నాలుక రసమెరిగిన నాలుకా! మధుర పదార్ధములనే కోరుకొందువేల? గోవిందా, దామోదరా, మాధవా అనే నామరసమును గ్రోలుము!
(శ్రీస.సూ.పు.28)
జిహ్వే రసజ్ఞే మధుర ప్రియే త్వం సత్యం హితం త్వాం పరమం వదామి.
ఆవర్ణయేధా మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. అని బిల్లమంగళుడు చెప్పినాడు. "ఓ నాలుకా! రసమెరిగిన నాలుకా! సత్యమెరిగిన నాలుకా! పవిత్రమైన నాలుకా! గౌరవ మర్యాదలు కాపాడుకొనే నాలుకా నీవు నిరంతరము గోవింద, దామోదర, మాధవ అనే నామాన్ని స్మరించు అన్నాడు. ఇది స్వార్థపరమైన నాలుకా, స్వార్థరహితమైన నాలుకా అని మనమేరీతిగా చెప్పగలము? నిత్య జీవితములో మనకు చక్కగా గోచరమవుతుంటుంది. ఏదైనా మధురమైన పదార్థము నాలుకపైన పెట్టినప్పుడు యీ పదార్థము చాలా మధురముగా వుంటుండాది. అని తాను అనుభవించకుండా జఠరమునకు పంపిస్తుండాది. అది మధురము కాక, మరొక రుచిగా, విరుద్ధమైన రుచిగా వున్నప్పుడు యిది ప్రయోజనము కాదని భూదేవి కందిస్తుంది; నెట్టివేస్తుంది. మంచిగాని, చెడ్డగాని నాలుక యేమాత్రము అనుభవించదు. గౌరవ మర్యాదలతో బ్రతికేది. నాలుక. జీవితపర్యంతము నాలుక అనేక విధములైన పనులు చూస్తుండాది. ఒక్కనాడైనా తన ద్వారము దాటి, తన యిల్లు దాటి బయటకు వస్తుండాదా? ఎన్ని మాటలు మాట్లాడినా నాలుక లోపలే వున్నదిగానీ బయటకు యేమైనా వస్తున్నదా? రావటానికి అంగీకరించదు. ఓపికతో ఉంటుంది. ఎలాంటి కష్టములైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి దు:ఖములైనా సహించుకొని, భరించుకొని తన జీవితాన్ని కాపాడుకొంటూ వస్తుండాది. ఎంతమంది దుష్టుల మధ్య, దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారిలో యేమాత్రమును సంబంధము లేకుండా అతి జాగ్రత్తగా మెలుగుతూ వస్తుంది. నాలుక చుట్టూ ఖడ్గములవలెనుండే 36 దంతములుంటున్నాయి. వీరు యే విషయములో యెట్లు ప్రవర్తించినా ఒక్క నిముషములోనే కట్ చేస్తారు. కానీ యిలాంటి దుర్మార్గుల మధ్యనుండినప్పటికి అతి జాగ్రత్తగా తనకెట్టి ప్రమాదము లేకుండా మెలగుతూ వస్తుంది. కనుకనే యీనాలుక అనేక విధములైన ఉపదేశములు గావిస్తుంది. నాయనా! నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్యనున్నప్పటికీ, వారితో ఏమాత్రము కలహించక వారి బారి పడక, తప్పించుకొని, మెప్పించుకొని తిరుగుమని బోధిస్తుంది. కానీ యీనాటి మన పరిస్థితి! దుర్మార్గుల మధ్యలో చేరితిమంటే, మనము కూడను దుర్మార్గులమైపోతున్నాము. మన సద్గుణములను, మన సద్భావములను, సత్ప్రవర్తనలను ఒక్క క్షణములో కోల్పోతున్నాము. ఇలాంటి పరిస్థితులకు గురి కాకుండా వుండేటందుకు జిహ్వను అరికట్టుకోమని గీత బోధించింది.
(శ్రీగీ.పు.54/55)
దంతముల మధ్య ఎంతో నేర్పుకలిగి
నాల్క సంచరించు నలగ కుండ
నరుడు కూడ అటులే నడవంగ వలెనయా
సత్యమైన బాట సాయి మాట
(సాపు.228)
తనను తాను తెలుసుకొనే నిమిత్తం తనువును ఏర్పర్చుకొన్నాడనే సత్యాన్ని మానవుడు మొట్ట మొదట గుర్తించాలి. ఈ దేహము సార్థకంకావాలి లేనిచో మానవత్వమే వ్యర్థమౌతుంది. ఒకానొక సమయంలో హనుమంతుడు విభీషణుని కలిసాడు. “నాయనా! నీవు ఈ రాక్షసుల మధ్య ఏ విధంగా జీవిస్తున్నావు" అని ప్రశ్నించాడు. "భయంకరమైన దంతముల మధ్య సున్నితమైన నాలుక ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా నేను జీవిస్తున్నాను" అన్నాడు విభీషణుడు. "కాని, ఎంతకాలం నేని జీవితం గడపాలి" అని బాధ పడ్డాడు. అప్పుడు హనుమంతుడు - "విభీషణా! నీవు బాధ పడనక్కరలేదు. పళ్ళు ఊడిపోతాయా? నాలుక త్వరగా ఊడి పోతుందా?మొదట పడిపోయేవి పళ్ళే. నాలుక పడిపోదు. కనుక నీతితో కూడిన మానవునకు ఎట్టి ప్రమాదమూ ఉండదు. దుర్చర్యలతో పరహింసలతో కాలం గడిపే పళ్ళు త్వరలో రాలిపోతాయి. ఆ పళ్ళ వంటిదే రాక్షసత్వము. కనుక, నీవు భయపడనక్కర లేదు" అన్నాడు. దీనికి ఓపికను సాధించాలి. ఓపిక సాధించిన మానవుడు ఎన్ని కార్యములందైనా విజయాన్ని సాధించగలడు.
(స.సా.ఫి 1994 పు. 41)
వాక్కు అగ్నికణమువంటిది. వాక్కును వశము చేసుకుంటే జగత్తునే వశము చేసుకున్న వారమవుతాము. వాక్కు చేత ఎంతటి ఘనకార్యమైనను చేయవచ్చును. ఎంతటి హీనకార్యమైనను చేయవచ్చును. ఈ వాక్కే ఆశీర్వాదమును అందించుతుంది. దూషణను చేకూరుస్తుంది. ఈ జిహ్వకే బిల్వమంగళుడు
"జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం
సత్యం హితం త్వాం పరమం వదామి
ఆవర యేథా మధురాక్షరాణి
గోవింద దామోదర మాధవేతి" అని వర్ణించాడు.
ఓ రసమెరిగిన నాలుకా! సున్నితమైన మధుర భాషణ లాడే నాలుకా!
నీవు అనవసరమైన మాటలలో ప్రవేశించక మధురమైన ఆనందమునందించే గోవింద నామస్మరణ చేయమని బోధించినాడు. "కాలు జారితే కలుగదు నష్టము, నాలుక జారితే నరకమేరా!" అన్నారు. ఈ నాలుకను దుర్వినియోగము చేసినచో హృదయాన్ని ఎంతైనా గాయపరుస్తుంది. ఈ గాయమును మాన్పె డాక్టర్లు జగత్తు నందు కానరారు.
(బృత్ర.పు.55/56)
అతి భాష ఈ నాలుకకు తగదు. నాలుక నాలుగు విధములైన పాపములు చేస్తుండాది. 1. అసత్యమాడటం, 2. చాడీలు చెప్పటం 3. పరదూషణ చేయటం 4. అతిగా భాషించటం ఈ నాల్గింటి వల్లనే మానవులకు అశాంతి అభివృద్ధి అవుతున్నది. సత్యము మాత్రము పలకాలి. కొన్ని సమయములందు సత్యము చెప్పుట వలనప్రమాదమవుతుంది. అట్టి సమయములందు సత్యమూ వద్దూ అసత్యమూ వద్దు. ఈ విధమైన మార్గమును అనుసరించినపుడే సమాజమునందు రాణించగలవు.
(బృత్ర.పు.57/58)
(చూ: నామస్మరణ, శిష్యుడు)