1.అమానిత్వము, 2. అదంభిత్వం, 3. అహింస, 4. క్షమ, 5. ఋజుత్వము, 6. ఆచార్యోపాసన, 7. శౌచము, 8. స్థైర్యము, 9. ఇంద్రియనిగ్రహము, 10. వైరాగ్యము, 11. అనహంకారము, 12. జన్మమృత్యుజరా వ్యాధిదుఃఖదోషాను దర్శనము. 13. ఆసక్తి, (మమకారమే మహాపాశము), 14. స్నేహము.15. సమత్వస్థితి.16. జ్ఞానగుణము.17. అన్యభావనలేనిభక్తి కలిగియుండుట. (అనన్యభక్తి). 18. జ్ఞానగుణము (జనసంఘమున ప్రీతి లేకుండుట) 19. ఆత్మానాత్మవివేక జ్ఞానము, 20. తత్త్వజ్ఞాన దర్శనము.
పైన చెప్పిన యిరువదింటిలో ప్రయత్న పూర్వకముగా రెండు మూడు సాధించినమా మిగిలినవి అప్రయత్నముగా సమకూరును. అన్నింటికినీ ప్రయత్నించ సాధ్యము కాదు; అవసరము లేదు. అయితే, అమానిత్వాది జ్ఞాన గుణములు ఇవియే యని కూడనూ తలంచ వీలు లేదు. ఇంకనూ యెన్నియో కలవు. అయితే మానవుడు వీటిని సాధించ సాధనలు సలిపిన చాలును. అన్నింటి యందునూ ప్రధాన మైన ఉపాంగములు ఇవి.
వీటిని ఆధారము చేసుకొని గమ్యమును చేరవచ్చుననియే కృష్ణుడు ఈ ఇరువది జ్ఞానగుణములను బోధించినాడు.
వీటిని కలిగినవాడు సాక్షాత్కారమును తప్పక పొందగలడు. సందేహము లేదు. ఇన్నింటి విచారణ మూలమున మానవుడు దేహము, బుద్ధి, ఇంద్రియములు, అంత:కరణము ఇవి అన్నియూ ప్రకృతి సంబంధములని తెలుసుకొనును. వీటన్నింటికి భిన్నముగా నున్నవాడే పురుషుడనియూ తేలిపోవును. పురుషుడనగా క్షేత్రమును తెలుసుకొను వాడే కాని క్షేత్రము కాదని ఋజువగుచున్నది. ఎపుడు ఈ ప్రకృతి పురుషుల విషయములు విజ్ఞాన విచారణచే తేలినవో అప్పుడు వాంఛా రహితుడైన సాక్షి స్వరూపుడు తానే ననికూడను తెలియును. అన్నింటికి సాక్షీభూతుడు తానేనని తెలుసుకొనుటయే ఆత్మ సాక్షాత్కారము, తన సత్యమును తానే అని తెలిసి కొనుటకు తనను తాను తెలిసికొనుట, అంతా వక్కటే ఆత్మయని నిరూపించుట, జీవుడు వేరు, దేవుడు వేరు కాదని అనుభవముతో తెలిసికొనుట, వీటినన్నింటిని సాక్షాత్కారమనియే పిలుతురు. ప్రతి మానవుడు సాధించవలసినదియును, తెలుసుకొనవలసినదియును ఇదియే. కేవలము పుట్టి పెరిగి చచ్చునంత మాత్రమున అట్టివాడు మానవుడు కానేరడు. పశు పక్షి మృగాదులవలె కాక మానవుడు తెలియని సత్యాన్ని తెలిసికొనుటే వానికి కల దివ్య శక్తి. అట్టి అనుగ్రహ శక్తిని వృధా చేయరాదు.
(గీపు 214/215)