ఈనాడు దేశమున పవిత్రమైన రీతిగా తీర్చిదిద్దాలంటే దీని సమర్థత మీకే ఉంటున్నది. ఈనాడు ప్రపంచములో వ్యాపించిన అశాంతినంతా నిర్మూలము గావించే శక్తి సామర్థ్యములు మీయందే గల్గి ఉంటున్నారు. ఈనాడు దేశమును కాదు మనము కాపాడవలసింది. సత్యధర్మములను కాపాడితే ఆ సత్య ధర్మములే దేశమును కాపాడతాయి. సత్యధర్మములను కాపాడే శక్తి సామర్థ్యములు యువతీయువకులందె ఉంటున్నాయి. ఈ సత్యమును మీరు చక్కగా ఆచరణలో పెట్టి ఆచరణ ద్వారా ఏర్పడిన ఆనందము అందరికి పంచి తద్వారా ఆధ్యాత్మిక తత్వమును అభివృద్ధి చేయించాలి. ఈనాడు దేశములో ఆధ్యాత్మిక తత్వమును అభివృద్ధి చేయించాలి. ఈనాడు దేశములో ఆధ్యాత్మిక తత్వమంటే హాస్యాస్పదముగా కనిపిస్తున్నది. కారణం ఏమిటి? ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రము అభివృద్ధి చెందింది. అంతా technology అని మీరు భావిస్తున్నారుగాని trick knowledge.దీని వలననే మన జీవితమంతా పోతున్నది. అప్పటికప్పుడు ఆనందము నందించే రీతిగా మనము భావిస్తున్నామే గాని దీని ద్వారా ఎంతో ప్రమాదములు సంభవిస్తున్నాయి. మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు? మన పూర్వీకులు ఏ విధమైన శాంతి సంతోషములు అనుభవించారు? ఆనాడు వారు అశాంతి అంటే ఏమిటో ఎరుగరు. భయమంటే ఏమిటో తెలియదు.కారణము ఏమిటి? సత్యధర్మములను ఆశ్రయిస్తూ వచ్చారు. ఈ రెండింటిని మనము ఆశ్రయించినప్పుడు భయమనేది మనలో ప్రవేశించుటకు వీలు లేదు. ఈనాడు ఎంత మేధావి అయినా ఎంత తెలివితేటలు కలవాడైనా, ఎంత విద్యావంతుడైనా క్షణక్షణమునకు భయము భయము. ఈ సైన్సు విజ్ఞానము చాలా పెరిగిపోయింది. సైన్సు పెరిగి ఎంతపైకి పోయిందో sense అంత క్రిందికి దిగజారిపోయింది. సైన్సు పెరిగింది. మీరు చూస్తున్నారు గాని Sense ఎంత low classకి దిగిపోయిందో మీరుయోచన చేయటం లేదు. ఈ సైన్సుకు ఆధ్యాత్మికమునకు ఉన్న వ్యత్యాసము మీరు గుర్తించాలి. ఆధ్యాత్మికము full circle ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడకే పోయి నిల్చిపోతుంది. అది పూర్ణముగా ఉంటుంది. half ని తుడిచివేసినప్పుడు semi circle అవుతుంది. ఈ semi circle C ఆకారములో ఉంటుంది. ఈ semi circle C ను సైన్సు అన్నారు. ఒక దగ్గర బయలు దేరి మరొక దగ్గర నిల్చిపోతున్నది. తిరిగి చేరటం లేదు. మధ్యలో అగాధమైన ఆశాంతి యిమిడి ఉంటున్నది. ఈ అశాంతికి మూలకారణము యీ సైన్సే, సైన్సు అంటే అనేక మంది పొగడుతూ కొనియాడుతుంటారు. దేనికైనా పరిమిత ముంటున్నది. సైన్సు పెరగటం మంచిదే. ప్రజలకు అనుకూలపరిచే విద్యా విధానము పెట్టటం మంచిదే. ఈ టెక్నాలజీ అంటే చాలా అవసరమే. కాని మితిమీరి పోతున్నది. ఈ సైన్సు వల్ల ఏమి ఏర్పడిపోయింది? ఆటంబాంబులు, హైడ్రోజను బాంబులు స్టార్‌వార్సు యిలాంటివన్ని అభివృద్ధి గావిస్తున్నారు. ఇదంతా చంపటానికి చేసే ప్రయత్నములే. భయమును అభివృద్ధి పరచే ప్రయత్నములే. కీడు కీటకమైనా చేస్తుంది. చంపటానికి యింత పెద్ద ప్రయత్నములు చేయవలెనా! ఇన్ని కోట్లు ఖర్చు పెట్టవలెనా! దీనికి ఖర్చు పెట్టే ధనము ప్రజలకు ఖర్చు చేస్తే ఎంత బాగుంటుంది. ఆ కంట్రీవారు చేశారని యింకో దేశము వారు యింకో బాంబు చేసేది. ఈ విధముగా సర్వము బాంబులతో నిల్చిపోతే ప్రపంచమే భస్మమై పోతుంది.
(శ్రీ స.పు. 40/41)