ప్రభువు కొన్నాళ్లు తమకు దూరమైనప్పుడు పల్లె ప్రజలు పొందిన విరహవేదనను గురించి జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి తన ప్రసంగంలో చక్కగా వర్ణించినాడు. ఆకాశంలో నీలమేఘం కనబడగానే తాము ఆరాధించే మేఘశ్యాముని తలచుకొని ఆనందభాష్పములు రాల్చి నారట. సమకాలీనులు కృష్ణుని గురించి కూడా ఎన్నో అపవాదులు వేసి వ్యాపింపజేశారు. ఇది ఎప్పుడూ జరుగుతునే ఉంటుంది. నీళ్లు సరఫరా చేసేటప్పుడు మంచినీళ్ళ గొట్టం ప్రక్కనే మురికి నీళ్ళ గొట్టం ఉంటుంది. అల్లాగే నిందాస్తుతులు ప్రక్క ప్రక్కనే ఉంటాయి. మాన్యులైనసత్పురుషులు అన్ని కాలాలలోనూ బాధ్యతారహితులైన విమర్శకులకు గురి అవుతూనే ఉంటారు.
సాధు పురుషులు ఏమంటారంటే లోకులు తమను చూసి సుఖంగా వున్నారు మీరు అన్నప్పుడు వాళ్లకు విచారం కలుగుతుందట. లోకులు తనను నిందించి, తాళంగ మృదంగాలు బద్దలు కొట్టి సంకీర్తనంతో సమయం వ్యర్థంచేస్తున్నానని తిట్టినప్పుడు చైతన్యుడికి చాలా ఆనందం కలిగేది. ఈ లోకులు మూర్ఖులు. చెట్టు ఆకులకు నీళ్లుపోస్తే వృక్షం పెరుగుతుందనుకుంటారు. ఆనందానికి మూలకారణమైన వేళ్లకు నీళ్లు పొయ్యాలి. అప్పుడు ఆనందం వృద్ధిపొందుతుంది. మీలోపల కృష్ణుడే ఆనందాలన్నిటికీ మూలం. ఆకృష్ణుడు మీ హృదయాల్లో వున్నాడు అనేవాడు చైతన్యుడు, కృష్ణనామ సంకీర్తనచేసే భాగ్యం కలిగిందన్న సంతోషంతో ఆనందభాష్పలతో ఆ వేరును తడపాలి. ఆ ప్రభువు మహిమలు కీర్తించటమే మహాభాగ్యంగా భావించాలి. విషాదాశ్రువులతోకాదు. ప్రభుని పాద పద్మాలు దుఃఖాశ్రువులతో మలినం చేయరాదు.
(వ.1963 పు.153/154)
(చూ॥ వెఱువనక్కరలేదు)