నీ ముఖారవిందము నందెప్పుడును చిరునవ్వు చిందులాడు నట్లుండును. నాకును, నా దర్శనము కొరకు తహతహలాడు వారికిని మధ్య అడ్డురావద్దు. వారి ఆరాటములో నిన్ను ప్రక్కకు త్రోసివేయవచ్చును. అప్పుడు వారిని తిరిగి త్రోసివేయు అధికారము నీకులేదు. నీవు నవ్వుచూ క్షమార్పణ కోరుకుని, రెండు చేతులు జోడించి నమస్కరించుట మాత్రము చేయవలెను.
బాహ్యవిషయముల ద్వారా నా సామీప్యమును పొందలేవు. నీవు నా ప్రక్కనే ఉన్నప్పటికిని చాలా దూరముగానే ఉందువేమో. నాకు ఎంతో దూరముననున్ననూ అతి సామీప్యముగా, సన్నిహితముగా నుండగలవు, సత్యము, ధర్మము, శాంతి ప్రేమల వంటి పెట్టుకొనియున్న నీవెంత దూరములోనున్ననూ, నాకు అతి సమీపమున నుందువు. నేనును నీకు అట్లే యుందును. ఆవియే మిమ్ములను నా దగ్గరకు చేర్చు మార్గములోని మైలు రాళ్ళు..
(శ్రీ.స.సూ.పు.95)
నాకు నిశ్చింత, విశ్రాంతి, సంతృప్తి ఎప్పుడు కలుగునో తెలియునా? మీరు అందరూ ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యము, సేవా తత్పరత అలవరచుకొని ఆనందంగా ఉన్నప్పుడు. నేను నిరంతరమూ ఏదో ఒక కార్యకలాపములో నిమగ్నుడనై ఉండుట మీ మేలు కొరకే! నేనేమి చేయకపోయినను నన్ను అడుగగలవారు ఎవరూ లేరు. నాకు వచ్చు నష్టమూ లేదు. అయినా , నిరంతరము మీకు ఉత్సాహము, ఉత్తేజము కలిగించి మిమ్ము దైవోన్ముఖులుగా చేయు .. ఉద్దేశముతో ఆచరణ రూపమున మార్గదర్శిగా ఉండుటకిట్లు సదా కార్యాచరణ యందు , నిమగ్నుడనై ఉండెదను. బాహ్య విషయముల ద్వారా మీరు నా సామీప్యమును పొందలేరు. మీరు నా ప్రక్కనే ఉన్నప్పటికినీ చాలా దూరముగా ఉందురేమో! సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను అంటి పెట్టుకొని ఉన్నచో మీరు భౌతికంగా ఎంత దూరంలో ఉన్ననూ, నాకు అతి సమీపంగా, సన్నిహితంగా ఉండగలరు. అవియే మిమ్ములను నా దగ్గరకు చేర్చు మార్గములోని మైలురాళ్ళు. .- బాబా (శ్రీ వాణి నవంబ ర్ 2021 పు 71)