ప్రేమస్వరూపులారా! “జంతూనాం నరజన్మ దుర్లభం" మానవ జన్మ మహా దుర్లభమైనది. ఇది భగవంతునియొక్క వరప్రసాదం. భగవంతుడను గ్రహించిన పవిత్రమైన ఈ మానవ దేహాన్ని పరోపకార సంబంధమైన పనులలో ప్రవేశ పెట్టాలి. కొంతమంది ఎప్పుడు చూసినా పరదూషణలోనే కాలాన్ని వ్యర్థం చేస్తుంటారు. అది అనేక జన్మల పాపఫలం తప్ప అన్యం కాదు. నోటి నుండి దూషణ అనేదే రాకూడదు.నోటినిచ్చినది ఇతరులను తిట్టడం కోసం కాదు. మంచి మాటలు మాట్లాడాలి. "సత్యం కంఠస్య భూషణం, కంఠమునకు అలంకారం ముత్యాల దండ కాదు, డైమండ్నెక్లెస్ కాదు; సత్యమే కంఠమునకు భూషణం. చేతులకు అందము రత్నాల కంకణాలు కాదు. "హస్తస్య భూషణం దానం", దానమే చేతులకు అందము. భగవంతుడు మీకు చెవుల నిచ్చినది ఎందుకోసం? కన్నుల నిచ్చినది ఎందుకోసం? బజార్లో ఎక్కడైనా ఎవరైనా పోట్లాడుతున్నారని తెలిస్తే ప్రజలందరూ అక్కడికి గుంపులు గుంపులుగా పరుగెత్తి పోతారు. ఆ పోట్లాటలు చూడటానికి మీకు కన్సుల నిచ్చినది? వారి దుర్భాషలను వినటానికా మీకు చెవుల నిచ్చినది? ఛీ,ఛీ , మీ కన్నులను ఎంత అపవిత్రం గావించుకుంటున్నారు! మీ చెవులను ఎంత దుర్వినియోగపర్చుకుంటున్నారు! “ప్రొద్దుబోక ఊరివారి సుద్దులంటే మీరు సిద్దమౌదురే కడు శ్రద్ధతోడ, ముద్దుముద్దుగాను భగవత్ ముచ్చటలు చెప్పువేళ ఒద్దికగ నుండరేల ఓ చెవులారా"
భగవంతుడు మీకు చెవుల నిచ్చింది ఊరివారి సుద్దులు వినడం కోసం కాదు. పవిత్రమైన భగవన్నామాన్ని వినడానికి మీకు చెవుల నందించాడు. ఇంక, కన్నులను దేనికోసం ఇచ్చాడు? "పనికిమాలిన సినిమాలు పలుమారు మీరు చనిచని కనినను తనివిలేదే! క్షణమైన దైవసన్నిధి నిలుపగ కనులారా కడు కష్టమౌగా?" కన్నుల నిచ్చినది. భగవంతుని సుందర రూపాన్ని దర్శించడానికేగాని, సినిమాలు, టీవీలు చూడటానికి కాదు. టీవీలు, సినిమాలు చూసి పవిత్రమైన కన్నులను దుర్వినియోగపర్చుకోవడంచేత ఈనాడు చిన్న చిన్న పిల్లలకు కూడా కంటి జబ్బులు వస్తున్నాయి. మధ్యవయస్సు లోనే కన్నులను క్యాటరాక్టు పోరకప్పి చేస్తున్నది. ఈ దేహానికి 75 సంవత్సరాలు వస్తున్నాయి. కాని, నా కన్నులకు క్యాటరాక్టు అనేదే లేదు. కారణమేమిటి? నేను టీవీలు, సినిమాలు చూడను. మీరు చూడవలసింది ఏమిటి? టీవీలు, సినిమాలలలోని వేషాలను కాదు; దైవస్వరూపాన్ని చూడాలి.
(స.పా.మే2000 పు.133)
ఓ పురజనులారా! ఓ గురుబ్రాహ్మణులారా! నమస్కారము. నామాటలను శాంతముతో శాంతముగా వినుడు. స్వార్థపరుడనై నేను దురభిమానముతో ప్రసంగించుట కాదు. నేను మీరాజునని చెప్పుటయు కాదు. మిమ్ముల చెడుమార్గముల సంచరింపుడని బోధించుటయు కాదు. నా మాటలు మంచివని మీకు తోచినయెడల ఆ ప్రకారము సంచరింపుడు. నా మాటలను విని వాటి ప్రకారము నడచుకొనువాడే నా స్నేహితుడు. వాడే నాతమ్ముడు. నేనొక తప్పుమాట చెప్పినను, మీరు వెనుదీయక, నా తప్పును నాకు చూపుడు. అన్ని జన్మలకంటే నరజన్మము దుర్లభము అని వేదపురాణములును,మహానీయులును చెప్పిరి, చెప్పుచున్నారు. ఎంతో పుణ్యము చేసియుండిన కాని నరుడై పుట్టడు. అది దేవతలకు సహితము దుర్లభము. నరజన్మ
మోక్షమునకు ద్వారము. సకల సాధనములకు రాజమార్గము.
(రా.వా.రె.పు.225)
నరజన్మము నందు పుట్టి
నరజన్మము నందు పెరిగి
నరసింగములైన వారు
తొలి సంగతి మరచినారు.
పర మత భేదములు పెంచి
అసురత్వము స్వీకరించి
సమరాలను స్వాగతించి
శాంతి సభలు సలుపుతారు.
(శ్రీ సత్యసాయి దివ్యబోధ 1978 పు 116)