"బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వందాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం
ఏకం నిత్యం విమల మచలం సర్వధీ సాక్షిభూతం
భావాతీతం త్రిగుణ రహితం సద్గురు..............."
భగవత్తత్వాన్ని గుర్తించడం అంత సులభం కాదు. "నేను" అనే అహంకారం, నాది" అనే మమకారం - ఇవే సమస్త అనర్ధాలకు మూలకారణాలు. ఈ అహంకారం మమకారములను త్యజించినవాడే మానవునికి దివ్యత్వం అత్యంత సులభంగా లభిస్తుంది. అనంతమైన, సర్వాంతర్యామియైన ఆత్మ ఒక్కటే. కాని, ఉపాధి భేదముల వలన అది వివిధ రూపములలో మనకు కనిపించుచున్నది. ఈ అనేకత్వంలోని ఏకత్వమే - "ఆత్మతత్త్వం" అనే సత్యాన్ని గుర్తింపజేయునదే ఆధ్యాత్మికం కాని, దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వాన్ని అనేకత్యంగా విభజించుకో మేధావులు" అభివృద్ధి యౌతున్నారేగాని, అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు. మనం ఒక భవనాన్ని నిర్మించుకొంటే అందులో స్నానాలగది, వంటగది, భోజనాల గది - ఈ విధంగా ఆ భవనమును అనేక భాగములుగా విభజించుకొంటాము. ఆ భవనములో ఇన్ని విధములైన విభాగములు ఏర్పడ టానికి కారణం - గోడలే. కాని, ఈ గోడలను తీసివేసినప్పుడు అంతా ఒకే గది వలె కనిపిస్తుంది. అదే విధంగా, ఆత్మ అనే భవనం ఒక్కటే. దీనియందు శరీరము, ఇంద్రియములు, మనోబుద్ది చిత్త అహంకారములనే గదులను ఏర్పరుచుకొని ఉపాధులను నిర్మించుకోవడం చేత మనకు భిన్నముగా కనిపించు చున్నవి. ఈనాడు ఇట్టి భిన్నత్వముతో కూడిన మానవత్వం అభివృద్ధియగుటచేత మానవత్వానికి గురుత్వమనేది అత్యవసరమై ఉన్నది.
భౌతికమైన విద్యలను నేర్పించేవారు, జగత్ సంబంధమైన పదార్థ విజ్ఞానాన్ని విపులంగా విశదీకరించి బోధించేవారు గురువులు కారు. వీరందరూ అధ్యాపకులు మాత్రమే. గురుత్వమనగా ఏమిటి? నిజమైన గురువు ఏవరు? ఈ గురుత్వములోని నిజతత్త్యం ఏమిటి? దీని సత్యస్వరూపమే మిటి?
మొట్టమొదటిది - "బ్రహ్మానందం" ఈ బ్రహ్మానందమంటే ఏమిటి?ఇతని రూపమేమిటి? ఇతనెక్కడ ఉంటాడు? బ్రహ్మానందమునకు సాటియైన ఆనందం మరొకటి కానరాదు. ఈ జగత్తులోని సమస్త ఆనందములు ఈబ్రహ్మానందము నందే విలీనమై అంతర్గతమై ఉంటున్నవి. ఐతే, ఈ బ్రహ్మానందము ఎక్కడ ఉన్నది? తాను శాంతిని అనుభవిస్తున్నప్పుడు, పుష్టిని సంతుష్టిని కలిగి ఉన్నప్పుడు మానవుడు పొందే ఆనందము ఎట్టిది? ధన కనక వస్తు వాహనాదులతో, భోగ భాగ్యాదులతో మానవుడు అనుభవించే ఆనందమును - "మానవానందం" లేక "మనుష్యానందం" అన్నారు. ఈ మనుష్యానందము కంటే వందరెట్లు అధికమైనది. దేవానందం. దీనికంటే వందరెట్లు అధికమైనది దేవేంద్రానందం. ఈ దేవేంద్రా నందము కంటే వంద రెట్లు అధికమైనది బృహస్పతి ఆనందం, దీనికంటే వందరెట్లు అధికమైనది ప్రజాపతి ఆనందం. ఈ ప్రజాపతి ఆనందము కంటే వంద రెట్లు అధికమైన ఆనందమే - " బ్రహ్మానందం". ఈ బ్రహ్మానంద వల్లియే దీనికి సరియైన కొలతబద్ద. ఊహాతీతమైన ఇట్టి ఆనందమునకు సరియైన అర్థాన్ని గుర్తించకుండా మానవుడు తన నిత్య జీవితంలో బ్రహ్మానందం" అనే పదాన్ని అనేక సందర్భాలలో ఉపయోగ పెడుతున్నాడు. "నా కుమార్తె వివాహం బ్రహ్మానందంగా జరిగింది. నా కుమారుడు విదేశాలలో బ్రహ్మానందంగా ఉంటున్నాడు అని కొంతమంది చెప్పుకొంటారు. ఈ బ్రహ్మానందం అంత పరిమిత మైనదా? అంత సులభమైనదా? లోకసంబంధమైనదా? కాదు, కాదు. నైతిక, భౌతిక ధార్మిక, లౌకిక, ఆధ్యాత్మికములకు అతీతమైనదే . ఈ బ్రహ్మానందం. అట్టి ఆనందమును అనుభవించేవాడే నిజమైన గురువు. అతడే భగవంతుడు. ఒక్క భగవంతునికి తప్ప అన్యులకట్టి ఆనందం అనుభవించే అధికారం లేదు.
ఇంక రెండవది-"పరమసుఖం" ఈ పరమసుఖమనగా ఏమిటి? ఈ జగత్తులో గలసుఖము
లన్నింటి కంటే ఈపరమసుఖము అత్యున్నతమైనది. ఇది భౌతికమైన సుఖము కాదు. భౌతిక సుఖములు మార్పుచెందునవి; రాక పోకలు కలిగినవి. కాని, రాక పోకలు లేనటువంటిదే - పరమసుఖము. ఈ భౌతిక సుఖములన్నీ నీటి బుడగల వంటివి. అవి ఏ క్షణంలోనైనా శిథలమౌతాయి. కాని, పరమ సుఖము మార్పుచెందదు. అట్టి పరమసుఖమును అనుభవించేవాడే నిజమైన గురువు.
మూడవది - "కేవలం" కేవలమనగా దేశకాలములకు అతీతమైన తత్వం. ప్రపంచములోని సమస్త పదార్థములు దేశ కాలములతో కట్టుబడియున్నవి. ఈ జగత్తులో ఇతని కంటే అధికమైనది మరొకటి లేకపోవడం చేతనే ఇతడు - "కేవలుడు" అని పిలువబడుతున్నాడు. కనుక, ఇట్టి దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఆతీతమైన వ్యక్తియే గురువు. అతడే భగవంతుడు. .
"జ్ఞానమూర్తిం" - ఇందులో జ్ఞానము అనగా ఏమిటి?భౌతికజ్ఞానమా? రసాయనికజ్ఞానమా? కాదు, కాదుజగత్తునందుసమస్తజ్ఞానములకుఆధారమైనది, అనంతమైనది. అవ్యక్తమైనది, గుప్తమైనది, ఏకత్వమైనదే - జ్ఞానం. "అద్వైతదర్శనంజ్ఞానం" అనగాసమస్తమూఒక్కటే, ఒక్కటే, ఒక్కటే!ఈజగత్తునందురెండవపదార్థమేలేదు. ఒకవేళరెండవపదార్థమనేదిఉంటే, అది ఈ పదార్థము యొక్క Reaction, Resound Reflection (ప్రతిచర్య, ప్రతిధ్వని. ప్రతిబింబం) మాత్రమేగాని, ప్రత్యేకమైనరెండవపదార్థముకాదు. స్వస్వరూపసందర్శనమేనిజమైనజ్ఞానం. అనగాతననుతానుతెలుసుకోవడమేనిజమైనజ్ఞానం.ఈవిధంగాతత్వాన్నితానుగుర్తించుకొన్నవాడుఒక్కభగవంతుడుతప్పమరొకడులేడు. కనుక, భగవంతుడే-జ్ఞానస్వరూపుడు, సత్యస్వరూపుడు, అనంతస్వరూపుడు, అందుచేతనే "సత్యంజ్ఞానంఅనంతంబ్రహ్మ" అన్నారు.
"ద్వందాతీతం" - ఇందులోద్వంద్వమనగాఏమిటి? శోతోష్ణములకు, సుఖదు:ఖాలకు, లాభనష్టాలకు, నిందాస్తుతులకుఅతీతమైనతత్వముఏమిటి? అదేభగవతత్త్యం, అన్యులకుఈఅధికారంలేదు. కనుక, ద్వందాతీతుడైనభగవంతుడేనిజమైనగురువు.
“గగన సదృశం" - ఈ గగనము ఎక్కడ ఉన్నది? ఇది సర్వత్రా వ్యాపించి యున్నది. ఎక్కడ చూసినా గగనము ఉంటున్నది. గగనమనగా ఆకాశమనేది సరియైన అర్థం కాదు. ఆకాశమనగా ఏమిటి? ఆకాశ గగనం శూన్యం ఇది కనిపించునది కాదు. ఆకాశమనేది పైన ఉన్నదని మనం అనుకొంటున్నాము. ఆది ఆకాశము కాదు. ఈ ఆకాశమునకు గుణము ఏమిటి? శబ్దమే. (స్వామి చిటిక వేస్తూ) ఇక్కడ ఆకాశము ఉన్నది; నేను మాట్లాడే మాటలలో శబ్దం ఉన్నది. కాబట్టి శబ్దం ఎక్కడ ఉన్నదో అక్కడున్నదంతా ఆకాశమే. మన ఉచ్చ్వాస నిశ్వాసములలో కూడా శబ్దముంటున్నది. కనుక, ఆకాశములేని స్థానమెక్కడ? అంతర్బహిశ్చ తత్సర్వ వ్యాప్య నారాయణ స్థిత:ఆ ఆకాశము కంటే అమితంగా వ్యాపించి యున్నవాడే భగవంతుడు. కనుక, అతడే నిజమైన గురువు.
"తత్తమస్యాది లక్ష్యం” - ఇక్కడ తత్వము అనగా ఏమిటి? మన వేదములలో నాలుగు మహావాక్యములుంటున్నాయి. మొదటిది "ప్రజ్ఞానం బ్రహ్మ".ఇది ఋగ్వేదసారం, రెండవది "అహం బ్రహ్మాస్మి" ఇది యజుర్వేదసారం, మూడవది "తత్వమసి". ఇదిసామవేదపారం నాల్గవది “అయమాత్మా బ్రహ్మ" ఇది అధర్వణవేదసారం. ఈ విధంగా నాల్గు వేదముల సారము ఈ నాలుగు మహావాక్యములలో విభజింపబడినది. ఈ నాలుగు మహావాక్యములు ఒక్క దివ్యత్వమును మాత్రమే నిరూపిస్తున్నవి.
మొట్టమొదటిది "ప్రజ్ఞానం బ్రహ్మ" ప్రజ్ఞ అనగా ఏమిటి? ప్రజ్ఞ అనగా తెలివితేటలని అనుకొంటున్నాము. కాదు, కాదు. ఈ ప్రజ్ఞ శరీరేంద్రియములందు, అంత:కరణ యందు సర్వత్రా ఉంటున్నది. ఈ ప్రజ్ఞ అనేది సర్వప్రాణులందు, చరాచరములందు ఉంటున్నది. దీనినే Constant Integrated Awareness అన్నారు. పరిపూర్ణముగా తెలుసుకోవడమే – Awareness అనబడుతుంది. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యములో ప్రజ్ఞ, బ్రహ్మ రెండూ సమమైన పదములే. ప్రజ్ఞానమే బ్రహ్మ అని కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు. ఈ ప్రజ్ఞానం, బ్రహ్మ వేరు వేరు కాదు. సర్వత్రా వ్యాపించిన వానికే బ్రహ్మ అని పేరు. సులభంగా మనం అర్థం చేసికొనవలెనన్న బ్రహ్మ అనగా వ్యాపకత్వమే. ఎక్కుడ చూసినా వ్యాప్తి జరుగుతున్నది. ఇట్టి సర్వవ్యాపకుడే భగవంతుడని ఋగ్వేదం చక్కగా నిరూపించినది. ఇట్టి సర్వవ్యాపకుడే నిజమైన గురువు.
రెండవ మహావాక్యము "అహం బ్రహ్మాస్మి" అహం అనగా ఏమిటి? అహం అనగా నేను అని అనుకొంటున్నారు. దీనికి సాక్షి అని మరొక అర్థము కూడా ఉంటున్నది. అతడు సమస్తమునకు సాక్షీభూతుడు. అహం అనేది ఆత్మ స్వరూపకంగా నిలిచియుంటున్నది. ఆత్మ చైతన్యము, బ్రహ్మ వేరు వేరు కాదు. ప్రత్తి, దారము, వస్త్రము - ఈ మూడు ఒక్కటైనట్లుగా, వివిధ సమయములందు వివిధ పరిస్థితులందు ఆత్మ, బ్రహ్మ, అహం అనే పేర్లు ధరిస్తుంటుంది. ఐతే, ఈ మూడింటియొక్క ఏకత్వమే “అహం బ్రహ్మాస్మి . ఆస్మి అనగా కలపడం. నేను అనే సాక్షీభూతుడు, సర్వవ్యాపకుడైన సాక్షీభూతుడు - రెండూ ఒక్కటే అని నిరూపించుటయే "అహం బ్రహ్మాస్మి" యొక్క అంతరార్థము.
మూడవది "తత్వమసి". తత్ - అనగా అది: త్వం - అనగా ఇది; అసి-అనగా ఒక్కటే. నీవు, నేను వేరువేరుగా ఉండినప్పుడు నీవు నీవే, నేను నేనే, నీవు, నేను’ ఈ రెండూ కలసినప్పుడు మనం అంటున్నాము. కాని, రెండూ ఒకటే, ఉపాధి ధరించినప్పుడు త్వం అనుకొంటున్నాము. ఉపాధి రహితమైనప్పుడది తత్ గా మారిపోతున్నది. ఉపాధి రహితమే - తత్; ఉపాధి సహితమే - "త్వం కనుక ఉపాధి సహితుడే - జీవుడు. ఉపాధి రహితుడే - దేవుడు కనుక దేవుడు, జీవుడు ఒక్కటే అని సామవేదము చక్కగా విశదీకరించి బోధించుచున్నది.
నాల్గవది "అయమాత్మా బ్రహ్మ" ఇక్కడ మీరు చక్కగావిచారణ చేయాలి. I am Atma and Brahma ఇక్కడ ఉన్నవి రెండు కాదు, ఒక్కటే. నీకు దేహమున్నది, మనస్సు ఉన్నది. ఆత్మ ఉన్నది. మూడింటి చేరిక ఒక్కటే శరీరంలో పనులు చేస్తున్నావు. మనస్సుతో విచారణలు సలుపుతున్నావు. ఈ రెండింటికి సాక్షీభూతునిగా చూస్తున్నది. నీవే జాగ్రత్తలో విశ్వుడు - నీవే; స్వప్నములో తేజుడు - నీవే", సుషుప్తిలో ప్రాజ్ఞుడు - నీవే , ప్రాజ్ఞాడనగా ఎవరు? అదే "ప్రజ్ఞానం బ్రహ్మ" ఆత్మతత్వమే ప్రజ్ఞ.
ఈ నాలుగు వాక్యముల అంతరార్థాన్ని ఏకత్వముతో కూడిన శక్తి ఏదైతే ఉన్నదో, అదే నిజమైన గురువు. ఈ నాలుగు మహావాక్యముల సారమును చక్కగా అనుభవించి, ఆనందించి, ఆకారాన్ని ధరించినవాడే గురువు.
“ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ" ఉన్నది ఒక్కటే. నీవు పుట్టక పూర్వం, పుట్టిన తరువాత, మరణించిన తరువాత ఎల్లప్పుడు ఉండినది ఒక్కటే అది మార్పుచెందదు "ఏకం" అనగా, భగవంతుడు ఒక్కడే. ఇంకెవ్వరూ ఏకం కాదు. మిగిలిన వన్నీ అనేకత్వముతో కూడినవే. ఈ అనేకత్వము ఏకత్వములోనే ఉన్నదని గుర్తించిన వాడే గురువు. ఐతే, ఏకత్వములో అనేకత్వం ఏ విధంగా ఉంటున్నది? దీనికి ఒక ఉదాహరణ: మట్టి విత్తనమనేది ఏకంగానే ఉంటున్నది. కాని, ఆ విత్తనమునందే పెద్ద వృక్షము ఉంటున్నది. ఆ వృక్షములోనే అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి. దీనియందే పువ్వులు, కాయలు ఉంటున్నాయి. చూసారా! ఎంతో పెద్ద వృక్షము ఒక చిన్న విత్తనములోనే ఇమిడి ఉన్నది. “ఏకం సత్ విప్రాబహౌదావదంతి" ఉన్నది. ఒక్కటే అయినప్పటికీ కొందరు దానిని కొమ్మలని, కొందరు దానిని ఆకులని, మరికొందరు దానిని పువ్వులని, కాయలని అంటున్నారు. కాని, అది ఒక్కటే కనుక,ఒక్కటైనటు వంటివాడే నిజమైన గురువు. అతడే భగవంతుడు.
"నిత్యం" - అతడు ఎట్టి పరిస్థితులందూ మార్పు చెందడు సూర్యచంద్రాదులు కదిలినప్పటికి తాను కదిలెడివాడుకాడు. కనుక, ఇతడు నిత్యుడైనవాడు, మార్పు చెందనివాడు. ఈనాడు మానవుడు పుట్టినది మొదలుకొని అంత్యము వరకు మార్పు చెందుతున్నాడు. భగవంతునికి పుట్టుక లేదు, అంత్యము లేదు. పుట్టుకే లేనటువంటివానికి అంత్యమెక్కడ ఉన్నది? ఇట్టి ఆద్యంత రహితుడైనవాడే నిజమైన గురువు. అతడే భగవంతుడు.
"విమలం" అనగా మాలిన్యము లేనివాడు. ఇతడు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఎట్టి మాలిన్యమును తనలో చేర్చుకోడు. ఏది ఇతనిని చేరినప్పటికీ అది భస్మంగా మారుతుంది. అగ్నిలో మంచి పదార్థముగాని చెడ్డ పదార్థముగాని దేనిని వేసినప్పటికీ మిగిలేది భస్మమే. శవాన్ని కాల్చినా, కట్టెలను కాల్చినా లేక బంగారమును కాల్చినా అగ్ని ఎప్పుడూ పవిత్రముగానే ఉంటుంది. అట్టి నిర్మలమైనవాడు, పవిత్రమైనవాడు ఎవరు? భగవంతుడే! అతడే నిజమైన గురువు.
"అచలం" అనగా, భగవంతుడు నిశ్చలమైనవాడు. భూమి, సూర్యచంద్రాదులు తిరుగుతున్నవిగాని, ఇతడు తిరిగేవాడు కాదు. అంతా తనయందే ఉన్నది. అంతట తానే, ఇంక తిరిగేదెక్కడ? ఇక్కడ అక్కడ, ఎక్కడ చూసినా ఉన్నది ఒక్కటే. అదే నిశ్చలమైన నిర్మలమైన భగవత్తత్త్వం .
"సర్వధీ సాక్షిభూతం" అనగా, అన్నింటికీ తానే సాక్షి. మంచికిగాని, చెడుకుగాని తానే సాక్షీభూతుడు.ఒక స్టేజి పైనా ఏదైనా నాటకం ప్రదర్శింపబడుతుంటే దానిలోని నటులు మారుతుంటారు. వారి మాటలు మార్పు చెందుతుంటాయి. కాని, ఆస్టేజ్ పైన లైటుకు నటులలో గాని వారి మాటలతోగాని పెట్టి సంబంధములేదు, అది కేవలం ఒక సాక్షిభూతుని వలె ఉంటుంది. అది మార్పు చెందదు. ఇట్లు సమస్తమునకుసాక్షీభూతుడైన వాడే నిజమైన గురువు.
"భావాతీతం" అనగా ఇతడు ఇట్టి వాడు, అట్టివాడు అని చెప్పడానికి ఎవ్వరికీ వీలుకాదు "యతోవాచో నివర్తంతేఅప్రాప్యమనసాసహ"ఇతడు భావానికి అతీతమైన వాడు.భావమునకు అతీతమైనవాని యొక్క మంచి చెడ్డలను గురించి ఎవ్వరూ చెప్పలేరు. ఇట్టివాడే నిజమైనగురువు. అతడే భగవంతుడు.
“త్రిగుణ రహితం" - త్రిగుణములనగా సత్వరజస్తమో గుణములు. ఇవి ప్రకృతి లక్షణములు, ఈ మూడు గుణములున్నప్పుడే సుఖ దుఃఖములు ఉంటాయి. ఇవి లేనిచో సుఖము లేదు. దుఃఖము లేదు. ఈ మూడు గుణములే అవలక్షణములు. ఈ అవలక్షణముల చేతనే మనం అనేక దుఃఖాలను పొందుతున్నాము. ఈ మూడు గుణములకు అతీత మైనవాడు. ఎవడు? అతడే భగవంతుడు. అతడే నిజమైన గురువు.
గురువు అంటే ఎవరు? "గురుర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః" బ్రహ్మమే గురువు. ఎవరు ఈ బ్రహ్మ? సృష్టి, సృష్టికర్త, సమస్తమును పాలించేవాడే - బ్రహ్మ. సృష్టి తానే, సృష్టికర్తకూడా తానే. ఈ బృహత్తరమైన జగత్తునందున్నది కూడా తానే. కనుక,ఇట్టి సమస్త స్వరూపాన్ని ధరించినవాడే నిజమైన గురువు అని స్పష్టమౌతున్నది.
ఇంక“గురుర్విష్ణుః" ఇక్కడ విష్ణువనగా ఎవరు? విష్ణువనగా వ్యాపక గుణము కలిగినవాడు. కర్తతానే, కర్మతానే. జగత్తంతయు క్రియా రూపము దీనికి భగవంతుడే కర్త. కార్య కర్మ కారణ చైతన్యమే భగవత్ స్వరూపం. కర్త, కారణము, కర్తవ్యం అంతా తానే. అంతా తానే అయినవాడే - విష్ణువు. "విశ్వం విష్ణుస్వరూపం" విష్ణువనగా విశ్వస్వరూపమే. అతడే గురువు.
“గురుర్దేవో మహేశ్వరః" మహేశ్వరుడనగా . ఈ జగత్తుతనందు సమస్త జీవులను శాసించేవాడు. ఈ ఈశ్వరుడు శాస్త్ర నియమితుడైనవాడు. ఇతడు ఎవరెవరు ఏఏ కాలములో ఎక్కడెక్కడ ఏఏ విధంగా ప్రవర్తించాలో శాసించేటటువంటివాడు ఎన్నటికీ దీనిని మార్పు చేయడు. సూర్యోదయ సూర్యాస్తమయములు, రాత్రింబవళ్ళు, ఋతువులు మున్నగునవన్నీ ఇతని శాసనము వలననేజరుగుతున్నది. ఇట్టి క్రమశిక్షణలను తు.చ తప్పకుండా పాటింప చేయునట్టి శాసనాన్ని జగత్తుకు అందించినటు వంటివాడు ఈశ్వరుడు. కనుక, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గురువులన్నారు.గురువనగా కేవలం బోధించే వాడు కాదు. సర్వవ్యాపకుడైనవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు, సర్వజ్ఞుడైనవాడు. గురువు. సమస్తమును తన హస్తగతము గావించుకొన్న వాడే- గురువు.
గు కారము అజ్ఞానమును, అంధకారమును సూచిస్తుంది. ఆ అజ్ఞానమనే అంధకారాన్ని నిర్మూలము చేయునది ప్రకాశమే. కనుక. అజ్ఞానమనే అంధ కారమును నిర్మూలము గావించేవాడే గురువు. కేవలం మంత్రోపదేశం చేసేవాడు, వేదాంతమును బోధించేవాడు గురువు కాడు. లౌకికమైన బోధలు సలిపేవాడు గురువు కాదు. ఆధ్యాపకుడు కావచ్చును. ఈ అధ్యాపకులలో ఆచరించి ఇతరులకు బోధించేవాడు ఆచార్యుడు కావచ్చును. ఆచరణలో నిరూపణ చేసేవాడే ఆచార్యుడు. ఈనాడు ఆచార్యులు లేరు. గురువులు లేరు. "చెవిలో మంత్రం, చేతిలో డబ్బు". ఇది నిజమైన గురువు యొక్క లక్షణము కాదు. విష్ణువు యొక్క నాలుగు చేతులలో శంఖ చక్ర గదా పద్మములున్నవని అంటున్నారు. దీని అంతరార్థమేమిటి? శంఖము శబ్దానికి సంకేతము. కనుక, శబ్దము భగంతుని హస్తగతమై ఉన్నది. చక్రం కాలమును, గద బలమును సూచిస్తాయి. అనగా, సమస్త శక్తులు, కాలము భగవంతుని చేతిలో ఉంటున్నవి. పద్మము హృదయమును గుర్తింప జేస్తుంది. అనగా, అందరి హృదయములు భగవంతుని స్వాధీనములో ఉన్నవని అర్థము. ఈ విధముగా, ప్రాచీనులు శంఖ చక్ర గదా పద్మాలను గుర్తుగా తీసికొని విష్ణువనగా సర్వశక్తి మంతుడైన భగవంతుడేనని బోధిస్తూ వచ్చారు. ఐతే "ఈశ్వరుని కూడా భగవంతుడన్నారు కదా! మరి ఈశ్వరునికి విష్ణువుకు ఏ మాత్రం పొత్తు కుదరదే!" అని భావించరాదు. పొత్తు కుదరకుండా ఉండటానికి వారిద్దరూ వేరువేరు కాదు. ఇద్దరూ ఒక్కటే. ఈనాడుఆరాధన చేసేవారి సంకుచిత బుద్దుల మధ్యనే పొత్తు కుదరడం లేదు. నేను వైష్ణువుడను". "నేను శైవుడను" అని అనుకోవడం కేవలం సంకుచిత భావాలే. వీళ్ళు తమలో తాము పోట్లాడుకుంటారనే గాని, భగంతుడు ఒక్కడే! శబ్ద, కాలం, బలం, హృదయం - ఈ నాలుగు విష్ణువు హస్తగతమై ఉన్నాయని అతని చేతులలోని శంఖ చక్ర గదా పద్మాలు సూచిస్తున్నాయి. ఇంక, ఈశ్వరునికి ఒక చేతిలో డమరుకం, మరొక చేతిలో త్రిశూలం ఉంటున్నాయి. ఈ డమరుకము శబ్దమునకు గుర్తు. అనగా, శబ్దము ఈశ్వరుని హస్తగతమై ఉన్నది. త్రిశూలము త్రికాల స్వరూపము. కాబట్టి కాలము కూడా ఈశ్వరుని చేతిలోనే ఉంటున్నది. ఈ విధంగా విచారిస్తే , రూప నామాలు వేరు వేరైనప్పటికీ భగవంతుడు ఒక్కడేనని అర్థమౌతుంది.
వైష్ణవులు, శైపులు తిరుపతికి వెళుతుంటారు. ఐతే, శైవులు "వేంకటేశ్వరా! వేంకటేశ్వరా! " అని ప్రార్థిస్తుంటారు, వైష్ణవులు వెంకటరమణా! వెంకటరమణ!" అంటారు. ఈ విధంగా వీరి భావాలలో మార్పు ఉన్నదిగాని, భగవంతుడు ఒక్కడే.
ఈశ్వరునికి "పశుపతి" అని మరొక పేరు. పశుపతి అనగా, పశువులకు నాథుడు. మనోబుద్దులతో చేరిన జీవతత్వమునకే పశుత్వమని పేరు. అదే విధముగా, విష్ణువును - "గోపాలా!" అంటారు. కనుక పశుపతి. గోపాలుడు - వీరిరువురూ ఒక్కటే! ఇట్టి ఏకత్వాన్ని వారి నామములే నిరూపణ చేస్తున్నాయి.
(స.సా.అ..92పు. 171/178)
భగవతత్త్వమనేది, పరమాణు స్వరూపాన్ని ధరించి అంతటా నిండి యున్నది. సర్వత్ర ఉన్నది. శక్తి స్వరూపమే. అయితే, ఈ దివ్యశక్తిని గుర్తించే నిమిత్తమై మానవుడు సద్గుణములు అలవర్చుకోవాలి. సత్యమే ఈ ప్రపంచ స్వరూపాన్ని ధరించింది. సత్యమే లేకుండిన జగత్తేలేదు. సర్వమూ సత్యము నుండియే ఆవిర్భవించినది.
సత్యంబునందుండి సర్వంబు సృష్టించె
సత్యంబునందణగె సర్వ సృష్టి
సత్యమహిమలేని స్థలమేది కనుకొన్న
శుద్ధ సత్యమిదియె చూడరయ్య!
నాయనా! జీవుడవైన నీవు నా అంశమే. అనాదివి. ప్రకృతి పంచభూతముల అంశాలివి కావు. నా అంశమైన నీవు నన్ను చేరునంత వరకూ శాంతి సుఖములనందుకొనలేవు. బిడ్డ తల్లికి అంశము: తల్లిని విడిచి బ్రతుకలేదు. నది. సముద్రమునకు అంశము: సముద్రమునకు దూరమై నిలువలేదు. కొమ్మ చెట్టునకు అంశము; చెట్టును విడచిబ్రతుకలేదు. చేప జలమునకు అంశము; జలము లేక క్షణమైనా జీవించవాలదు. అదే విధముగా నీవు నా అంశము; నన్ను విడిచి బ్రతుకలేవు. కనుక నన్ను చేరుటకు ప్రయత్నించు.
(శ్లో|| మమై వాం శో జీవలోకే జీవభూత స్సనాతనః
మనఃషష్ఠాణీ న్ద్రియాణీ ప్రకృతి స్థాని కర్షతి. (భ.. 15-7)
‘ఓ మానవుడా! నీవు నా అంశమే. కనుక నా భావములే నీలో ఆవిర్భవించాలి అన్నాడు గీతాచార్యుడు. తాను దైవాంశయేనని విశ్వసించే మానవుడు నిత్యానందమునే పొందుతాడు. పరమ సుఖమునే అనుభవిస్తాడు.
(శ్రీ భ.ఉ.పు.28/29)