దూషణంబు హింస దూరంబుగానెట్టి
ప్రేమభావములను పెంపుజేసి
సర్వమేకమన్న సమభావమున్నట్టి
జనులవల్ల భూమి స్వర్గమగును
భావమందు తుచ్చవాంఛలు వీడుటె
త్యాగమగును అదియె యోగమగును
ఆస్తి ఆలి వదలి అడవికేగుట కాదు
సత్యమైన బాట సాయిమాట
భావ సంశుద్ధి కలుగుటే భక్తియగును
పుణ్యకార్యాలు చేయుటే పూజయగును
పరులకుపకారమొసగుటే తపసుయగును
మరువబోకుడిట్టి మంచిమాట
భుజబలము గొప్ప బుద్ధిబలమున్నను
దైవ బలము లేక దీనుడగును
కర్ణుడంతటివాడు కడపటికేమయ్యె
మరువబోకుడిట్టి మంచి మాట
భోగ భాగ్యాలు ఎన్నిటి పెంచుకొన్న
తృప్తి మనిషికి లేదని తెలియరయ్య
ఆత్మతత్త్వంబు తెలిసికొన్నప్పుడేగాని
తృప్తి శాంతియు మనిషికి ప్రాప్తికాదు
మనసులోనున్న భావంబు మంచిదైన
కలిగితీరును ఫలసిద్ది కార్యమందు
మనసులోపలి భావము మలినమైన
ఫలముకూడను నారీతి మలినమౌను
మనసు నిర్మలంబు మంచికి మార్గంబు
మనసు నిర్మలంబు మహితశక్తి
నిర్మలంపు మనసె నీరధి ముత్యమౌ
మరువబోకు డిట్టి మంచిమాట
మనసు మాట నడత మనిషికి ఒకటైన
మనిషి కాడు వాడు మహితుడౌను
మనసు మాట నడత మరి వేరువేరైన
మనిషికాడు వాడు మృగమెకాని
(సనాతన సారథి, 23డిసెంబర్ 2020 పు23)