మీ దేహంలోని ప్రతి అంగమును భగవత్ప్రీత్యర్ధమై, భగవదనుగ్రహం పొందే నిమిత్తమై వినియోగించాలి. అప్పుడే మీ జీవితం సార్థక మవుతుంది. ఒకానొక సమయంలో తులసీదాసు తాను అంగహీనుడనని చాల బాధపడ్డాడు. ఈ మాట విని కొందరు. "అదేమిటి! మీకు కాళ్ళుచేతులు మొదలైన అంగములన్నీ బాగానే ఉన్నాయి కదా! మీరు అంగహీనులు కావడ మేమిటి?" అనీ ప్రశ్నించగా తులసీదాసు, "అవును నాకు కాళ్ళుచేతు లున్నాయి. కాని ప్రయోజన మేమి? భగవంతుని సేవ చేయలేకపోతున్నాను. కనులున్నాయి కాని భగవంతుని దర్శించలేకపోతున్నాను . చెవులున్నాయి కానిభగవద్వాణిని వినలేకపోతున్నాను . కనుక నేను అంగహీనుడనే న్నాడు. త్యాగరాజ కూడాఇదేభావాన్నివ్యక్తంచేస్తూ, కన్నులేలరా?రామునిచూడనికన్నులేలరా?"అనిపాడినాడు.అంతేకాదు. తాను రాముని విడిచి ఒక్కక్షణమైనా ఉండలేనన్నాడు.
"రార మా ఇంటిదాక
రఘువీర, సుకుమార నీకు మ్రొక్కెద
రార మా ఇంటిదాక
రారా దశరథ కుమారా
నన్నేలుకోర, నే తాళలేర
రార మా ఇంటిదాక..."
ఆని ఎంతో ప్రేమతో తన పాత స్నేహితుని పిలిచినట్లుగా రాముని రారా అని పిలిచాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఏకవచనం తప్ప బహువచనం లేదు. కారణ మేమిటి? భగవంతుడు మీ పాతమిత్రుడు. కనుకనే త్యాగరాజు రాముని ఏకవచనంతోనే సంబోధించాడు. మీ ఇంటికి ఎవరైనా కొత్తవారు వస్తే, రండి, దయచేయండి" అంటారు కాని పాతమిత్రుడే గనుక వస్తే "రారా" అంటూ చనువుగా పలుకరిస్తారు కదా! అదేవిధంగా భగవంతుని కూడా మీ స్వంతవానిగా, పాతమిత్రునిగా భావించండి.
(స.సా .ఫి . 97 పు. 42/43)