ప్రతిక్షణము యీ జగత్తునందు కర్మలు జరుగుతూనే వున్నాయి. పుణ్యములు, పురుషార్థములు, చావులు, పుట్టుకలు. పెండ్లిండ్లు, పేరంటములు యివి నిర్విరామముగా జరుగుతూ జీవితము నవ్వులలో యేడ్పులతో ముగిసిపోతూ వుంటుండా ది. దీనికి అంతమే లేదు. మానవుడు పుట్టగానే ఆకలి అతనిని వెంటాడుతుంది. నాభినాళమును త్రుంచగనే శిశువు కెవ్వు కెవ్వుమని ఏడుస్తుంది. ఏ తేనో, గ్లూకోజో, పాలో నాలుకకు రాసినప్పుడు ఆ ఏడుపు చల్లారుతుంది. మొట్టమొదట మానవుని ఏడిపించేది ఆకలి. ఈ ఆకలికి ధాన్యము అత్యవసరము. ఈ ధాన్యము వీటి వలననే లభ్యమవుతుంది. గాని మరొక మార్గములో లభ్యము కాదు. ఎన్ని మంత్రములు, ఎన్ని తంత్రములు కని పెట్టినప్పటికిని ఆకలి తీర్చునది. అన్నమేగాని యంత్రములు తంత్రములు గాదు. భూమి నీరును త్రాగి మానవులకు ధాన్యము నందిస్తుంది. ఆహార విహారములు అభివృద్ధికాగా మానవుల జనాభా దినదినమునకు పెరుగుతూ వచ్చింది. తరువాత పాడిపంటలు, గుడిసెలు, యిండ్లు, పల్లెలు, పట్టణములు పెరుగుతూ వచ్చాయి. ఈ విధముగా మానవ సంఘము దినదినాభివృద్ధి నొందుతూ తమ జీవితమునకు అవసరమైన దానిని అర్థము చేసుకుంటూ అవసరమైన వాటిని ప్రోగు చేసుకుంటూ కొన్ని రహస్యములను గుర్తించుకుంటూ వచ్చింది. ఇంతేకాక తమకు తెలియనివి అనేకముగా వున్నవని కూడను గుర్తించింది.
(ఉ.బ. పు. 15/16)