భారతీయ సంస్కృతి చాల విశాలమైనది, పవిత్రమైనది. - పూర్వం 5 సంవత్సరముల పిల్లలచేత విద్యాభ్యాసం చేయించేటప్పుడు మొట్టమొదట "ఓం నమశ్శివాయ, ఓం నమో నారాయణాయ" అనే పవిత్రమైన మంత్రములను నేర్పించేవారు. కానీ, ఈ ఆధునిక యుగంలో చిన్న పిల్లలకు "బా...బా...బ్లాక్ షీప్..." అని అర్థరహితమైన విషయాలను నేర్పిస్తున్నారు. ఐతే, ఈ ప్రాకృతమైన విద్యను కూడా బోధించవచ్చును. కానీ, దీనితోపాటు పవిత్రమైన భారతీయ సంస్కృతిని కూడా గుర్తింప చేయాలి. ఈనాడు కేవలం ప్రాకృతమైన విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంచేత మానవునిలో దైవంపట్ల సందేహాలు మితిమీరిపోతున్నాయి. జీ కాలంలో డౌటింగ్ థామస్ ఒక్కడు మాత్రమే ఉండేవాడు. కానీ, ఈ కలియుగంలో అందరూ డౌటింగ్ థామస్ లే!
(స...వా. 99పు. 156)
ఈ (రామలక్ష్మణ భరతశతృఘ్నులు) పిల్లలకు 5వ సంవత్సరములో ఉపనయన సంస్కారము గావించాడు దశరథుడు. తరువాత విద్యాభ్యాసము నిమిత్తమై వశిష్ఠులవారి దగ్గర చేర్చాడు. ఇక్కడ 10వ సంవత్సరము లోపలనే సమస్త వేదములను నేర్చుకున్నారు. ఇంతేగాక మహాపురుషులుగా రూపొందారు. లౌకికమైన విద్యలందేగాక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విద్యలందు కూడా ప్రవీణులైనారు. నేను, నా కుటుంబము, నా దేశము మాత్రమే సుఖంగా ఉండాలనే సంకుచిత భావములను వారు ఏనాడు ప్రకటించలేదు. “సర్వలోక హితే రతః" సమస్త జ్ఞానములను తెలుసుకున్నారు. లౌకికమైన జ్ఞానములన్నీ చిన్న చిన్న నదులవంటివి. ఆత్మజ్ఞానము సముద్రమువంటిది. “నదీనాం సాగరో గతి:” చిన్న చిన్న నదులన్నీ సాగరమునందే ఐక్యమవుతున్నాయి. అట్టి సాగర స్వరూపమైన ఆత్మజ్ఞానాన్ని అభ్యసించారు ఈ నల్గురు అన్నదమ్ములు. ఇంక, వీరియందున్న గుణములు ఎలాంటివి? “సర్వే సముదితా గుణైః" అన్నీ పవిత్రమైన గుణములే. తరువాత అస్త్రశస్త్ర విద్యల నభ్యసించారు. రథసారథ్యంలో ప్రవీణులైనారు. గుఱ్ఱము నెక్కితే ఎటుపోతున్నారో కూడా చెప్పలేనంత వేగంగా సవారీ చేసేవారు. గజతురగముల సవారీయందు రామలక్ష్మణ భరతశతృఘ్నులు వారికి వారే సాటి అనిపించుకున్నారు. అస్త్రశస్త్ర విద్యలను మొట్టమొదట శ్రీరామచంద్రునకు నేర్పినది కైక. ఆమె ఈ విద్యలలో ఆరితేరినది. అంబును పట్టి విడిచేది మొట్టమొదట కైకయే నేర్పించింది. రాముడంటే కైకకు ప్రాణము. అమితమైన ప్రీతితో రాముణ్ణి ఆమె పోషిస్తూ వచ్చింది. (శ్రీ భ ఉ పు 48)