ఇంద్రియముల కంటె యింద్రియార్ద ములు బలమైనవి. కన్నులు చూస్తున్నవి. చూడటం తప్పు కాదు. కాని చూచిన వస్తువుపై వాంఛ పుడుతుంది. ఆ వాంఛలు కలగడం తప్పు. నాలుక వున్నది. నాలుకలో దోషము లేదు కాని కఠినమైన పలుకులు పలికితే తప్పు. ఇంద్రియములను అరికట్టినంత మాత్రమున లాభము లేదు. ఇంద్రియార్థములను అరికట్టాలి. కనుక మంచి దృష్టి మంచిమాట, మంచి శ్రవణము, మంచి వాసన, మంచి స్పర్శను గురించి అందరికి తెలియచేయాలి. ఎవరినంటే వారిని తాకకూడదు. శారీరకంగా రోగము రావడమే కాక, ఆధ్యాత్మికంగా కొన్ని రోగాలు ఏర్పడుతాయి. శాస్త్ర గ్రంథాలు వున్నాయి. సాంఖ్య, న్యాయ, వైశేషిక, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస శాస్త్రములు వున్నాయి. వీటిని దర్శనములు అని కూడా అంటారు. ఉత్తర మీమాంస (వేదాంతం) తప్ప తక్కినవన్నీ ద్వైతాన్ని బోధిస్తాయి. ఇవి (శాస్త్రాలు) అన్ని పురాణములను ఆధారము చేసుకొని వచ్చాయి. వేదాంతము వేదమును ఆధారము చేసుకొని వచ్చింది. మిగిలిన దర్శనములకును వేదాంతమునకు గల వ్యత్యాసము యిదే. వేదాధారమైన వేదాంతము కట్టకడపటిది. "నకర్మణావ ప్రజయా, ధనేన, త్యాగేనైకే అమృతత్త్వ మానశు: (కై. ఉ) అని చెప్పింది. వేదాంతము అమృత తత్త్వమైన, ఆత్మ తత్త్వము అనుభవించాలంటే త్యాగము చెయ్యాలని బోధించింది (అన్నీఉన్నంతవరకు బంధమే). అప్పుడే ఏకత్వం ఏర్పడుతుంది. అదే "అద్వైత దర్శనం". అద్వైత దర్శనమే జ్ఞానమన్నారు. దానినే ఏకమేవా ద్వితీయం" అని వేదం శాసించింది. ఏతావాతా అన్ని దర్శనాలు కూడా ఒక గమ్యమునే నిరూపిస్తూ వచ్చాయి.
అన్నిటిలోను "నేను" అనే తత్వాన్ని అర్థం చేసుకోడమే విశిష్టత. "నేను" అనేది కేవలము మూలాధారమైనది. నేను దేహమును కాను. నేను అనగా "అహం" ఆత్మతత్వము నుండి ఆవిర్భవించింది. కర్తవ్య కర్మలను ఆచరిస్తూ ఆచరింపచేసే నాయకుడు నాయందున్నాడన్న సత్యాన్ని విశ్వసించాలి. అప్పుడే నిజమైన ఆనందము కలుగుతుంది. అది నిత్య సత్యమైనది. ఆత్మ దర్శనముగా తన్ను తాను తెలిసికోడానికి ప్రయత్నించడం. అదే దుఃఖ నివృత్తి. అదే ఆనంద ప్రాప్తికి మూలము.
(సాపు 29, 30)||
జ్ఞానమనగా ఏమిటి? లౌకికజ్ఞానమా? భౌతిక జ్ఞానమా? కాదు, కాదు. అద్వైత దర్శనమే నిజమైన జ్ఞానం. అదియే ఆనందం. ప్రకృతి సంబంధమైనది జ్ఞానం కాదు. "ఏకం సత్ విప్రాః బహుధా వదంతి" ఉన్నది ఒక్కటే జ్ఞానం. అదియే అనంతమైన తత్త్యం. అదియే సత్య స్వరూపం. అట్టి స్థానమును ప్రబోధించాడు. మాణిక్యవాచకర్. తిరువళ్ళువరు శాంతిని ప్రబోధించాడు. చలించని మనస్సును, భ్రమించని దృష్టిని పెట్టుకోవాలని చెప్పాడు. కష్టములు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. సుఖములు వచ్చినప్పుడు పొంగిపోవద్దు. పొంగి కృంగని సమత్వస్థితి పొందాలని ప్రబోధించాడు. ఈనాడు భగవంతుని ఆరాధించేవారు ఎలాంటి స్థితిలో ఉంటున్నారు? ఏ కించిత్తైనా శాంతిని అనుభవించవద్దా? కానీ, శాంతి ఏ మాత్రము కనిపించటం లేదు. ఎక్కడ చూచినా అల్లర్లు! ఇది మానవుల యొక్క గుణమే కాదు, రాక్షసుల యొక్క గుణము. దైవాన్ని స్మరిస్తున్నప్పుడు దైవభావమే మీలో ప్రవేశించాలి. అదియే నిజమైన జ్ఞానము. "బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి", బ్రహ్మతత్త్వమును స్మరించేవాడు. బ్రహ్మయే కావాలి. యజ్ఞోపవీతమును ధరించినంత మాత్రమున బ్రాహ్మణుడు కాడు, బ్రహ్మజ్ఞానమును సంపాదించినవాడే బ్రాహ్మణుడు. కానీ, ఈనాడు భ్రమ సాధన చేస్తున్నారు గాని, బ్రహ్మసాధన చేయటం లేదు.
బ్రహ్మకు, భ్రమకు ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఏకత్వమును అనేకత్వంగా విభజించేది భ్రమ. అనేకత్వమును ఏకత్వముగా విశ్వసించేది బ్రహ్మ. ఇట్టి ఏకత్వాన్ని ప్రబోధించినవాడు తిరువళ్ళువరు. ఏకత్వాన్ని గుర్తించినప్పుడే మనస్సుకు శాంతి లభిస్తుంది. మీరు "శాంతిః శాంతిః శాంతిః" అన్నారు. దీనికోసం? శారీరక శాంతి, మానసిక శాంతి, ఆత్మ శాంతి - ఈ మూడు విధములైన శాంతి నిమిత్తమై మూడు పర్యాయములు చెపుతున్నారు. ఈ మూడింటిని ఒక్క దైవానుగ్రహం వల్లనే పొందడానికి అవకాశ ముంది. ఒక్క దైవ ప్రేమను మీరు సాధించారంటే పర్వమును సాధించినవారవుతారు. శాంతి ఎక్కడో బయట లేదు. బయట ఉన్నదంతా పీస్! శాంతి మీలోనే ఉన్నది. మీ ఆత్మ స్వరూపము నుండియే ఆవిర్భవిస్తుంది.
ఈనాటి భక్తులు భగవద్గీతనో, లేక రామాయణమునో చూచిన తక్షణమే కన్నుల కద్దుకుంటున్నారు. శిరస్సుపై పెట్టుకుంటున్నారు. పూజాపీఠంపై పెట్టి పూజిస్తున్నారు. ఐతే, ఈ గ్రంథములు పూజల నిమిత్తం వచ్చినవి కాదు, ఆచరణ నిమిత్తమై వచ్చినవి. కానీ, మీరు కాగితాలను గౌరవిస్తున్నారుగాని, ఆ కాగితాలలోని విషయాలను గౌరవించడం లేదు. కాగితాల కిచ్చిన గౌరవంలో కించిత్తైనా వాటిలోని విషయాలకు ఇవ్వకూడదా? ముఖ్యంగా ఆచరణ కావాలి. ఆచరణలో పెట్టకుండా పుస్తకాలను పూజించినంత మాత్రమున ప్రయోజనం లేదు. ఒకటి రెండయినా ఆచరణలో పెట్టి చూడండి. ఆచరణే ప్రధానమైనది. ఆచరణరూపమైన ప్రచార ప్రబోధలు లేకపోవడంచేతనే ఈనాడు ప్రపంచంలో శాంతిభద్రతలు కరువైనాయి.
(సా. శ్రు..పు.73,74)
(చూ॥ దర్శించు)