"భగవదవతారము ఇది చేయగలదు. అది చేయలేదు. అని నిర్ణయించు అధికారమెవ్వరికీ లేదు." నేను కాలేజి (శ్రీసత్యసాయి మహిళా కాలేజి అనంతపురము) ప్రారంభించుటకు (22.7.1968) అడ్డమేమియుండును? పుష్పము తన సహజ పరిమళమును మారుతమున కందించుట నెవరు నిరోధించగలరు. జ్ఞాన బోధయే నా సంకల్పము. మానవుడు తన సహజ దివ్యతత్వమును తెలుసుకొనునట్లు చేయుట కవసరమైన అన్ని మార్గములూ అవలంబించెదను." "తమసోమా జ్యోతిర్గమయ అని మీరు ప్రార్థించుచుందురు కాదా!"
జాతి యొక్క ఔన్నత్యమూ, సుస్థిరతల స్త్రీల యొక్క ఆధ్యాత్మిక సంస్కృతి మీద ఆధారపడి వుండును. నేడు సమాజములో ప్రబలుచున్న అన్యాయ అధర్మ అక్రమ అత్యాచారములకు కారణము తల్లుల పెంపకములోని లోపమే. దానికి కారణము వారి ఆశ్రద్ధ కావచ్చును. లేదా వారి యజ్ఞానము కావచ్చును. లేదా పిల్లలలో సదాలోచన సత్ప్రవర్తన పెంపొందించు బాధ్యతను పురుషులు స్త్రీల కిచ్చి యుండురు. జరిగినదేదో జరిగిపోయింది. భావి తరముల వారి శ్రేయస్సు దృష్ట్యా ఇకనైననూ స్త్రీలను ఆదర్శమైన మాతృమూర్తులుగా రూపొందించు విద్యను వారికి అందించుట అత్యవసరము. వారు నిర్వహించ వలసిన బాధ్యతల కనుగుణ్యమైన జ్ఞానమూ, సహనమూ, విశ్వాసమూ అందించు విద్య వారికి గరపవలెను.
“క్షేత్ర జ్ఞానము భుక్తికీ, ఆత్మజ్ఞానము ముక్తికీ మానవుల కవసరము. ఏకైక ఆశ్రయమూ బంధువూ, సఖుడూ, రక్షకుడూ అయిన భగవంతుని దూరముచేయు విద్యను గరపు విద్యాలయము వెలుతురు కోరివచ్చిన వారి కండ్లు పొడిచి అంధులను చేయు అంధుల నడుపు సంస్థవంటిది. "ఆధ్యాత్మిక సంస్కృతికి స్త్రీలు కోట బురుజులు - వంటివారు. కానీ, నేటి విద్యావంతులయిన స్త్రీల ప్రవర్తన, వారి అభిరుచులు, వారి చదువు సాహిత్యము, వారు చూచు అసభ్యమైన చలన చిత్రములు జుగుప్స కలిగించక మానవు.
"పుట్టిన ప్రతివ్యక్తి తన జీవితమున కొక అర్థమూ పరమార్థమూ లభింపజేసినందుకు ఐదుగురు మాతృ దేవతలకు ఋణపడివుండును. మొదటిది దేహమాత అనగా కన్నతల్లి, రెండవది గోమాత, పాలిచ్చు గోవు, భూమిని దున్ను ఎద్దు, మూడవది భూమాత, తినుటకు తిండి ఉండుటకు చోటు యిచ్చి రక్షించిన తల్లి, నాలుగవది దేశమాత: సంస్కారం, సాంప్రదాయం, జీవితమున కొక లక్ష్యం అందించిన తల్లి, అయిదవది వేదమాత, ఆధ్యాత్మిక జ్ఞాననిధి. జన్మ యిచ్చి మిగిలిన మాతృదేవతలతో సంబంధము కలిగించిన దేహమాత అత్యంత పూజ్యురాలు, అందువలననే ప్రప్రథమముగా మహిళలకు కళాశాల స్థాపించి సర్వతోముఖమైన సనాతన ధర్మమునకు నాందీవచనము పలుక సంకల్పించితిని"ఆత్మ విద్య యొక్కటే మన ధర్మమందు నిలుపగలుగును."
(స.శి.సు.తృపు 7|9)||
భారతదేశ మీనాడు ఆకాశము నందుకొను భవనములలో, నిల్వచేసిన ఆహారములలో రేడియో, టెలివిజన్ మొదలయిన యంత్రములలో భోగ భూమిగా తయారగుచున్నది. భారతీయులు అనుకరుణకు బానిసలై క్రమశిక్షణా రహితులై నిర్లక్ష్యమైన మూకగా తయారగుచున్నారు. వేరులు లేని మొక్కల వలె వారు ఇతర దేశముల జీవన విధానమును పట్టుకుని ప్రాకులాడుచున్నారు. ఇది భారతీయ సాంప్రదాయమునకే అవమానము, చరిత్ర పట్ల ద్రోహము. పవిత్రమైన కాలమును, కాయమును వృధా చేయుచూ భ్రష్టులగుచున్నారు. అందుకే గురుకులము వంటి ఈ కళాశాలను, గురువారము నాడు గురు పూర్ణిమ పర్వదినమున ప్రారంభించ సంకల్పించితిని.
(స.శి.సు.తపు . 164)