ఈనాడు. వినయము అనేది ఎక్కడా కనిపించటం లేదు. కర్రలు వేసి కట్టినట్లుగా ఉంటుంది. నడుము. పెద్దల ముందర నడుము వంచరు, తలవంచరు. వినయములేని ఆహంకారికి సుఖం ఎట్లా లభిస్తుంది? అహంకారం ఉన్నంత వరకు కట్టుకున్న భార్య అయినా, కన్న కుమారుడైనా గౌరవించడు. ప్రేమించడు. కనుకమొట్టమొదట అహంకారమును దూరం చేయి. అప్పుడే నీ జీవితానికి శాంతి కలుగుతుంది. ప్రాచీన భారతీయులు వినయానికి ప్రముఖ స్థానం యిచ్చారు. భవనాలు కట్టేటప్పుడు కూడా వినయాన్ని బోధించే విధంగా శ్రద్ధ తీసుకున్నారు. పట్టణాల వారికి ఎక్కువగా తెలియదు. పల్లెలకు వెళ్ళితే ఈ విషయం తెలుస్తుంది. చూద్దామంటే పెద్ద పెద్ద భవనాలు, వాటికి దర్వాజాలు, తలుపులు మాత్రం చాలా చిన్నవి. అంత చిన్నవి ఎందుకు పెట్టారని అడిగితే వారి సమాధానం. "ఎవరైనా వారిండ్లకు వస్తే వారు అతిథులు, బంధువులు అవుతారు. అతిధి అభ్యాగతులకు గుణపాఠం నేర్పే నిమెత్తమై మా ప్రాచీనులు చిన్న చిన్న దర్వాజాలు, తలుపులతో భవనాలు కట్టారు. వారు లోపల ప్రవేశించే టప్పుడు తలవంచుకుని రావాలి. ఈ విధమైన అభ్యాసం నేర్పేనిమిత్తమై మా ప్రాచీనులు ఈ విధంగా భవనాలు కట్టారు అన్నారు. సహజంగా మన ఇండ్ల అన్నింటికి గడపలు (గుమ్మాలు) ఉంటాయి. ఆ గడప ఎందుకు? అని ఈనాటి ఆధునికులు ఆ గడపను తీసి వేస్తున్నారు. వర్షం వస్తే కప్పలు లోపలికి ప్రవేశిస్తాయి. ఆ కప్పల కోసం పాములు వస్తాయి. పాముల వల్ల ప్రాణాలు పోతాయి. కనుక ఎత్తైన గడప పెట్టాలి. ఇది ఎందుకు పెట్టారని ఆ పల్లెవారిని అడిగితే "ఎవరైనా దొంగలు వచ్చిసామాను ఎత్తుకొని పోతుంటే ఈ గడప తగిలి పడతాడు" అని చెప్పారు. ఈ విధంగా ఆలోచిస్తే ప్రతి పని, ప్రతి ఆచారం, ప్రతి సంప్రదాయం వెనుక ఎన్నో అంతరార్థాలున్నాయి. నిశితంగా ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తే మన ప్రాచీనులు నియమించిన ప్రతి నియమం కూడనూ మన క్షేమం కోసమనే, సంఘసంక్షేమం కోసమనే, మానవ అభివృద్ధి కోసమనే విషయం మనకు స్పష్టమవుతుంది.
(శ్రీ ఆ.99.పు.11)
(చూ: నరుడు, యుక్తి, శిక్షావల్లి, శివ, సంస్కృతి)