తమోగుణమనగా ఏమి? సత్యాన్ని అసత్యముగా భావించడం, అధర్మాన్ని ధర్మముగా విశ్వసించడం చెడ్డను మంచిగా భావించడం - తమోగుణము యొక్క సహజ లక్షణములు. ఈ జగత్తు అనిత్యమైనప్పటికీ, దీనిని మనము నిత్యముగా, సత్యముగా విశ్వసిస్తున్నాము. ఇదియే ప్రధానమైన తమోగుణము.
(స. సా. జూ 1989. పు. 144)
తమోగుణమునకు ఆరు లక్షణము లుంటున్నాయి. నిద్ర, కునుకు, భయము, క్రోధము, సోమరితనము, తమస్సు. పంటను పండించగోరిన రైతు ఆ పొలములో మొట్టమొదట కలుపును తీయాలి. పంటకాని గడ్డి,తుంగ, అనే పదార్థములు పెరగటముచేత పంటపైరు అణగి పోతుంటాది. అట్లు కలుపు తీయకున్న పంటను అందుకొనలేము. అధిక పంటను పొందవలెనన్న మొదట కలుపు తీయాలి. అదేవిధముగనే ఆత్మానందము అనే పంటను అందుకోగోరిన సాధకుడు తన హృదయ క్షేత్రములో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే రజస్తమోగుణముల స్వభావముతో కూడుకున్న మొక్కలను మొదలు పెరికి పారవేయాలి. అరిషడ్వర్గములు రజస్తమోగుణముల సంతతి. కనుక మొదట తమోగుణ, రజోగుణములను దూరము చేసుకోమని చెప్పాడు కృష్ణుడు.శ్రీ. గీ. పు. 262)
కంటిలో పుట్టిన పొరను తీసివేసిన యెడల, కంటి చూపు చక్కబడును. అట్లే, మనసులో పుట్టు, నేను పాపిని-అధముడని అను నీచభావమును తొలగించినయెడల మనస్సు నిర్మలమగును. నీ వెల్లప్పుడును- నే నాత్మస్వరూపుడను;- నేను నిత్యస్వరూపుడను ;- నే నానంద స్వరూపుడను అను - భావములతో నుండుము. అప్పుడు నీవు చేయు ప్రతి క్రియయును . ఒక యజ్ఞమగును; గొప్ప త్యాగమగును; భగవత్పూజయగును. అంతే కాదు; నీ చెవి, కన్ను, నాలుక, పాదములు-యభ్యున్నతికి సాధనములగును. నిన్ను దుర్గతికి లాగు బంధనములు కావు. తమోగుణమును తపోగుణము లోనికి మార్చి, నిన్ను నీవు కాపాడుకొనుము.. (శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 67)