానికి ప్రతీక. బ్రహ్మచారీ శత మర్కట:" అంటారు. మంచికి, చెడ్డకు పోరాటం! అడుగడుగునా జీవితమనే బంతికి దెబ్బలే దెబ్బలు తగిలినా విజయం సాధించడానికి ప్రయత్నించడం బ్రహ్మచర్య లక్షణము.
రెండవది బాస్కెట్ బాల్, ఇందులో కూడా మంచి, చెడు రెండు విభాగాలుగా ఏర్పడి, జీవితమనే బంతిని సంసారమనే వలలో పడవేయటానికి ఇరుపక్షాల ఆటగాడ్రు ప్రయత్నిస్తూ వుంటారు. జీవితమనే బంతిని వల అనే సంసారబంధనలో వేయడమే వారికి ఉత్సాహకరంగా వుంటుంది. జీవిత బంధనలో పడకపోతే వారికి నిరుత్సాహం కలుగుతుంది. బ్రహ్మచర్యంలో అపజయం కలిగినచో గృహస్తుడైపోతాడు. విజయం సాధించినచో జగత్తుకు ఆదర్శవంతుడవుతాడు. కనుక బాస్కెట్ బాల్ గృహస్థాశ్రమ ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. మూడవది వాలీబాల్. ఈ ఆటలో బంతి క్రిందపడకుండా ఇరుపక్షాల ఆటగాండ్రు ఎగిరెగిరి కొడుతుంటారు. ఉభయ పక్షాల మధ్య ఎత్తైన వల కట్టి వుంటుంది. వలకు తగులనీయకుండా ఇవతలివారు అటు అవతలివారు ఇటు బంతిని కొడుతుంటారు. బంతిని క్రింద పడనిచ్చిన వారు ఓడిపోయినట్లు అవుతుంది.
నాలుగో ఆట త్రోబాల్. ఇందులో బంతి బరువుగా వుంటుంది. బంతి బరువైనది కాబట్టి దూరంగా విసరాలని ప్రయత్నించినా దగ్గర గానే పడుతుంది. అంటే రాగద్వేషబంధనలు గాఢంగా వుంటాయని, అయినా వాటిని దూరంగా విసిరివేయటానికి ప్రయత్నిస్తుండాలని ఈ ఆట సందేశము.
"బ్రహ్మచర్యంలో మంచి చెడ్డలతో పారాడటం ఫుట్ బాల్ అంతరార్థం. గృహస్థాశ్రమంలో భోగభాగ్యాలలో బంధితుడు కావాలని ఆశించడం బాస్కెట్ బాల్ అంతరార్థం. వానప్రస్థంలో నీతి నిజాయితీలతో, బంధనతో సంబంధం లేకుండా జీవితం గడపాలని అశించడం వాలీబాల్ అంతరార్థం. ఈ ఆటలు నాలుగు అశ్రమ స్థితులను సూచిస్తున్నది. ఈ నాలుగింటిలోను విజయం సాధించడానికి మానవుడు ప్రయత్నించాలి".
(ఉదయం ప్రత్యేక అనుబంధం పు.8)