దైవము ఎక్కడ వున్నాడు? ఎట్లా వుంటాడు? విచారణ చేస్తే ప్రత్యక్ష స్వరూపముగా ప్రకృతియే మనకు ఆన్సర్ యిస్తున్నాది. సుర్యోదయము, సూర్యాస్తమయము జరుగుతున్నాయి. దినముల వల్ల నెలలు, నెలలవల్ల సంవత్సరములు జరుగుతున్నాయి. ఇది జరగటానికి కారణం ఏమిటి? భూమి తనచుట్టూ తాను గంటకు వేయిమైళ్ల వేగముతో తిరుగుతున్నది. అట్లా తిరగటం చేతనే సూర్యోదయము. సూర్యాస్తమయము జరుగు తున్నాయి. ఇవి జరిగినంత మాత్రమున లభించే ఫలితము ఏమిటి? భగవత్సంకల్పము చాల విశాలమైనది ఎవ్వరూ దీనిని అర్థము చేసుకోలేరు. భూమి సూర్యుని చుట్టూ గంటకు 66 వేల మైళ్ళ వేగముతో తిరుగుతుండాది. చూశారా! తన చుట్టూ తాను గంటకు వేయి మైళ్ళ వేగంతో తిరుగుతూవుండి సూర్యుని చుట్టూ గంటకు 60వేల మైళ్ళ వేగముతో తిరుగుతున్నది. సూర్యుని చుట్టూ తిరగటము మూలముగా ఋతువులు ఏర్పడుతున్నాయి. ఈ ఋతువులవల్ల వర్షములు కురుస్తున్నాయి. పంటలు పండుతుండాయి. పంటలకు ఏమీ తక్కువ లేకుండా వుండాది మన ఆహార విహారములకు యీ భూమి తత్వము ఎంత వుపకారముగా వుంటుండాది. ఇదియే ప్రత్యక్ష దైవము. "పశ్యనపిచన పశ్యతి మూఢః"నీవు భగవంతుని చూస్తూ కూడను చూడలేదు చూడలేదు అనుకుంటున్నావు చాల పొరపాటు. ప్రకృతియే పరమాత్మస్వరూపము. ఈ ప్రకృతి వల్ల మనము గుర్తించవలసినది యేమిటి? క్రియాశీలం. మన కర్తవ్యమును మనము నిర్వర్తించాలి. ప్రకృతి తన కర్తవ్యమును తాను పాటిస్తూ వుండటం చేతనే జగత్తుకు వుపకారము చేయ గలుగుతున్నది. సృష్టి యొక్కరహస్యము కర్తవ్యాచరణే. ఏ కర్మలో నీవు ప్రవేశిస్తున్నావో ఆకర్మను నీవు శ్రద్ధాభక్తులతో చేయి.
(బృత్రపు. 117/118)