భారతీయ సంస్కృతి చాల పవిత్రమైనది. కాని, ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు. పర్వదినాల్లో భారతీయులు తమ ఇళ్ళకు పచ్చని మామిడి తోరణాలు కడుతున్నారు. ఎందుకోసం? మామిడాకులు మంగళకరమని భావిస్తున్నారు; కేవలం మంగళకరమే కాదు; ఆకులు మనం వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని, పవిత్రమైన ఆక్సీజనను అందించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ఈ నాటి పిల్లలు ప్లాస్టిక్ ఆకులతో - తోరణం కట్టుకోవచ్చు కదా! ప్రతి రోజు బయటికి పోయి ఆకులు ఎవరు తెస్తారు? అని విసుక్కుంటారు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు జరిగేచోట అలంకారంగా షామియానాలు కడుతున్నారుగాని, పూర్వము అలాంటివేమీ లేవు. కఱ్ఱలు పాతి, వాటిపై పచ్చని ఆకులు వేసి పందిరి ఏర్పాటు చేసేవారు. పెళ్ళిళ్ళలో అనేకమంది గుమికూడటంచేత వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోతుంది. దానిని నిర్మూలించి పవిత్రమైన ఆక్సీజన్‌ను అందించడానికి ఆకులతో పందిరి ఏర్పాటు చేసేవారు.
విద్యార్థులారా! భారతీయ సంస్కృతిని చక్కగా అర్థం చేసుకొని ప్రవర్తించండి. ఆధునిక చదువులు చదువవద్దని నేను చెప్పను. నేనే మన యూనివర్సిటీని ప్రారంభించాను. అలాంటప్పుడు మిమ్మల్ని చదువుకోవద్దని నే నెందుకు చెపుతాను! చదువుకోండి. కాని, దానితో పాటు ఆత్మతత్వాన్ని కూడా అర్థం చేసుకోండి; హృదయాన్ని విశాలం చేసుకోండి. ఒక ఆధునిక విద్యార్థి ఇంటి వరండాలో ఇంకు బుడ్డి పెట్టుకుని అందులో పెన్ను అద్దుకుంటూ హోమ్ వర్క్ చేసుకుంటున్నాడు. అతని తాతగారు అదే వరండాలో కూర్చుని ఒక చిన్న గ్లాసు నుండి స్పూలో నీరు తీసుకుంటూ "కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయనమః...... అని సంధ్యవార్చుకుంటున్నాడు. ఈ విద్యార్థితాను చేస్తున్న హోమ్ వర్క్ మానివేసి తాతగారివైపు ఆశ్చర్యంగా చూస్తూ కుర్చున్నాడు. "ఈ తాతగారు ఎంత పిచ్చివారు! స్పూనులో నీరు త్రాగుతున్నారేమిటి?!" అని అనుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. "తాతగారూ! మీకు అంత దప్పికగా ఉంటే ఒకేతూరి ఆ గ్లాసు ఎత్తుకుని నీరు త్రాగవచ్చు కదా!" అన్నాడు. ఆ తాతగారు చిరునవ్వులో "నాయనా! నా పని నాకు వదలి పెట్టు. నీ పని నీవు చూసుకో" అన్నాడు. కాని, ఈ పిల్లవాడు ఊరుకోలేదు. ఈనాటి పిల్లలు పెద్దవారి మాటల నేమాత్రము అర్థం చేసుకోలేరు. పైగా మొండితనంతో వాదించటానికి పూనుకుంటారు. "లేదు, తాతగారూ! ఎందుకోసం మీరు ఆవిధంగా చేస్తున్నారు?" అని అడిగాడు. అప్పుడాయన “ఒరే పిచ్చివాడా! నీవు ఇన్ని పర్యాయములు ఇంకు బుడ్డిలో పెన్ను అద్దుకునే బదులు ఒకేరూరి బాటిల్ లోని ఇంకునంతా పేపరు మీద పోయవచ్చు కదా అని చక్కగా చురక వేశాడు. దానితో ఆ పిల్లవానికి బుద్ధి వచ్చింది. తాతగారు "నాయనా! కవరుపై అడ్రసు సరిగా వ్రాసినప్పుడే అది చేరవలసిన వారికి చేరుతుంది. అదేవిధంగా, కేశవాయ నమః నారాయణాయ నమ... అని భగవంతుని పేరు చెప్పుకుంటూ తీర్ణం త్రాగినప్పుడే ఆది భగవంతునికి చేరుతుంది" అని వివరించాడు.
(స.సా. జె. 2000 పు. 19/20)