రామాయణము

ఆత్మే రాముడు. తాను జీవుని వేషము ధరించి దేహ, వస్త్రధారియై వచ్చినాడు. లీలావినోదమే కాని తనకు కష్టమెక్కడిదీ, సుఖమెక్కడిదీ? ఈ రెండూ లేని ఆనంద స్వరూపుడు. తనమాయా సంకల్పముచే సర్వమునూ సృష్టించును, సర్వమునూ లయమొనర్చును. ఈ లోక నాటకరంగమందు ఒక్కొక్క గుణమును ఒకొక్క స్వరూపముగా చూపించి, తానూ ఒక స్వరూపమును ధరించి జీవితమను రామాయణమును జరిపించినాడు. అట్టి రామాయణము నేటికి కూడా ప్రతి హృదయమున జరుగుచునే యున్నది. అన్నింటికి ఆత్మారాముడు సాక్షీభూతుడై చూచుచునే యున్నాడు..

 

జడము బ్రహ్మజ్ఞానమను చైతన్యమును వరించును. ఆ బ్రహ్మజ్ఞాన చైతన్యమే సీతఅను పేరున పుట్టినది. అప్పుడు ఈ జడ చైతన్యములు ఒకటిగా ఏకమగును వాటినే సీతారాములను పేర్లతో సంబోధించుచున్నారు. ఆ రెండూ ఏకముగా ఉన్నంత కాలమూ ఏ బాధలు ఉండవు. ఈ రెండింటి యొక్క యెడబాటే కష్ట ప్రారంభము.

 

బ్రహ్మ జ్ఞానమను సీత, జీవిరూపమందున్న ఆత్మను వదలిన అంధకారమను జీవిత అడవిలో పడక తప్పదు. జీవి బ్రహ్మజ్ఞానమును సీతను పోగొట్టుకొనుట వల్ల అంధకారమను అడవిలో సంచరించక తప్పదనుఅర్థమును చూపుట కొరకే రాముడు అట్లు నటించినాడు. అట్టి అంధకారమైన జీవిత అడవిలో వంటరిగా వద్దు, మనస్సు అనే లక్ష్మణుని ఎడబాయక ఉండమని తెలిపినాడు. అట్టి అంధకార జీవితములో సంచరించు సమయమున దీనత్వము, వివేకము అనేవి రెండూ వైరముతో ఉండుననియూ, అట్టి సమయమున దీనత్వమను వాలిని తెగటార్చవలెననియూ చూపినాడు. ఈ దీనత్వ వివేకములే వాలి సుగ్రీవులు, దీనత్వమే వాలి, వివేకమే సుగ్రీవుడు. దీనత్వమును తెగటార్చుటకు తగిన సహాయకారి, అతనే ధైర్యమను రూపమున ఉన్నాడు. ఆ ధైర్యమను హనుమంతుని విశ్వాసము చేసికొనుట వల్లనే మోహ సాగరమను సప్త సముద్రములనూ జీవి సులభముగా దాటగలడనుట నిశ్చయముగా చూపుతూ లంకకు హనుమంతునితో సేతువు కట్టించినట్లు చూపినాడు. రాముడు సేవుతుదాటి మోహమును దాటిన తక్షణము రజోగుణ తమోగుణములను రావణుని, కుంభకర్ణుని చంపివేసేను. మిగిలిన చిన్నతమ్ముడైన సత్వగుణము అనగా విభీషణునకు పట్టముగట్టెను. కాన మూడు గుణములనూ ముగురు అన్నదమ్ములు వారే రావణ, కుంభకర్ణ, విభీషణులు.

 

తరువాత అనుభవజ్ఞానమైన సీత అను చైతన్యమును చేరుట. ఎప్పుడు తిరిగి జడ చైతన్యములు చేరునో అదే పట్టాభి షేకము. అనగా “జీవన్ముక్తి". కాన, రామాయణములో పాఠమేమన, మానవుని యందున్న జీవీ, మనసూ, జ్ఞానమూ, దీనత్వము, వివేకము, మోహము, ధైర్యము, రజస్సు, తమస్సు, సత్వము వీటిని ఒక్కొక్క దానిని ఒక్కొక్క రూపనామములుగా సృష్టించి, ఏఏ రీతిగా జయించవలెను. సాధించవలెను, అను విధానమును ఆత్మ స్వరూపుడు రామస్వరూపమున వచ్చి నటించి నడిపించి, చూపించి, చేయిం చినాడు. కాన, ఆనాటి తో రామాయణము ముగియలేదు. ఎవరెవరి జీవితము ఇన్ని మార్గములు సాధించి, కడకు అనుభవ జ్ఞానమును పొంది, సత్వగుణమునకు పట్టము కట్టుదురో అంత వరకు వారి వారి హృదయ భూమియందు రామాయణము జరుగుచునే యుండును.

 

ఎట్టి గుణములైనా ఇంద్రియ సంబంధము లేక చలించవు! గుణములకు పుట్టుక స్థానమే అది. కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదు. ఈ రెండూ చేరేకదా మనోసహాయమున ఆత్మను చేరుచున్నవి. లేకున్న లయమే లేదు. మాయలోనే పుట్టి, మాయలోనే పెరిగి, మాయను దాటుట మనిషి నీతి అన్నట్లు వాటిలోనే పుట్టి వాటిలోనేపెరిగి, వాటిని దాటుట జడ లక్షణములు కదా"

 

దశేంద్రియములందు నాలుగే కాదు, ఎన్ని గుణ రూపములైననూ పుట్టవచ్చును. అయితే ముఖ్యముగా పుట్టవలసిన గుణ రూపములు నాలుగు ముఖములనియూ, పరమాత్ముడు, చతుర్ముఖుడు కనుక, తనను తాను సంకల్పించుకొని నాలుగు భాగములుగా విభజించి, నాలుగు ముఖములూ నాలుగు రూపములుగా జన్మించిరి, వారే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. వారు సూక్ష్మరూపమున సత్య, ధర్మ, శాంతి, ప్రేమ స్వరూపులై యున్నారు. పరమాత్ముని యొక్క చతుర్ముఖములు ఇవియే.

 

రాముడే సత్య స్వరూపుడు. ఎవరి స్థానము వారిదే కాని, నాకు అర్హత లేదని నిరూపించిన భరతుడే ధర్మ స్వరూపుడనియూ,ఆత్మపై (అనగా రామ స్వరూపుని పై) సంపూర్ణ భారము వేసి, దానికంటే మించిన ఆనందము వేరులేదని సర్వకాల సర్వావస్థల యందును ఎడబాయక నిరూపించిన లక్ష్మణుడే ప్రేమ స్వరూపుడనియూ ఈ మూడింటిని అనుసరించి అవి ఏఏ మార్గమున నడుచునో అంతవరకూ తాను ఏ ఉద్దేశ్యములు పడక శాంతముగా ఈ మూడింటిజాడలలో నడిచి నిరూపించిన శత్రుఘ్నుడే శాంత స్వరూపుడు.

 

మాయలోనే పుట్టి, అందులోనే పెరిగి తిరిగి దానినే జయించవలె నన్నట్లు వీరు గుణములందే పుట్టి గుణములను జయించి, గుణాతీతులు అయ్యే అర్థమును నిరూపించుటకే ఈ ముగ్గురు తల్లులూ మూడు గుణములుగా ఉండిరి. అందులో కాసల్య సత్వ గుణము, కైకరజోగుణము, సుమిత్ర తమోగుణముగా నటించినవి.దశరథుడు దశేంద్రియ రూపుడై ఈ గుణములనుకూడియుండుటవల్ల వారు ఇంద్రియ గుణ స్వరూపులను పేరున నిల్చి యుందురు. ఈ ఇంద్రియ గుణముల మూలమున మానవులు సులభముగా గ్రాహ్యము చేసుకొనలేని మానవ బోధనా మార్గము పరమాత్ముడు ఇన్నిన్ని స్వరూపములతో ఇంత రామాయణమును ఈనాటి మానవ హృదయరంగమున గుణరూపములతో సూక్ష్మ రామాయణముగ జరుపుచున్నాడు.

(శ్రీ.స.సూ. పు.256/258)

 

విద్యార్థులారా! రామాయణమును మూడు విధములైన పేర్లతో వాల్మీకి ప్రచార ప్రబోధలు సల్పాడు. మొదటిది రామాయణం, రెండవది సీతాచరితము, మూడవది రావణవధ. “రామస్య ఆయనం రామాయణం. రాముని గురించి తెలిపేది భౌతికమైన రామాయణం. దీనిని అంతర్ముఖంగా విచారణ చేస్తే - ఇదే పరమాత్ముని కథ. రెండవది, "రమాయా: ఆయనం ఇతి రామాయణం", అనగా సీతాచరిత్రమును తెలుపునది రామాయణం. ఇది బాహ్యమైనది. అంతర్ముఖంగా విచారిస్తే - ఇది జీవాత్మ చరితము. ఇంక మూడవది రావణవధ ఇది బాహ్యమైనది.అంతర్భావములో ఇది అజ్ఞాన నాశనము. ఏతావాతా రామాయణమనగా పరమాత్ముని కథ, సీతాచరితమవగా జీవాత్మకథ, రావణవధ అనగా అజ్ఞాన నాశనము. పరమాత్మ జీవాత్మల తత్వములను చక్కగా గుర్తించినప్పుడే అజ్ఞానము నాశనమవుతుంది. ,,, మ ఈ మూడు అక్షరములలో ఉండిన అంతరార్ధ మేమిటి? ఒకటి సూర్యబీజము, రెండవది చంద్రబీజము, మూడవది అగ్ని బీజము. సూర్యబీజము అజ్ఞానాంధకారమును దూరం గావిస్తుంది. చంద్రబీజము లోని తాపమును చల్లార్చు తుంది. హృదయానికి చల్లదనము చేకూర్చుతుంది. ఇంక అగ్ని బీజము పాపమును నాశనం చేస్తుంది.

(శ్రీ.భ.ఉ.పు,46)

(చూ: ఆదర్శం, ఆథ్యాత్మరామాణము, ఇంద్రియ పటుత్వం, ఈషణత్రయము, ఊర్మిళ, కామ క్రోధ లోభములు, పరమాత్ముని కథ. ప్రాయశ్చిత్తం, భారతదేశము లోకనాటకము, వాల్మీకిరాముయణము,సోదర ప్రేమ, హనుమంతుడు)

 


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage