ధర్మోద్ధరణములో మరొక సూక్ష్మమున్నది. ఏమన తనకు ప్రాణాపాయస్థితి సంభవించిననూ తన కర్తవ్య ధర్మమును వీడకుండుటే సాధుశబ్దమునకు మరొక అర్ధము. అట్టి సాధు సత్ పురుషులను హింసించుచు త్రికరణములా శాస్త్ర విరుద్ధమగు చర్యలను ఆచరించుచుందువారే దుష్టులు. శాస్త్ర విహితమగు ధర్మములు స్వయముగా తానాచరించుచూ ధర్మము యొక్క విశిష్టతను, ప్రభావమును లోకమునకు తెలుపుచూ, ప్రకటించుటయే కాక వేద శాస్త్రములందూ దైవము యందూ అవతారము లందూ పరలోకమునందూ పరమపురుషులయందూ శ్రద్ధాభక్తులు కలిగించునట్లునూ లోకులు సదాచార నిష్టా సంపన్నులగునట్లు మార్చుటే ధర్మసంస్థాపన మనబడును. ధర్మరక్షణ మనబడును. ధర్మోద్ధరణమన బడును. తాను చేయు సర్వ కర్మలూ ధర్మసంస్థాపన కొరకేనని భావించి స్వార్థ ఉపయోగమునకు కాదనియూ ఈ రహస్యమును తెలిసికొనిన వారికి తిరిగి పుట్టుక వుండదనియూ వారు తననే పొందుదురనియూ కృష్ణపరమాత్మ తెలిపెను.
(గీ.పు.64/65)
(చూ॥ అవతారము)