ఈ ప్రపంచములో ఇంతమంది యువకులుండినప్పటికి ఈ కొద్ది మంది యువకులు మాత్రమే ప్రశాంతి నిలయము చేరటంలో ఎంత అదృష్టవంతులో మీరు. మీకు లభించిన ఈ ప్రాప్తిని మీరు వ్యర్థము చేసుకోకండి. మీరు ఎక్కడికి పోయినా నేను వెంట ఉన్నాను. మీకు ఏ విధమైన బాధలు వచ్చినా నేను చూచుకుంటాను. ధైర్యములో దైవానుభావము మీరు అభివృద్ధిపరచుకొని సేవలలో పాల్గొనండి. నష్టములైనా సహించుకొని సేవలు మానకండి. లాభనష్టములు, సుఖదుఃఖములు వస్తుంటాయి. పోతుంటాయి. దీనికి మనము వెరువకూడదు. దైవచింతన చేస్తూ కూర్చోవాలి. మహాభక్తుడు త్యాగరాజు. కానీ అతనికి చాలా కష్టములొచ్చాయి. ఎంతో భరించుకునే త్యాగరాజు కూడా రామవియోగము భరించుకోలేక బాధపడుతూ రాముని నిందిస్తూ వచ్చాడు. నిందించటమే కాక ఒక విధమైన ద్వేషము వచ్చింది. ఈ ద్వేషముతో ఏమన్నాడు? రామా! నేను ఇన్ని కష్టములు పడుతుంటే నీవు నివారణ చేయలేకపోతున్నావా? ఈ కష్టములు నివారణ చేసే శక్తి నీకు లేదా, లేక నిన్ను కరిగించే భక్తి నాకు లేదా? లేదు, లేదు. నాకు భక్తి ఉంది. నీలో శక్తి లేదన్నాడు. తక్షణమే మేలుకున్నాడు. ఛీ ఛీ. దైవమునకు శక్తి లేదా? మనతో ఆడుతూపాడుతూ ఆనందముగా తిరుగుతుంటే మానవరూపంగా మనము భావిస్తున్నామే. భగవంతుని శక్తి సామర్థ్యములు చాలా గొప్పది అని విచారము చేశాడు. తిరిగి కన్నులు మూసుకున్నాడు. చేతులు కట్టుకున్నాడు, రామా-
కపి వారధి దాటునా కలికి రోటగట్టునా
లక్ష్మి దేవి వలచునా లక్ష్మణుండు కొలుచునా
సూక్ష్మబుద్ధిగల భరతుడు చూచి చూచి మొక్కునా
అబ్బ రామ శక్తి ఎంతో గొప్పరా!
రామా! నీ శక్తి యింత అంత కాదు, ఎంతో గొప్పది. నా బుద్ధి చాలా చిన్నదై పోవటం చేత మందలించాను. నా తప్పే తప్పు. అదే విధముగా మీలో యిలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దైవమును చిందించకండి. -దైవమును విమర్శించకండి. మిమ్మల్ని మీరు విచారించకోండి. మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. మీలో దోషములు మీరు చూచుకోండి. అప్పుడే మీరు బాగుపడతారు. కనుక ఈనాడు విద్యలు నేర్చితిరని విఱ్ఱవీగటం కాదు. ఆధికమైన ఉద్యోగములు చేస్తున్నామని విఱ్ఱవీగటం కాదు. భగవంతుని ప్రేమను సాధించామనే దానికి ఆనందించాలి. ఆ ప్రేమయే సర్వమునకు మూలాధారము. ఏ సాధనలు చేసినా ప్రేమ ఆధారంతోనే చేయాలి. నవవిధ భక్తులుంటున్నాయి.
శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం
వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మవివేదనం.
ఈ నవ విధ మార్గములలో ప్రేమ చేతనే సాధించాలి. ప్రేమయే అన్నింటికి మూలాధారము. ప్రేమ అంతర ప్రవాహము. ఆ ప్రవాహము మనము పెంచుకుంటే ఏ బాధలనైనా సులభంగా సాధించుకోవచ్చు.
(శ్రీ.స.పు.67/68)