అంత్య సమయమున స్మరణకు వచ్చినదే జీవితమునకంతకున ఫలము, కనుక చనిపోవువేళ ఏ సంస్కారము దృఢముగా నుండవలెనను కోరిక యుండునో దాని కమగుణముగా జీవిత ప్రవాహమును త్రిప్పుకొనవలెను. అహా రాత్రులూ దానివైపే దృష్టి యుండవలెను. మరణ సమయమున బలిష్టముగ మనస్సునందుండు భావనయే తన జన్మసార్థక మార్గమునకు దారిబత్తెముగ భావించి భావి జీవిత యాత్రకు బయలుదేరవలెను. కనుక రేపటినుండియే నిరంతరము మరణమును జ్ఞప్తియందుంచుకొని జీవితయాత్ర సద్భావములతో సత్యవాక్కులలో, సర్వేశ్వర స్మరణలలో, సాధుసంఘ సంబంధములతో పాపపు పనులనుకాని, ద్రోహచింతనకు కాని, ప్రాపంచికవ్యామోహములకు కాని చోటివ్వక, అంత్యక్షణము పుణ్యమయము, పవిత్రము మధురము కావలెను. ఇట్టి క్రమములో బ్రతికినన్నాళ్ళు సాధనచేయుచునే యుండవలెను. మంచి సంస్కారమువైపు మనసు మరల్చవలెను. వారి వారి దోషములను వారు గుర్తించినంతనే దిద్దుకొనుటకు ప్రయత్నించవలెను. తన తప్పుతనకు తెలియగానే పునర్జన్మము కలిగినట్లే. అది మానవుని జీవితమునకు నూతన బాల్యావస్థ. ఇదియే మానవునకు నిజ మేలుకొల్పు,
(ప్రే.వా.పు.3/4)