చెడ్డవానిని చూసినప్పుడు మీలోని చెడ్డ జ్ఞాపకం వస్తుంది. మంచివానిని చూసినప్పుడు మీలోని మంచితనమంతా బయట పడుతుంది. కాబట్టి, అందరితో స్నేహం చేయకూడదు. స్నేహం చేసే ముందు మంచి, చెడ్డలు విచారణ చేయాలి. భగవంతు డొక్కడే మీ నిజమైన స్నేహితుడు. మీ కందరికీ తెలుసు - కృష్ణుని స్నేహంచేత కుచేలుడు ఎంతటి ఉన్నత స్థాయిని పొందాడో! అలాంటి స్నేహం ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు. మీ జేబులో నోట్లు కనిపిస్తే అందరూ హలో,హలో.." అంటూ దగ్గరికి వస్తారు. మీజేబులు ఖాళీ అయితే మిమ్మల్ని తప్పించుకు తిరుగుతుంటారు. ఇలాంటిది స్నేహం ఎలా అవుతుంది? రెండు దేహాలు, ఒక్క ప్రాణంగా జీవించాలి. అదే నిజమైన స్నేహము. "త్యజ దుర్జన సంసర్గం", దుస్పంగమునకు దూరంగా ఉండండి. దుస్పంగములో చేరితే మీరు కూడా దుర్మార్గులుగా తయారౌతారు. కనుక, "భజ సాథుసమాగమం", సత్సంగంలో ప్రవేశించండి. "కురు పుణ్య మహారాత్రం", రాత్రిబవళ్ళు పుణ్య కార్యము లాచరించండి. మంచి గుణములచేత మంచి పేరు తెచ్చుకోండి. ఆదర్శ మానవులుగా బ్రతకండి. ఇదియే ఈ స్నాతకోత్సవంలో స్వామి మీకు అందించే సందేశం. దైవాన్ని మాత్రం మరువకండి. దైవమే మీ ప్రాణము. దైవమే మీ సర్వస్వము. కనుక, దైవాన్ని హృదయంలో పెట్టుకొని సేవలో ప్రవేశించండి. తప్పక మీకు అన్నింటియందు జయమే కల్గుతుంది. అన్నింటి యందు మీరు విజయం పొంది ఆనందమయమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను..
(స. సా.జ. 2000 పు 20/21)