ఫిలాసఫీ చాల మంది చదువుతున్నారు. ఏం ప్రయోజనం? వారి ఫిలాసఫీ చదువు ఫుల్-లాస్ (Full Loss)లో ఉంది. అట్లాకాకూడదు. ఫిలాసఫీ అంటే ఫిల్ - లాస్ (Fill Loss)గా ఉండాలి. అప్పుడే ప్రయోజనం ఉంటుంది. హృదయ గ్రంథాన్ని చదువు. శ్లోకాలు వల్లిస్తే శోకంతీరదు. అనుభవ జ్ఞానం రావాలి. చాల మంది భగవద్గీత చదువుతుంటారు. అందులో "ధర్మక్షేత్రే కురుక్షేత్రే" అనే మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ప్రశ్నిస్తాడు. - "ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఆనాడు పాండవులు ఏం చేస్తున్నారు?" అని. ఏంచేస్తారు? రాజైయుండి యుద్ధభూమిలో ఏం చేస్తారో అతనికి తెలియదా? యుద్ధభూమిలో విలాసాలున్నాయా? మరి ఎందుకడిగినట్లు? యుద్ధానికి ముందు కౌరవుల మనస్సు మారిందే మోనని తెలుసుకోవాలని ప్రశ్నించాడు. ఈ ప్రకారం రహస్యాలను సూక్ష్మాలను గమనించాలి. అర్థం చేసుకోవాలి. ఇది "ఫిల్ - లాస్" నిజమైన ఫిలాసఫీ.
(స.పా.మా.99.పు.83)