భీష్ముడు. విభీషణుడు-వీరిరువురిలో ఎవరు గొప్పవాడు? భీష్మునికంటే విభీషణుడే గొప్పవాడు. ఎందుచేత? కౌరవులు చేస్తున్నది పాపమని తెలిపినా వారికి ఎదురు చెప్పలేకపోయాడు భీష్ముడు. పైగా యుద్ధంలో వారి సైన్యాధిపతిగా నిల్చాడు. కాని, విభీషుణుడు అట్లాకాడు. తన అన్న చేసిన పని చాల తప్పు అని ఇండించాడు. సీతము తిరిగి రామునికి అప్పజెప్పమని హితవు చెప్పాడు. తుదకు అన్ననై నా వదలిపెట్టి రాముని పాదము పట్టాడు. లంకలో ఒక్క విభీషుణుడే కాదు, అలాంటి మహనీయులు ఎంతమందో ఉండినారు. కాని దుర్మార్గానికి దౌర్జన్యానికి వెఱచి వారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు.
మొదట హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు విభీషణుని కలుసుకున్నాడు. "వాయుపుత్రా! దంతముల మధ్య నాలుకవలె నేనీ లంకలో మహారాక్షసుల మధ్య జీవిస్తున్నాను. ఎంతకాలము నేనీ విధంగా జీవించాలి? శ్రీరాముని అనుగ్రహం నా కేవిధంగా లభిస్తుంది? ఆ మహనీయుని దివ్య సన్నిధి నాకెప్పుడు లభ్యమవుతుంది? ఆ క్షణముకోసం నేను చాలాకాలంగా వేచియున్నాను" అని విభీషణుడు మొరపెట్టుకున్నాడు. అప్పుడు హనుమంతుడు విభీషణునికి చక్కని సందేశము నిచ్చాడు. "విభీషణా! నీకే కాదు. ఈ లోకంలో మంచి వారందరికీ కష్టాలు తప్పవు. మహనీయులను, తాపసులను, అవతారములను దుష్టులు, దుర్మార్గులు, రాక్షసులు వెంటాడుతూనే ఉంటారు. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ముందు పుట్టినది నాలుక, మధ్యలో పుట్టినవి దంతములు. మధ్యలో పుట్టిన దంతములు మధ్యలోనే ఊడిపోతాయి కదా! అదేవిధంగా ఈ రాక్షసులందరూత్వరలోనే రాలిపోతారు. ఇందులో సందేహం లేదు" అని ఓదార్చాడు. "విభీషణా! పట్టితివి రాముని పాదము. దానిని గట్టిగా పట్టుకో. పోరుపడలేక తానైనా బ్రోవవలము, ఒడలు తెలియకనీ వైనా అడుగవలయు. అని, మద్యలో వదిలివేయుట భక్తుని లక్షణం కాదు" అన్నాడు. భక్తి ఆంటే ఏమిటి? కేవలం రాం, రాం, రాం....అంటూ జపం చేయడమా? కాదు. కాదు. రామచింతనతోపాటు రామకార్యంలోను పాల్గొనాలి.
విభీషణుడు లంకక్షేమమును, రాక్షసులందరి క్షేమమును ఆశించాడు కాని సింహాసనము కోరలేదు. ఇంతటి ఉన్నత భావములు కల్గిన విభీషణుని రావణుడు, ఇంద్రజిత్తు అనేక విధములుగా తూలనాడారు. ఒకానొక సమయంలో రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు బ్రహ్మను గూర్చి కఠోరమైన తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు. కుంభకర్ణుడు తనకు నిర్దయ కావాలని కోరుకోవాలనుకున్నాడు. కానీ, అతని నాలుక మందంగా ఉండటంచేత నిర్ణయ కావాలనడానికి బదులు నిద్ర కావాలన్నాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. రావణుడే ఏమి కోరాడు? దేవతలు గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషుల చేతిలో తన ప్రాణం పోకూడదని కోరు కున్నాడు. కాని, మానవుని చేతిలో పోకూడదని కోరుకోలేదు. ఎందుకనగా, ఆతని దృష్టిలో మానవుడు చాల బలహీనుడు, ఆల్పుడు. విష్ణువు దీనిని ఆసరాగా తీసుకుని మానవాకారంలో అవతరించి రావణుని హతమార్చుతానన్నాడు. ఇంక విభీషణుడు ఏమి కోరాడు? స్వామీ! నా హృదయాన్ని దయతో నింపు. నిరంతరము దయామయుడవైనా జీవితాన్ని దానధర్మాలతో గడిపేటట్లు అనుగ్రహించు" అని ప్రార్థించాడు. కనుకనే రావణుడు, అతని కుమారులు తనను ఎన్ని విధాలుగా దూషించినను విభీషుణుడు దేనికీ చలించలేదు. క్రోధానికి లోను కాలేదు. నిరంతరము దయామయునిగానే జీవించాడు. దయలో తన హృదయాన్ని నింపుకోవడం చేతనే ఆతనికిదైవానుగ్రహం, దైవసన్నిధి ప్రాప్తించాయి. దయలేనివాడు దానవుడే కాని, మానవుడు కాదు.
(స.పా.డి.96పు.334/335)
రామలక్ష్మణులు రావణుని కుమారులను, కుంభకర్ణాది మహావీరుల నందరిని సంహరించారు. ఇంక రావణుడు మాత్రమే మిగిలాడు. ఆ సమయంలో ఒక మహాబలశాలి
యుద్ధంలో ప్రవేశించాడు. విభీషణుడు రామునిలో, "ఇతను రావణునికంటే మహాశక్తి సంపన్నుడు. ఇతనిని అణగదొక్కితే లంకనే నీవే హస్తగతం గావించుకున్న వాడవవుతావు" అన్నాడు. రాముడు అతనితో మహాభయంకరంగా పోరాడినాడు. కాని, ఎంత సేపు పోరాడినా అతనిని జయించ లేకపోయాడు. కడపటికి అలసిపోయి విరమించుకుందామనుకుంటున్న సమయంలో విభీషణుడు "రామా! ఇది నీవు విశ్రాంతి తీసుకోవల్సిన సమయం కాదు. కొన్ని నిముషములు ఆలస్యం చేస్తే అతనిని జయించడం చాల కష్టం. కనుక, ఎలాగైనా పోరాడి అతనిని సంహరించు" అన్నాడు. విభీషణుని ప్రోద్బలంతో రాముడు మరింత విజృంభించి ఆ మహాబలశాలిని సంహరించాడు. అతడు నేలకూలిన తక్షణమే విభీషణుడు మూర్చపోయాడు. కాని వెంటనే తేరుకుని రామచింతన చేయసాగాడు.
రామునికి ఆశ్చర్యం వేసింది. "విభీషణా! ఈ రాక్షసవీరుడు మరణిస్తే నీవు మూర్చ పోవడానికి కారణ మేమిటి?" అని ప్రశ్నించాడు. "స్వామీ! ఆ మహాబలశాలి నా కుమారుడే. దేహ సంబంధమైన మమకారముచేత వాని మరణానికి తట్టుకో లేకపోయాను. ఇది నాబలహీనత. నీ ప్రేమను హృదయంలో నింపుకున్న నేను ఇట్టిబలహీనతకు అవకాశం ఇచ్చినందుకు విచారిస్తున్నాను" అన్నాడు. అప్పుడు రాముడు, "అయ్యో విభీషణా! అతడు నీ కుమారుడని ముందే ఎందుకు చెప్పలేదు?" అని అడిగాడు. "రామా!యుద్ధంలో ఎవరైనా బంధుత్వాన్ని పాటిస్తారా? శత్రుపక్షంలోని వాడెవరైనా మనకు విరోధేకాని బంధువుకాదు. అందులోను భగవంతుడవైన నీతోటి పోరాడటానికి వచ్చిన వానితో నాకు సంబంధమేమిటి! నేను నీకు శరణాగతుడను, నీదాసుడను. నీ విజయమే నాకు కావలసింది" అన్నాడు. చూశారా! రామునివిజయం కోసం విభీషణుడు కన్న కొడుకునైనా చంపుకోవడానికి వెనుకాడలేదు. రామునికి లక్ష్మణుడు సాత్విక సోదరుడైతే విభీషణుడు సాత్విక మిత్రుడు.
(స.సా.డి.96పు.335/336)
(చూ॥ రావణుడు)