జీవితమంతా పంచభూతములతో, పంచ ప్రాణములతో,పంచేంద్రియములతో,పంచకోశములతోనిండియుంటున్నది.కనుక,పంచభూతములతోకూడినఈశరీరమునకు50 సం॥ల వరకు ఒక విధమైన enjoyment ఉండాలి. అదే యౌవనము. ఈ యౌవనంలో ఉండవలసిన Enjoyment ఏమిటి; ఏదో పెండ్లి చేసుకోవడం, డజన్ల కొలది పిల్లలను కనడం కాదు. ఈ యౌవనంలో కార్యాచరణలో తగిన శక్తిని నిరూపించాలి. ఈ యౌవనం కదలిపోయే మేఘం వంటిది. దీనిని చూసి గర్వించరాదు. ఈనాడు ఏదో దేహ ప్రమాణమును పురస్కరించుకొని 20 నుండి 40 సం ||ల వరకు యావనము అని నిర్ణయిస్తున్నారు. కాని, ప్రాచీనకాలంలో యౌవనమనగా ఏమిటి? కేవలం దేహానికి సంబంధించిన వయస్సే ప్రమాణం కాదు. మానసిక సంబంధమైన శక్తి కూడా ఉండాలి. మహాభారత యుద్ధంలో భీష్మునికి 112 సం॥ల వయస్సు అయినా అతడు కమాండర్-ఇన్-చీఫ్ గా నిలిచాడు. అప్పుడు అది యౌవనం! దేహాన్ని బట్టి 112 సం॥ల వయస్సు యౌవనమవుతుందా? కాదు, కాదు. మనో శక్తిని బట్టి అది యౌవనము. కాబట్టి అట్టి మనోశక్తిని పోషించుకొని మన జీవితమంతా యౌవనంగానే బ్రతకాలి. అదే Will-power ఇది దైవం నుండి ప్రారంభమయ్యేదే! ఆ will-power చేతనే మనం సరియైన స్థితిని సాధించాలి. కనుక, 50 సం॥ల వరకు నీవు సంసార సంబంధమైన బాధ్యతలు వహిస్తూనే కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
ఇంక 60 సం॥లు వచ్చేటప్పటికి భారతీయులు "శాంతిపూజ" చేస్తారు. ఏమిటి శాంతిపూజు? అరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకోవడమే శాంతి పూజ, తరువాత 70వ సంవత్సరం వస్తుంది. ఇది సప్త ఋషుల స్థానము, సప్త సముద్రముల స్థానము, సప్త స్వరముల స్థానము, సప్తరంగుల స్థానము. కనుక, 70వ సం॥లో ఋషిత్వాన్ని పొందాలి. ఇంక, 80వ సం॥లో ఏమిటి? అష్ట గ్రహములలో నీవు ఒక గ్రహముగా ఉండాలి. 90వ సంలో నవగ్రహములలో నీవొక గ్రహం కావాలి. గ్రహములనగా ఏమిటి? శక్తివంతమైనవి కనుక, నవ గ్రహములలో నీవొక శక్తిమంతుడిగా ఉండాలి. అనగా ఏమిటి? నెగటివ్ ను మర్చిపోయి పాజిటివ్ లోనే నీవు జీవించాలి. ఇంక 100 సం॥లో దశేంద్రియాలను దైవంలో లీనం చేయాలి. అప్పుడు నీకీ దేహభ్రాంతి ఉండదు. దేహ భ్రాంతి ఉండినంతవరకు నిత్యానందాన్ని పొందడానికి వీలు కాదు. దేహ భ్రాంతి పెరుగుతుంది. కనుక, కోరికలను తగ్గించుకోవాలి.
(స. సా..డి.95 పు.300)