విభూతి యను పదమును మీరు చక్కగ అర్థము చేసి కొనలేదు. విభూతి యనగా మహిమ, ఐశ్వర్యము, అష్టసిద్ధులు, అట్టి విభూతిచే ఆలంకృతుడు ఈశ్వరుడు. ఇదియే వేద సమ్మతమైన యర్థము. కేవలము బూదినే ధరించినవాడు కాదని తెలిసికొనుడు. సర్వమును తుదకు బూడిదయే యగునని జ్ఞాపకము చేయుటకే నేను మీకు విభూతి నొసంగు చుండుట యని గ్రహింపుడు. వస్తువు లన్నియు విభూతి యగును. కాని విభూతి మఱొక వస్తువుగా మారదు. ఆదియే తుదియవస్థ, మార్పులేనిస్థితి.
(స.శి.సు.ద్వి.పు.349)
నేను సృష్టించే విభూతి దివ్య శక్తికి నిదర్శనం. భగవంతుని అనంతమైన, అమృతమైన, విశ్వవ్యాప్తమైన తత్వమునకు విభూతి ఒక సంకేతము. ప్రాపంచికమైన, క్షణికమయిన, పరిణామ శీలమయిన పదార్థములన్నీ ఆగ్నికి ఆహుతి ఆయినప్పుడు, చివరికి విభూతి రూపంగా పర్యవసానము పొందుతుంది.
వాంఛారహితమైన జీవితం అవసరమని నేను చెప్పాను. శివుడు కామదహనం చేసి ఆ భస్మమును తన దేహము నిండా ధరించి కామవిజయమును ప్రకటించాడు. కామము వరించినప్పుడు ప్రేమయే దేవతగా పరిపాలించింది. ఇదే విభూతిలో వున్న అంతరార్థము.
జనన మరణాల చక్రభ్రమణంలో చివరికి అంతా భస్మరూపమే పొందుతుంది. "ధూళిలో పుట్టిన నువ్వు, ధూళిలోనికి తిరిగి వెళ్తావు." భస్మము, ధూళి వస్తువుల చరమదశను సూచిస్తున్నవి. అటు పైన మార్పు వుండదు. పారమార్థిక దృష్టితో చూచినపుడు విభూతి జనులకు కోరికలను వదలివేయుమని, రాగ ద్వేషములను, వ్యామోహములను భక్తి జ్వాలలో భస్మము చేయవలసిందనిహెచ్చరిస్తున్నది. ఈ విధంగా ఆలోచనలు, మాటలు చేష్టలు పవిత్రం కాగలవు.
భక్తి ప్రేమలతో నా దరికి చేరినవారికి ఈ సందేశమును అందించటం కోసమే నేను విభూతి సృష్టించి ప్రసాదిస్తున్నాను. ఇతర రక్షల మాదిరిగానే విభూకూడా రోగులకు వ్యాధి నివారణము, ఆర్తులకు రక్షణము అందిస్తున్నది.మాంత్రికుల గారడీ వల్ల వచ్చే విభూతికీ దివ్యత్వ సంకేతమయిన ఈ విభూతికి పోలిక లేనేలేదు. .
(స.ప్ర. పు.17, 18)