సనాతన ధర్మము అతి ప్రాచీనమైనది. ఇది ఆచరణయోగ్యమై అభీష్టము ననుసరించి దివ్యాభవము నందించునట్టిది. టైలరు ఎవరి కొలతలకు తగిన డ్రస్సు వారికి కుట్టిస్తాడు కదా. అట్లే సనాతన ధర్మము మానవానుకూలములను బట్టి, వివిధ మనో ప్రవృత్తులను బట్టి, సంస్కారములను బట్టి వేర్వేరు మార్గములను నిర్దేశిస్తుంది. కొందరికి రాముని పైన గురి ఉంటుంది. మరికొందరికి కృష్ణుని పైన గురి ఉంటుంది. ఇష్టదేవతారాధన వారివారి అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. ఇదే వైవిధ్యానికి కారణాలు.
మీరు నాదస్వరం వినే ఉంటారు. ఆ వాయిద్యంతో అన్ని రాగములు. కృతులు, పాటలు వినిపించవచ్చు. కానీ, శృతిపెట్టే ఒకే ఒక ధ్వనిని వినిపిస్తుంది. అదేవిధంగా, ఒక పద్ధతిలో వినిపించే శృతిపెట్టెవంటిది మతము. సనాతన ధర్మమును అన్ని రాగాలు వినిపించే నాదస్వరముతో పోల్చవచ్చును యూనివర్సిటీలో అన్ని రకములైన కోర్సులుంటాయి. B.Sc డీగ్రీ ఒక్కటే అయినప్పటికీ గ్రూపులు భిన్నంగా వుంటాయి. M.P.C కావచ్చును లేక C.B.Z కావచ్చును. అలాగే, వ్యాసుడు స్థాపించిన యూనివర్సిటీలో వేదాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు అన్నీ ఉన్నాయి. మీరు ఏ కోర్సు అయినా తీసుకోవచ్చు. ఇది సనాతన ధర్మ వైవిధ్యంలోని మర్మము.
ఒక ఉదాహరణ: ఒక మెడికల్ షాప్ యజమానికి, ఒక టల్ యజమానికి ఒకేసారి తలనొప్పి వచ్చింది. మెడికల్ షాప్ యజమాని తన తలనొప్పి తగ్గటానికి ఒక కప్పు కాఫీకోసం హోటల్ కు వచ్చాడు; హోటల్ యజమాని తన తలనొప్పి తగ్గటానికి టాబ్లెట్ కోసం మెడికల్ షాప్ కు వచ్చాడు. మెడికల్ షాప్ యజమానికి కాఫీ పైన నమ్మకం, కాఫీ హోటల్ యజమానికి టాబ్లెట్ పైన నమ్మకం. అలాగేమీ విశ్వాసానికి తగిన మార్గాన్ని అనుసరించి తరించడానికే సనాతన ధర్మంలో వివిధ సాధనా మార్గాలు, శాస్త్రాలు ఏర్పడ్డాయి.
(స.సా.సె..99పు.249)
లోకమున సర్వ మతములకు సర్వ సాంప్రదాయములకు, సర్వ ధర్మములకు సనాతన ధర్మమే తల్లి. అట్టి తల్లి పుట్టినిల్లే ఈ భారతదేశము. ఆహా! భారతీయులెంతటి భాగ్యశాలురో ఈ భారతదేశమెంత భవ్యమైనదో, యోచింపుడు.
లోకమంతయు లోకేశుని దేహముగా ఉన్నను. ఆ దేహమున ప్రత్యేక సూత్రమయిన నేత్రములవంటిది, ఈ భారతదేశము నేత్ర హీనమయిన దేహము పరాధీనమే కదా? భారతదేశము వేదశాస్త్రములను నేత్రములతో అలంకరింపబడినది. అందుమూలముననే భారతీయులుపొందినంత సంస్కారమును మరేదేశీయులు పొందలేరని చెప్పుటలో సందియము లేదు. సర్వమత సత్యత్వమును, సహనమును బోధించిన సనాతన ధర్మమే సర్వుల ధర్మము. వివిధ ప్రదేశములలో పుట్టి వివిధ మార్గములుగాప్రవహించి, కడకు నదులు సముద్రమున ఎట్లు చేరుచున్నవో, అటులనే వివిధ ప్రదేశములలో ఉద్భవించి, వివిధ ధర్మమార్గముల ప్రవర్తించి, వివిధారాధనలలో సర్వేశ్వరుని సన్నిధి అను సాగరమును చేరుచున్నారు. నానాదిశలకు ప్రాకునట్టి ఈ చిన్న మార్గములన్నియు కలియునట్టి కేంద్రస్థానమే సనాతన ధర్మము. సర్వమతములవారు సత్యవాక్పరులుగా ఉండుట,
ఈర్ష్యా కోపారహితులై యుండుట. ప్రేమహృదయులై ప్రవర్తించుట, ఇట్టి సనాతన ధర్మము అనుష్ఠించవలెను. వీటిని పట్టువిడకుసాధించువాడే భారతీయుడు. అదికాలము నుండియు నేటివరకు అగ్రస్థానమును వహించి, శాశ్వతముగా నిలిచియుండునది ఒక్క హిందూ మతము మాత్రమే. నాటి చారిత్రక యుగములనుండియు నాశమెరుంగని వారు ఒక్క భారతీయులే. ప్రేమ, సమంజసము. కృతజ్ఞతా సహితమగు జీవితమును ఈ మతమునందు గడిపినటుల మరేమతము నందును గడుపలేదు.తత్త్వావిష్కరణమూలమున, వేదమూలమున హిందువులు వారి ధర్మమును పొందియున్నారు. ఆది అంత్యములు లేని వేదశాస్త్రముల సారమును గ్రోలినవారు ఈ భారతీయులు. ఇట్టి పవిత్ర భారతదేశము లోకమునకు ఆధ్యాత్మిక గనివంటిది. ఈ బ్రహ్మాండమైన భూగర్భమున ఒక్కొక్క ప్రదేశమందు ఒక్కొక్క లోహము కనుపించినట్లే ఈ భారతదేశమందు సర్వశాస్త్రవేద ఉపనిషత్ తత్త్వములసారమైన సనాతన ధర్మము ఉత్పత్తి అయినది. భారతీయుల భాగ్యమా అన్నట్లు వారి పుట్టినిల్లుగా ఉన్న ఈ సనాతన ధర్మపు గను లు ఎచ్చట ప్రారంభమవునో అచ్చటనే అందు నిమిత్తమైన నాయకులు, విచారకులు, విమర్శకులు, ప్రచారకులు, ప్రబోధకులు ఉద్భవింతురు. అట్టి మతమునకు చెందిన వారగు మహా పురుషులు,నిష్కామ కర్మయోగులు. పండితోత్తములు, ప్రజ్ఞా వంతులు, ఋషులు, దైవాంశ సంభూతులు, యజ్ఞ పురుషులు ఈ భారతదేశమందే అనేకులు ఉద్భవించిరి. వీరల ఆధారముల వలననే ఇట్టి అనుభవసిద్ధమైన ఆధ్యాత్మికసారము దేశమంతయు ప్రవహించినది. ఈరీతిగా లోకమంతయు సనాతన ధర్మము సారవంతమై అభివృద్ధిచెంది నది. ఎన్ని దేశముల ప్రవహించినను, ఆదిస్థానము భారతదేశమే. నేడు లోకమున చూడుడు. ఏదో కొన్ని కొన్ని కొత్తరకమైనటువంటి మిషన్లు కార్లు, ఇంజనులు, ఇతర దేశములలో కనిపెట్టి వాటిని తదితర దేశములకు ఎగుమతి చేసినను, వాటి ఆది స్థానము మాత్రము మరువరానిదిగా నున్నది. వాటి అనుభవ ఆధారమూలముననే అట్టి మిషనులే అట్టి కార్లే తయారు చేయవచ్చును. అయితే అది ఆధారములేక ఏమియు చేయలేరు. అటులనే భారతదేశమందు సనాతన ధర్మము ఉద్భవించి, దాని ప్రవాహమును మహాపురుషుల మూలమున, వారు రచించిన శాస్త్ర గ్రంథమూలమున పరదేశీయులు పొందిరేకాని ఆదిస్థానాధారమును వీడలేదు. అది అసాధ్యము, అట్టి పావనధర్మములను పాలతో పెంపబడిన పుణ్యపురుషుల పుట్టినిల్లయిన ఈ భారతదేశమున నేటి నవీన పద్ధతులే మన ధర్మమని, సనాతన ధర్మపు సారమును రుచి చూడక, దాని అర్థమును సహితము తెలిసికొనక, వ్యర్ధపు వాదనలతో దానిని మరుగుపరచి, పరదేశీయులకు ఒప్పచెప్పి వగచుచుండుట చూచి విచారముగామన్నది. ఇందుకు కారణము సరియైన మార్గదర్శకులు లేకుండుటే. ఉండినను ఇప్పటి నవీన పద్ధతులకు ప్రవేశమిచ్చి వాటి వాసనలమూలమున తరిగి పోవుచున్నారు. ఇవి కేవలము సంత పకోడీల వంటివి. వట్టి వాసనలను పట్టి ఒళ్ళును పాడుచేసుకొందురు కానీయదార్థపు పదార్ధమును పరిశీలించరు. సనాతన ధర్మమైన స్వధర్మమునందు ఎంతో పరిశుభ్రమైన పదార్థముండియు ఆడంబరముచే ఆకర్షించు వాసనలు లేకపోవుటె ఇట్టి ఆశ్రద్ధకు కారణము. సత్యమునకు అట్టి ఆదంబరములుఅనవసరము. రుచయే ప్రధానము. ఇప్పటి మానవులు కేవలము వాసనా ఇష్టులై చరించుటె ఇందుకు మూలము. యదార్థమును వదలి పరధర్మముల పాటించుట పరిపాటయినది. ఇది చాలా పొరపాటు. ఆకర్షించు వాసనలు, పైపద్ధతులను చూచి భ్రమించుట భారతీయు లకు ధర్మవిర్ధుము. సనాతన ధర్మములో లేని సత్యము, పరమప్రేమ మరేధర్మమందును లేవు. రావు, సనాతన ధర్మము సత్య స్వరూపము, అది సర్వుల సొత్తు, పవిత్రతకు ఏనీమములు ఉండవు. పవిత్రత ఒక్కటియే రెండు కాదుకదా?
అట్టి సనాతన ధర్మమును అనుష్టించి జీవన్ముక్తులైనవారు, భగవదనుగ్రహమును పొందినవారు. సత్యస్వరూపమును తెలిసికొన్నవారు. సాక్షాత్కారమును సాధించినవారు భారతీయులే. ఆ పవిత్రస్థానమును పొందినవారలను జాతిమత లింగభేదములులేక భారతీయులే పూజించి నారు. అట్టి సమయమున పవిత్రత సర్వ నిబంధనలను భస్మముచేయును.కాని ఆ స్థానమును పొందకమునుపే సర్వము సమానభావమున తలంచ సాధ్యముకానిది. అయితే అట్టి పవిత్ర సనాతనధర్మమును సాధించుటకు సాహసించవలెను. ఇది భారతీయుల రక్తధర్మము.
(ప్రే.వా. పు.34/38)
"వేదములు, ఉపనిషత్తులు
సనాతన ధర్మ హర్మ్యమునకు
పునాదులు, సాక్షాత్తూ
భగవంతుడేఈ సనాతన ధర్మమునకు
ప్రవక్త, ఆయనే వ్యవస్థాపకుడు.
మానవుని సామ్రాజ్యంలో
వేదములే రాజ్యాంగము",
(దై.మ. పు.139)
(చూ॥ మానవుడు)