భారతీయుల పర్వదినములన్నీ పవిత్రమైన - అంతరార్థములతో కూడినవి. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశియందు ప్రవేశిస్తూంటాడు. ఈనాడు మకరరాశిలో ప్రవేశించడంచేత దీనికి మకర సంక్రాంతి అని పేరు. ఈనాడు పవిత్రమైన ఉత్తరాయణ కాలము ప్రారంభమైనది.
“దినకరుడు శాంతుడై తోచె,
దినములింక కురుచనయ్యె,
చలిగాలి చురుకు హెచ్చె
పొలములందున రేయి గ్రుడ్డివెన్నెలలోన
కుప్పలన్ నూర్చు కాపులు ,
గొంతులెత్తి పదములను పాడదొడగిరి
పచ్చపువ్వులు జనపచేలకు ముత్యాలసరులు గూర్చె
మిరపపండు కుంకుమ మెరుపు దాల్చె
బంతిపువ్వులు మొగము లల్లంత విప్పె
మన గృహంబుల ధాన్య సంపదలు నిల్చి
సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చె"
ఈ సంక్రాంతి మన - గృహములను ధాన్య సంపదతో నింపుతుంది. దేహసంబంధమైన, మానసిక సంబంధమైన విశ్రాంతిని అందిస్తుంది. “సమ్యక్ క్రాంతి ఇతి సంక్రాంతి” అన్నారు. అనగా పవిత్రమైన క్రాంతిని, శాంతిని చేకూర్చునది. సంక్రాంతి. - అంతర్బూతమైన ఆనందాన్ని ఆవిర్భవింప జేయునది సంక్రాంతి. ఈ రోజున బాలికలు తమ ఇళ్ళముందు రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెడతారు. గంగిరెద్దు వారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ఆడిస్తూంటారు.
“తమ్ముడా! రమ్ము, గంగిరెద్దు దాసుడదిగో
వెండి బిళ్ళయు, మొలత్రాడు, దండకడెము
మోమునందు పంగనామములు, వెంట గంగిరెద్దు
చేత మునికోల తన పేరు చెప్పు చుండ ఊరు
నడివీథి నాడించె రమ్ము.
అరలు శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెండ్లి గావించు
ఆ వేడ్క చూచి కానుకల నిచ్చి వత్తము
కదలి రమ్ము, తమ్ముడా! కదలి రమ్ము"
అంటూ ఉత్సాహంగా అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు ఈ గంగిరెద్దుల ఆట చూడటానికి బయలుదేరుతుంటారు. అంతేకాదు, ఈ సంక్రాంతిని అల్లుళ్ళ పండుగని కూడా అన్నారు.
“అన్ని పండుగల కన్న ముఖ్యమిదిగాన
అత్తవారింటి కేగుమో క్రొత్త పెండ్లి కొడుక
అందు నీకు ఎక్కువ సుఖంబు
ముద్దు మరదలు నీ తోడ ముచ్చటాడు
వదిన మాటికి నీతోడ వరుసలాడు
ఊరివారలు అతి గారాబముగ మన్ననలు సల్పుదురు
నీదు మామకూడ అడుగులకు మడుగులొత్తు”
అంటూ ఆ క్రొత్త అల్లుళ్ళను - అత్తవారింటికి సాగనంపుతుంటారు. – (శ్రీవాణి ఙన వరి 2020 పు7/8)