సముద్రాన్ని దాటాలంటే సముద్రమంత విశాలమైన తెప్ప అవసరం లేదు. చిన్న తెప్ప చాలును. అట్లనే, భవసాగరాన్ని దాటేకొరకు బ్రహ్మాండమైన యజ్ఞ యాగాదులూ, ఘోరమైన తపములూ అనవసరము. నామస్మరణ అనే చిన్న తెప్ప చాలును. ఒక ఇనుపముక్కను రాయిపై రాస్తూ, రాస్తూ ఉంటే వేడి యెక్కుతుంది కదా! అట్లే, ఇనుపముక్కవలె జడమైన మనస్సును “రాం, రాం, రాం, రాం, రాం” అని అటూ ఇటూ అఖండముగా రాస్తూ ఉంటే వేడి కలుగుతుంది. ఏక భావముతో ఏక ధారగా వేడి బయలుదేరినప్పుడు అది పరమాత్ముని వెన్నవంటి హృదయమును కరిగిస్తుంది, కదిలిస్తుంది. ఒకప్పుడు కబీరును చూసి కొందరు, “నీవు నిరంతరము భగవన్నామాన్ని గానం చేస్తూంటావే! కైలాసము కావలెనా?” అని అడిగారు. అప్పుడతడు, “నాకు కైలాసము, స్వర్గము, వైకుంఠము ఇవేవీ తెలియవు. ఎప్పటికప్పుడు రామా, కృష్ణా అని చెబుతూ ఉంటే అదే ఆనందము, అదే స్వర్గము” అన్నాడు. (సనాతన సారథి, డిసెంబర్ 19 2020)