సమస్తదు:ఖములకు మూలకారణము యింద్రియముల బలహీనతే. వీటిని బలముగా వుంచుకొని, తగిన కార్యములలో ప్రవేశింపచేసుకొని, పెడమార్గము పట్టకుండా చూసుకొనే విషయములో మనము నిగ్రహించుకోవాలి. భగవద్గీతలో యింద్రియ నిగ్రహము అన్నారే కాని యింద్రియ నిర్మూలనము అనలేదు. కర్మత్యాగమని చెప్పలేదు. కర్మఫలత్యాగము అన్నాడు. భగవద్గీతలో చెప్పినారని కర్మలు చేయకుండా వుండటానికి వీలు కాదు. కర్మ చేసే తీరాలి. శ్రీకృష్ణుడు,
“నమే పార్థా స్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన,
నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి.”
ఏ ఫలితము లేకపోయినా నేనే చేస్తున్నాను. నాకే కర్మలు లేకపోయినా నేనే కర్మ చేస్తున్నాను. నీవెందుకు చేయకూడదు? అన్నాడు. మనము అన్ని కర్మలు చేయవలసినదే. అన్ని యింద్రియములను ఉపయోగ పెట్టుకోవలసినదే. మాత్ర: అని చెప్పినట్లుగా యే పరిమితిలోనో యే కొలతతోనో దీనిని ప్రవేశ పెట్టుకోవాలి. దీనిని పెడమార్గము పట్టించుకోకుండా యింద్రియములను వుపయోగించుకోమని చెప్పాడు. ఇదియే భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశము.
(శ్రీస. గీ. పు. 180)
కర్మలు చేయండి కాని, వాటి ఫలాల కోసం ప్రాకులాడవద్దు. ఏదైనా ధర్మసంస్థకు విరాళం ఇచ్చినప్పుడు తగినంత గుర్తింపు రాలేదని ఫిర్యాదు చేయకండి. సత్ఫలములైనా, దుష్పలములైనా ఆరగించవలసిన భోక్తలు మీరే.... ఐతే, కర్మఫలానుభవం నుండి తప్పించుకోవాలంటే - కర్మ కోసమే కర్మను చేసి దాని ఫలితం సంగతి విస్మరించడం ఉత్తమమైన మార్గము. ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తే పాపపుణ్యాల ఫలితం మిమ్మల్ని బాధ పెట్టదు. లాభం కావాలని కోరితే నష్టానికి కూడా నీవు సిద్ధంగా ఉండాలి.
ప్రేమతో నీవు ఎవరికైనా విసనకర్రతో విసురుతున్నప్పుడు నీ ఇష్టం వచ్చినప్పుడు ఊరుకోవచ్చును. కాని, జీతం పుచ్చుకొని ఫంకా లాగే జవాను ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పని చేస్తూ ఉంటే బాధ కలుగుతుంది. ప్రతిఫలాన్ని అడిగినా పుచ్చుకొన్నా నీకు బంధన తప్పదు. కర్మఫలం త్యాగంలో ఉన్న రహస్యమిదే....
(ప్రే.బ. పు. 86)